తెగులు.. దిగులు!

ABN , First Publish Date - 2023-09-22T00:15:01+05:30 IST

వ్యవసాయం అంటేనే గాలిలో దీపం వంటి పరిస్థితి. విత్తనం వేసినప్పటి నుంచే రైతులకు ఇబ్బందులు మొదలవుతాయి. ఎందుకంటే వేసిన విత్తనం నాణ్యమైనదేనా.. లేదా? అనేది మొదటి అనుమానం.

తెగులు.. దిగులు!
రాఘవాపూర్‌లో తెగులు సోకి వాడిన పత్తి మొక్కలు

నష్టాల బాటలో పత్తి రైతులు

తెల్ల బంగారానికి సోకుతున్న సడన్‌ విల్ట్‌

అధిక వర్షాలతో రాలుతున్న పూత, కాత

దిగుబడిపై పడనున్న ప్రభావం

పెట్టుబడైనా వచ్చేనా?

ఆందోళనలో రైతన్నలు

ధర బాగా ఉందని రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపారు. అయితే విత్తనం మొదలు గూడ, కాత వరకు వివిధ రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నేల నీరు పట్టి పత్తిచేలు పూత, కాయలు రాలుతున్నాయి. మరో వైపు మొక్కలకు ప్యారావిల్ట్‌/సడెన్‌ విల్ట్‌ అనే తెగులు సోకి వేరు కుళ్లి మొక్కలు చనిపోతున్నాయి. ఈ వానకాలంలో ఉమ్మడి జిల్లాలో 2,46,846 ఎకరాల్లో పత్తి సాగుచేశారు. పంట ఏపుగా పెరుగుతున్న దశలో సోకుతున్న తెగుళ్లతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడనుంది. పెట్టుబడైనా వస్తుందా? అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పరిగి, సెప్టెంబరు 21: వ్యవసాయం అంటేనే గాలిలో దీపం వంటి పరిస్థితి. విత్తనం వేసినప్పటి నుంచే రైతులకు ఇబ్బందులు మొదలవుతాయి. ఎందుకంటే వేసిన విత్తనం నాణ్యమైనదేనా.. లేదా? అనేది మొదటి అనుమానం. విత్తనం సరిగా మొలకెత్తుతుందా? లేదా? అనేది మరో అంశం. అన్నీ సక్రమంగా ఉండి మొలకెత్తినా చేను చీడపీడల బారిన పడకుండా ఉంటుందా? అనేది మరో సంశయం. ఇవన్నీ దాటి తీరా పంట చేతికందే దశలోనూ వర్షాలు, వడగళ్లు పడకుండా పంట కోసుకుంటామా? అనే సంకట పరిస్థితి. ఇలా పంట చేతికందేదాకా ప్రతీ దశలోనూ రైతులకు ఇబ్బందులు తప్పవు. కొన్ని సార్లు పెట్టుబడి కూడా రాక నష్టాలపాలవుతారు. తాజాగా పత్తి చేలకు తెగులు సోకింది. ధర బాగా ఉందని తెల్లబంగారాన్ని సాగుచేసిన రైతులు.. పంటకు సోకుతున్న తెగులుతో తెల్లముఖాలు వేస్తున్నారు. అధిక వర్షాలు, ఎండలు అన్నీ దాటుకొని ఇప్పుడిప్పుడే పంట ఎదుగుతున్న సమయంలో ఇటీవల కొన్ని రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పూత, కాత రాలుతోంది. మరో వైపు పత్తికి ప్యారావిల్ట్‌/సడెన్‌ విల్ట్‌ అనే తెగులు సోకి మొక్కలు ఎండుతున్నాయి. కాయలు రాలుతున్నాయి. మొదట్లో అంతంత మాత్రమే కురిసిన వానలు ఇటీవల భారీగా పడడంతో పత్తి మొక్కలకు నీరేసి వేళ్లు కుళ్లి ఎండుతున్నాయి. మొక్కలకు ప్యారావిల్ట్‌/సడెన్‌ విల్ట్‌ తెగులు సోకుతోంది. పంటను కాపాడుకునేందుకు రైతులు రకరకాల రసాయన మందులు పిచికారి చేశారు. పంట పెరుగుతున్న దశలో భారీ వర్షాలతో మొక్కలు ఎండుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏటేటా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ వానకాలంలో సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలోనే పత్తి సాగుచేశారు. గతేడాది 2.2లక్షల ఎకరాల్లో పత్తి వేయగా.. ఈ సారి 2,46,846 ఎకరాల్లో వేశారు. జూలైలో భారీ వర్షాలకు మొలకలు దెబ్బతిన్నాయి. ఆగస్టులో నెల రోజలు చినుకైనా రాలలేదు. దీంతో మొక్కలు ఎండిపోయాయి. సెప్టెంబర్‌లో వారం రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మొక్కలకు తెగుళ్లు సోకుతున్నాయి. గూడ, కాయలు రాలుతున్నాయి. నేల నీరుపట్టి ప్యారావిల్ట్‌/సడెన్‌ విల్ట్‌ తెలుగు సోకిందని రైతులు చెబుతున్నారు. పరిగి ప్రాంతంలో అధిక వర్షాలతో పత్తి పంటకు తెగులు సోకి దిగుబడి పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు వాపోతున్నారు. కాగా పరిగి, పూడూరు, చేవెళ్ల, వికారాబాద్‌ ప్రాంతాల్లో పత్తి ఎక్కువగా సాగు చేశారు.

పెట్టుబడి మందమైనా దిగుబడి వచ్చేనా ...

విత్తనాలు నాటిన దశ నుంచే ఈ ఏడాది రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఒక నెల అధిక వర్షం, మరో నెలలో కరువుతో మొక్కల్లో ఎదుగుదల లోపించింది. ఎరువు వేసే సమయాల్లో వాన పడలేదు. దీంతో మొక్కలకు ఎరువులు అందలేదు. కొన్ని గ్రామాల్లో విత్తిన తరువాత వానల్లేక మొలకలు భూమిలోనే ఎండిపోయాయి. చాలా మంది రైతులు రెండు సార్లు విత్తుకున్నారు. ఇలాంటి సరిస్థితుల్లో విత్తన సమయంలోనే రెండుసార్లు డబ్బు వెచ్చించారు. తర్వాత మొలకల దశలో భారీ వర్షాలతో నేల నీరు పట్టి చేను ఎదగలేదు. ప్రస్తుతం చేలు ఏపుగా పెరుగుతున్నాయనుకుంటే ఉన్నట్టుండి మొక్కలు ఎండుతున్నాయి. గూడలు, కాయలు రాలుతున్నాయి. రైతులు ఎరువులు, పురుగు మందులు, కలుపుతీత వంటి పనులకు భారీగానే పెట్టుబడి పెట్టారు. ఒక వైపు వర్షం దెబ్బ, ఇప్పుడేమో ప్యారావిల్ట్‌/సడెన్‌ విల్ట్‌ తెగుళ్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి మూడో వంతుకు పడిపోయే పరిస్థితి వచ్చిందంటున్నారు. ఎకరానికి ఎంత లేదన్నా 22వేల నుంచి 26వేల వరకు పెట్టుబడి పెట్టామని, ప్రస్తుత పరిస్థితులతో ఎకరానికి మూడు, నాలుగు క్వింటాళ్లకు మించి దిగుబడొచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. తగ్గనున్న దిగుబడితో తాము నష్టపోతామని, పెట్టుబడైనా వస్తుందో.. రాదో అని రైతులు ఆందోళనలో ఉన్నారు.

పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు : ఆంజనేయులు, రైతు, సుల్తాన్‌పూర్‌, పరిగి మండలం

రెండు ఎకరాల్లో పత్తి వేశాను. పెట్టుబడి రూ.40వేలకు పైనే అయ్యింది. మొదట పంట ఏపుగానే పెరిగింది. ఇటీవలి భారీ వర్షాలు, సోకుతున్న తెగులుతో గూడ, కాయలు రాలి నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్నట్టుండి మొక్కలు ఎండుతున్నాయి. ప్రస్తుతం మొక్కకు 20 నుంచి 30 కాయలు ఉన్నాయి. పత్తి ఆకులు, గూడ, కాయలు ఎర్రబారి వాడి ఎండుతున్నాయి. ఈ తెగులుకు మందులు పిచికారి చేసినా లాభం లేదు. పంటను కాపాడుకునేందుకు ఏం చేయాలో తోచడం లేదు.

పత్తిలో తెగుళ్లపై జాగ్రత్తలు పాటించాలి : లక్ష్మీకుమారి, ఏడీఏ, పరిగి

పత్తి పంటకు వచ్చిన తెగుళ్ల నివారణకు రైతులు జాగ్రత్తలు తీసుకుంటే పంట దిగుబడి తగ్గకుండా ఉంటుంది. ప్రస్తుతం మొక్కలకు ప్యారావిల్ట్‌/సడెన్‌ విల్ట్‌ అనే తెగులు వచ్చింది. దీని నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ అనే మందును ప్రతీ లీటర్‌ నీటిలో మూడు గ్రాముల చొప్పున కలిపి ఒకసారి పిచికారి చేయాలి. అలాగే ఏక కరణి 500-600 గ్రాములు నీటి డబ్బులో కలిపి ఎకరంలో చేనులో స్ర్పే చేయాలి. ఒక రోజు తర్వాత 19-19-19 లేదా 13-0-45 లేదా మల్లి-కె, లేదా పొలైఫెడ్‌ 1000 గ్రాములు ఒక డ్రమ్ములో కలిపి పిచికారి చేస్తే తెగులు మొక్కలకు సోకకుండా నియంత్రణలో ఉంటుంది.

Updated Date - 2023-09-22T00:15:01+05:30 IST