అసైన్డ్‌ భూమి కబ్జా

ABN , First Publish Date - 2023-06-28T23:50:09+05:30 IST

అసైన్డ్‌ భూములు పరుల పాలు అవుతున్నాయి. గతంలో రెవెన్యూ అధికారుల తప్పిదమో లేక రికార్డుల్లో మాయాజాలమో తెలియదు గానీ తరచూ భూ వివాదాలు వెలుగుచూస్తున్నాయి.

అసైన్డ్‌ భూమి కబ్జా
మొండిగౌరెల్లిలోని అసైన్డ్‌ భూమి

పేదలకు పంచిన భూమిలో పెద్దల పాగా!

మొండిగౌరెల్లిలో లీజు పేరుతో ఆక్రమణలు

అక్రమంగా క్రయవిక్రయాలు

అసైనీల భూములు వేరేవారికి బదలాయింపు

చోద్యం చూస్తున్న అధికారులు

అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. గతంలో ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన భూముల్లో ఇప్పుడు రియల్టర్లు తిష్ట వేస్తున్నారు. నిబంధనల మేరకైతే ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఎవరికీ అమ్మకూడదు. అసైనీ తదనంతం వారి వారసులకే దానిపై హక్కులుంటాయి. వారూ లేకుంటే ప్రభుత్వమే భూమిని స్వాధీనం చేసుకుంటుంది. కానీ చిత్రంగా మొండిగౌరెల్లిలోని సర్వే నెంబర్‌ 127లో గల 122.2 ఎకరాల్లో ఉన్న అసైన్డ్‌ భూమిలో కొందరు వేరే వ్యక్తులు చొరబడి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఏకంగా పట్టానే మార్పిడి చేసుకున్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

యాచారం, జూన్‌ 28: అసైన్డ్‌ భూములు పరుల పాలు అవుతున్నాయి. గతంలో రెవెన్యూ అధికారుల తప్పిదమో లేక రికార్డుల్లో మాయాజాలమో తెలియదు గానీ తరచూ భూ వివాదాలు వెలుగుచూస్తున్నాయి. యాచారం మండలం మొండిగౌరెల్లిలోని సర్వే నెంబర్‌ 127లో ఉన్న 122.2 ఎకరాల ప్రభుత్వ భూమిలో గతంలో 77మందికి అసైన్డ్‌ పట్టాలిచ్చారు. ఇవే భూములను ఇప్పుడు కొందరు కాజేస్తున్నారు. జీవో 58, 59 సాకుతో ఈ భూముల్లో నిర్మాణాలకు ప్రయత్నిస్తున్నారు. సర్వే నం:127/31లో 3ఎకరాల 30గుంటల భూమి 1954లో వారాల చంద్రమ్మ పేరిట ప్రభుత్వం కేటాయించింది. ఇదే భూమి ఇప్పుడు మొగిలి సురేందర్‌రెడ్డి పేరుతో ఉంది. అసైన్డ్‌ ల్యాండ్‌ అమ్మొద్దనే నిబంధన ఇక్కడ పాటించలేదు. చంద్రమ్మ అసైన్డ్‌ భూమి సురేందర్‌రెడ్డికి బదిలీ చేశారు. అ భూమిలో కొందరు వెయ్యి గజాల్లో నిర్మాణాలు చేపట్టారు. తాము జీవో 58, 59 కింద రెగ్యులరైజేషన్‌కు దరఖాస్తు చేశామని అధికారులతో చెబుతున్నారు. వారాల చంద్రమ్మ భర్త ఎక్స్‌ సర్వీ్‌స మ్యాన్‌ అని కొందరు అంటుండగా.. అసలు అతడిది తమ గ్రామమే కాదని మరికొందరు చెబుతున్నారు. ఇదే భూములో కొంత సుధాకర్‌నాయుడు అనే వ్యక్తి 50ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకరు ఇల్లు కట్టి ప్రహరీ నిర్మించి గెస్ట్‌హౌ్‌సగా మార్చారు. దీనికి యాచారం పంచాయతీ ఇంటి నెంబర్‌ సైతం కేటాయించింది. గతంలో వీఆర్వోలు డబ్బు తీసుకొని సహకరించారని సమాచారం. ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే చేసి 127 సర్వే నంబర్‌లో అక్రమ నిర్మాణాలున్నట్టు గుర్తించారు. కాగా ఈ అసైన్డ్‌ భూమి చాలా మంది చేతులు మారినట్లు తెలుస్తోంది. మొండిగౌరెల్లి సర్వే నెం 127లోని భూములపై ఉన్నతాధికారులు విచారణ చేస్తే అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఈ భూములు హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ రహదారికి, యాచారానికి దగ్గరగా ఉండడంతో ఎకరం ధర రూ.కోట్లలో ఉంది. దీనిపై బడాబాబులు, రియల్టర్ల కన్ను పడడంతోనే అక్రమాలకు తెగిస్తున్నారు. అధికారులు ఈ భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని కోరుతున్నారు.

వారాల చంద్రమ్మ భూమి ఆమె వారసులకే చెందాలి : ఎం.మహిపాల్‌రెడ్డి, రైతు, మొండిగౌరెల్లి

ప్రభుత్వం వారాల చంద్రమ్మకు ఇచ్చిన భూమి ఇతరుల పేరుతో ఎలా రికార్డు చేస్తారు? ఆమె భూమిని ఇతరులు స్వాధీనం చేసుకున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. దీనిపై అధికారులు విచారణ చేసి అసైనీ వారసులకే భూమి చెందేలా చర్యలు తీసుకోవాలి. దీనిపై వెంటనే స్పందించాలి.

అక్రమ నిర్మాణాలను కూల్చేయాలి : బండమీది కృష్ణ, సర్పంచ్‌, మొండిగౌరెల్లి

127 సర్వే నెంబర్‌లోని అసైన్డ్‌ భూమి కబ్జా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. బాల్‌రెడ్డి అనే వ్యక్తి ఇల్లు కట్టినా కూల్చలేదు. ఆయన అసైన్డ్‌ భూమిలోనే ఇల్లు కట్టాడని సర్వేలో తేలినా అధికారులు చర్యలు తీసుకోలేదు.

అసైన్డ్‌ భూమిలో నిర్మాణాలు చేపడితే చర్యలు : సుచరిత, తహసీల్దార్‌

అసైన్డ్‌ భూమిలో అసైనీ రైతు వ్యవసాయ అవసరాల కోసం తాత్కాలికంగా గుడిసెలు వంటివి వేసుకోవచ్చు తప్ప.. అసైనీలైనా, వేరే ఎవరైనా శాశ్వత నిర్మాణాలు చేయొద్దు. ఈ భూమిలో క్రయవిక్రయాలు, లీజులు చెల్లవు. చట్ట ప్రకారం ప్రభుత్వ భూమిని కాపాడడం మా భాద్యత. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2023-06-28T23:50:09+05:30 IST