శివార్లలో రాజకీయ సందడి

ABN , First Publish Date - 2023-05-25T22:57:20+05:30 IST

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

శివార్లలో రాజకీయ సందడి

ఫామ్‌హౌసుల్లో నేతల మంతనాలు

బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీ

పొంగులేటి, జూపల్లితో ఈటల సమావేశం

కేఎల్లాఆర్‌తో రోహిత్‌ చౌదరి, మాణిక్‌రావు ఠాక్రే భేటీ

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, మే 25 : ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అదేవిధంగా అసంతృప్తులను బుజ్జగించి దారికి తెచ్చుకోవడంతో పాటు ఇతర పార్టీల్లో అసమ్మతినేతలను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా రహస్య సమావేశాలు, భేటీలు నిర్వహిస్తున్నాయి. వీటికి నగర శివార్లలోని ఫామ్‌హౌ్‌సలు వేదిక కావడం గమనార్హం. అధికార బీఆర్‌ఎ్‌సలో అసమ్మతి నేతలుగా ముద్రపడి ఇటీవలే బహిష్కరణ వేటుకు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో బీజేపీ నేత ఈటల రాజేందర్‌ గురువారం నగర శివార్లలోని ఓ ఫామ్‌ హౌస్‌లో రహస్యంగా భేటీ అయ్యారు. అనుచరులు, సెక్యూరిటీ సిబ్బంది లేకుండా రహస్యంగా భేటీ అయ్యారు. పొంగులేటి, జూపల్లిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌ గురువారం దాదాపు అయిదుగంటల పాటు వీరితో భేటీ అయ్యారు. బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు కూడా నగర శివార్లలోని ఓ ఫామ్‌హౌ్‌సలో భేటీ అయ్యారు. అంతర్గత విభేదాల వల్ల పార్టీకి దూరమైన మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితో కాంగ్రెస్‌ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేతో పాటు ఏఐసీసీ జాతీయ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, ఏఐసీసీ నాయకులు ప్రేమ్‌సాగర్‌రావు సమావేశమయ్యారు. కేఎల్లాఆర్‌తో శంషాబాద్‌లోని ఆయన ఫామ్‌హౌ్‌సలో గురువారం దాదాపు రెండుగంటల పాటు భేటీ అయ్యారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడాన్ని నిరసిస్తూ కేఎల్లాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాను పార్టీ అధినాయకత్వం ఆమోదించలేదు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కూడా ఆయన ఓటు హక్కు కొనసాగించారు. కానీ అధినాయకత్వంపై అలకబూనిన ఆయన ఓటు వేసేందుకు వెళ్లలేదు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో తిరిగి ఆయన్ని పార్టీలోకి తీసుకువచ్చి క్రియాశీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. కర్నాటక ఎన్నికల తరువాత జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అసంతృప్తి నేతలను బుజ్జగించి పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే కేఎల్లాఆర్‌తో పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారు. పార్టీలో కొనసాగేందుకు ఇబ్బందులు ఏమిటనీ ప్రశ్నించారు. సీనియర్లకు పార్టీలో సరైన గౌరవం కల్పించాలని కేఎల్లాఆర్‌ కోరారు. దీనిపై మాణిక్‌రావు ఠాక్రే, రోహిత్‌ చౌదరి స్పందిస్తూ అన్ని ఇబ్బందులను తొలగిస్తామని, మంచి హోదా కూడా కల్పిస్తామని వారు కేఎల్లాఆర్‌కు హామీ ఇచ్చారు. ఇక నుంచి క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు. దీనికి కేఎల్లాఆర్‌ సానుకూలంగా స్పందించారు. దీంతో కేఎల్లాఆర్‌ మళ్లీ కాంగ్రె్‌సలో చురుకుగా వ్యవహరించే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-05-25T22:57:20+05:30 IST