Share News

పట్నం.. పారిశ్రామిక కేంద్రం!

ABN , First Publish Date - 2023-10-19T23:23:42+05:30 IST

ఒకప్పుడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిఽధులు కూడా ఊళ్లను వదిలి తలదాచుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి... ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రూపురేఖలు మారాయి. పెట్టుబడి దారులు ఇప్పుడు దీనిని సేఫ్‌ జోన్‌గా ఎంచుకున్నారు. ఎన్‌ఎస్‌జీ, ఆక్టోపస్‌ లాంటి భద్రతా సంస్థల ఏర్పాటుతో జిల్లాకు కేంద్ర బిందువుగా మారింది.

పట్నం.. పారిశ్రామిక కేంద్రం!

రక్షణ, వైమానిక, అంతరిక్షయాన సంస్థల ఏర్పాటు

ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట

చేజారి 38 ఏళ్లు!

ఆరు సార్లు టీడీపీ, కూటములదే హవా

ఒకప్పుడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిఽధులు కూడా ఊళ్లను వదిలి తలదాచుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి... ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రూపురేఖలు మారాయి. పెట్టుబడి దారులు ఇప్పుడు దీనిని సేఫ్‌ జోన్‌గా ఎంచుకున్నారు. ఎన్‌ఎస్‌జీ, ఆక్టోపస్‌ లాంటి భద్రతా సంస్థల ఏర్పాటుతో జిల్లాకు కేంద్ర బిందువుగా మారింది.

ఇబ్రహీంపట్నం; అక్ట్టోబరు 19: రెండున్నర దశాబ్ద్ధాల క్రితం వరకు ఇక్కడ మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండింది. పరిశ్రమలు పెట్టడానికి కూడా పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. అప్పట్లో కాంగ్రెస్‌, టీడీపీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిఽధులు కూడా ఊళ్లను వదిలి హైదరాబాద్‌లో తలదాచుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రూపురేఖలు మారాయి. దీనిని సేఫ్‌ జోన్‌గా ఎంచుకుని పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, రియల్టర్లు ఇక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఆదిభట్ల ఏరోస్సేస్‌ సెజ్‌లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన టీసీఎస్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టం, టాటా లాకీడ్‌ మార్టీన్‌, టాటాసికోర్‌స్కై, న్యూకాన్‌ఏరోస్పేస్‌, డెస్మీలాంటి వైమానిక, అంతరిక్షయాన సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో ఎన్‌ఎస్‌జీ, ఆక్టోపస్‌ లాంటి భద్రతా సంస్థలు ఉన్నాయి. బీడీఎల్‌, బీఈఎల్‌ లాంటి రక్షణ సంస్థలు ఏర్పాటవుతున్నాయి. కొంగరకలాన్‌లో ఎలకా్ట్రనిక్స్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ పరిశ్రమ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. యాచారం, కందుకూరు, కడ్తాల్‌ పరిధిలో 19,333 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ ఏర్పాటుకాబోతుంది. అనేక పీజీ, ఇంజనీరింగ్‌ కళాశాలలు వచ్చాయి. ఇక్కడ పరిస్థితుల మూలంగా ఈ ప్రాంతంలో భూముల ధరలు బాగా పెరిగాయి. ఎకరా కోటిపైనే పలుకుతోంది.

ఆరు సార్లు టీడీపీ, కూటములదే హవా

రాజకీయంగా చూస్తే పొత్తుతోనే మూడు పర్యాయాలు సీపీఎం గెలిచింది. ఒకప్పుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండగా, టీడీపీ ఆవిర్భావం తర్వాత పరిస్థితులు తలకిందులైనాయి. జిల్లాలోనే సీపీఎంకు పట్టు ఉన్న నియోజకవర్గం కూడా ఇదే. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఈప్రాంతం కీలక భూమిక వహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌, సీపీఎంల మధ్య పొత్తు సీట్ల సర్దుబాటు అనేది తేలాల్సి ఉంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల మధ్య త్రిముఖ పోరు జరుగనుంది. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఉపఎన్నికతో కలిపి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా 1952 మొదలు 1983 వరకు 8సార్లు ఇక్కడ కాంగ్రెస్‌ హవానే కొనసాగింది. ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌ నుంచి ఒకరు, పీడీఎఫ్‌ నుంచి ఒకరు విజయం సాధించారు. 1985 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ఎన్నికలో కూడా కాగ్రెస్‌ అభ్యర్థులు గెలువలేకపోయారు. ఆరుసార్లు టీడీపీ, మిత్రపక్షాలు గెలుపొందాయి. టీడీపీ నుంచి రెండు పర్యాయాలు విజయం సాధించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 2015లో టీఆర్‌ఎస్‌(పస్తుతం బీఆర్‌ఎస్‌)లో చేరారు. 2018లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన ఆయన ఆ ఆ పార్టీతో మరోమారు అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్నారు.

మంత్రులుగా కొనసాగిన ఎం.ఎన్‌.లక్ష్మీనర్సయ్య, పుష్పలీల

నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గాల్లో ఎం.ఎన్‌.లక్ష్మీనర్సయ్య సభ్యుడిగా కొనసాగారు. కాగా, కొండ్రు పుష్పలీల చంద్రబాబు మంత్రి వర్గంలో రెండేళ్లపాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1952 నుంచి 1989 వరకు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేల్లో ఎన్‌.అనంతరెడ్డి మినహా మిగిలిన వారంతా స్థానికేతరులే.

ఎన్నికైన ఎమ్మెల్యేలు వీరే..

సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్ట్టీ సమీపప్రత్యర్థి పార్టీ మెజారిటీ

1952 (ద్వి.ని) ఎం.బి.గౌతం కాంగ్రెస్‌ కె.కె.మానె ఎస్‌సీఎఫ్‌ 11942

పాపిరెడ్డి పీడీఎఫ్‌ బి.ఎస్‌.రావు కాంగ్రెస్‌ 9783

1957 ఎం.ఎన్‌.లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్‌ హెచ్‌. రెడ్డి పీడీఎఫ్‌ 8112

1962 ఎం.ఎన్‌.లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్‌ కె.పి. రెడ్డి ఇండి 5374

1967 ఎం.ఎన్‌.లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్‌ డి. మోహన్‌రెడ్డి ఇండి 15581

1972 ఎన్‌.అనంతరెడ్డి కాంగ్రెస్‌ కె.కె.మూర్తి సీపీఎం 12810

ఎస్సీ రిజర్వుడ్‌

1978 సుమిత్రాదేవి కాంగ్రెస్‌ కె.ఆర్‌.కృష్ణస్వామి జనతా 13899

1981 (ఉ.ఎ) ఎ.జి.కృష్ణ కాంగ్రెస్‌ ఎ.ఆర్‌.డి.రాజు సీపీఐ 25206

1983 ఎ.జి.కృష్ణ కాంగ్రెస్‌ కె.జత్యనారాయణ టీడీపీ 20438

1985 కె.సత్యనారాయణ టిడిపి ఎం.బి.సత్యనారాయణ కాంగ్రెస్‌ 22129

1989 కొండిగారి రాములు సీపీఎం ఎ.జి.కృష్ణ కాంగ్రెస్‌ 45309

1994 కొండిగారి రాములు సీపీఎం కె.సత్యనారాయణ కాంగ్రెస్‌ 31358

1999 కొండ్రు పుష్పలీల టీడీపీ ఎ.జి.కృష్ణ కాంగ్రెస్‌ 45375

2004 మస్కు నర్సింహ సీపీఎం నర్రా రవికుమార్‌ టీడీపీ 12,807

జనరల్‌

2009 మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీడీపీ మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్‌ 9316

2014 మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీడీపీ మల్‌రెడ్డి రాంరెడ్డి ఇండి 11056

2018 మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ 396

----------------------------------------------------------------------------------------------

(ఉ.ఎ): ఉప ఎన్నిక, (ద్వి. ని): ద్విసభా నియోజకవర్గం

====================================

నియోజకవర్గ్గం పేరు : ఇబ్రహీంపట్నం

రిజర్వేషన్‌: జనరల్‌

నియోజకవర్గ పరిధి..

మండలాలు : ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్ధుల్లాపూర్‌మెట్‌

మున్సిపాలిటీలు: ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, పెద్దఅంబర్‌పేట్‌, తుర్కయాంజాల్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న హయత్‌నగర్‌

లోక్‌సభ నియోజకవర్గం : భువనగిరి

ప్రసుత్త ఎమ్మెల్యే : మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)

-----------------------------------------------------------------------------------------

మండలాల వారీగా ఓటర్ల వివరాలు

మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

ఇబ్రహీంపట్నం 34,972 34,853 4 69,829

మంచాల 19,787 18,773 1 38,561

యాచారం 23,586 22,854 0 46,440

అబ్ధుల్లాపూర్‌మెట్‌ 79,395 76,437 24 1,55,856

మొత్తం 1,57,740 1,52,917 29 3,10,686

ప్రత్యేకతలు:

- ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నాలుగు మున్సిపాలిటీలు, నాలుగు మండలాలు ఉన్నాయి. అయితే కొంత పట్టణ వాతావరణం.. మరికొంత గ్రామీణ వాతావరణంలో కలగలిసి ఉంది.

- 20 వరకు ఇంజనీరింగ్‌, పీజీ కళాశాలలున్నాయి.

- కొంగరకలాన్‌లో సమీకృత కలెక్టర్‌ భవనం

- ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పర్యాటకంగా రూపుదిద్దుకోనుంది. ఇందుకుగాను రూ. 18 కోట్లు మంజూరైనాయి.

- 19,333 ఎకరాల్లో హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మా సిటీ ఏర్పాటవుతోంది. ఇందుకుగాను భూసేకరణ పూర్తయింది.

Updated Date - 2023-10-19T23:23:42+05:30 IST