Share News

శాసనసభ అధ్యక్ష పీఠంపై ప్రసాద్‌కుమార్‌

ABN , Publish Date - Dec 14 , 2023 | 11:29 PM

వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో స్పీకర్‌గా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

శాసనసభ అధ్యక్ష పీఠంపై ప్రసాద్‌కుమార్‌
అసెంబ్లీలో స్పీకర్‌ పీఠం వద్ద ప్రసాద్‌కుమార్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు

వికారాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో స్పీకర్‌గా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్‌ పదవికి ప్రసాద్‌కుమార్‌ ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత దళిత ఎమ్మెల్యేకు స్పీకర్‌ పదవి దక్కడం ఇదే తొలిసారి. అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్‌కుమార్‌ ఎన్నికైనట్లు ప్రకటించగానే జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వికారాబాద్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయి పంచుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొడంగల్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా, ఇదే జిల్లా వికారాబాద్‌ ఎమ్మెల్యే అయిన ప్రసాద్‌కుమార్‌కు రాజ్యాంగ బద్ధ కీలక పదవి అయిన శాసనసభ స్పీకర్‌ పదవి దక్కడం విశేషం. కాగా ఒకే జిల్లాకు ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్‌ పదవులు దక్కడం ఇదే తొలిసారి.

పాల ఎల్లమ్మ తనయుడే శాసన సభాపతి!

తాండూరు: మండలంలోని బెల్కటూరుకు చెందిన పాల ఎల్లమ్మ కుమారుడే శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌. చిన్ననాడే తండ్రిని కోల్పోయిన ప్రసాద్‌కుమార్‌ను తల్లి ఎల్లమ్మ పెంచిపోషించారు. తాండూరు కుమ్మరిగల్లిలో ఉంటూ పాలు విక్రయిస్తూ ప్రసాద్‌కుమార్‌ తాండూరు విలియమూన్‌ హైస్కూల్‌లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివించారు. తాండూరులో ఇంటర్‌, జహీరాబాద్‌లో పాలిటెక్నిక్‌ చేశారు. ప్రసాద్‌కుమార్‌ నగరంలోని హిమాయత్‌నగర్‌లో ప్రింటింగ్‌ ప్రెస్‌ నడిపారు. స్నేహితుడి సూచన మేరకు రాజకీయాల్లోకి వచ్చి ఎంపీటీసీ నుంచి అసెంబ్లీ స్పీకర్‌గా అంచలంచెలుగా ఎదిగారు. కాగా తాండూరు బిడ్డ స్పీకర్‌గా కావడం తమకు గర్వంగా ఉందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అసెంబ్లీలో అన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 11:29 PM