పాతిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం

ABN , First Publish Date - 2023-03-25T23:19:22+05:30 IST

పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన తాండూరు మండలంలోని ఖాంజాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది.

పాతిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం
మృతదేహాన్ని వెలికి తీస్తున్న గాంధీ ఆస్పత్రి ప్రొఫెసర్లు

తాండూరు రూరల్‌, మార్చి 25: పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన తాండూరు మండలంలోని ఖాంజాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు, గ్రామ సర్పంచ్‌, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాంజాపూర్‌ గ్రామానికి చెందిన దాసరి వెంకటప్ప(38) ఈనెల 14వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే అతడు మూర్ఛవ్యాధితో మృతిచెందాడని భార్య సుజాత నమ్మించి అదే రోజు గ్రామ శివారులోని కూడలవాగు సమీపంలో అంత్యక్రియలు పూర్తయ్యేలా చేసింది. అయితే వెంకటప్ప మృతదేహానికి స్నానం చేయించే సమయంలో గొంతు వద్ద గాయాలున్నాయని, ఇది ముమ్మాటికీ హత్యేనని ఆయన కుమారులు అభిషేక్‌, ఆనంద్‌లు గ్రామసర్పంచ్‌ లలితకు ఫిర్యాదు చేశారు. అయితే సర్పంచ్‌ ఈవిషయమై ఈనెల 17న తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాండూరు పోలీసులు కేసునమోదు చేసుకుని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఈమేరకు తాండూరు తహసీల్దారు చిన్నప్పలనాయుడు శనివారం గాంధీ ఆస్పత్రి ప్రొఫెసర్లు వేణుగోపాలు, ఝాన్సిలక్ష్మిల ఆధ్వర్యంలో తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐ.మహిపాల్‌రెడ్డి, గ్రామస్థుల సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే పోస్టుమార్టం నివేదిక రాగానే నివేదిక ప్రకారం చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. వారి వెంట సర్పంచ్‌ లలిత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ బాల్‌రాజ్‌, గ్రామస్థులు వెంకటేష్‌, మహేందర్‌ ఉన్నారు.

Updated Date - 2023-03-25T23:19:49+05:30 IST