పేదరికాన్ని జయించి ఉద్యోగం సాధించారు

ABN , First Publish Date - 2023-08-08T00:11:16+05:30 IST

గ్రామీణ ప్రాంతాలకు చెందిన పలువురు అభ్యర్థులు ఎస్సై ఉద్యోగాలు సాధించారు. ప్రభుత్వం ఆదివారం ఎస్సై పరీక్ష ఫలితాలను ప్రకటించింది.

పేదరికాన్ని జయించి ఉద్యోగం సాధించారు

కేశంపేట, ఆగస్టు 7: గ్రామీణ ప్రాంతాలకు చెందిన పలువురు అభ్యర్థులు ఎస్సై ఉద్యోగాలు సాధించారు. ప్రభుత్వం ఆదివారం ఎస్సై పరీక్ష ఫలితాలను ప్రకటించింది. వ్యవసాయ కుటుంబాలకు చెందిన పలువురు అభ్యర్థులు పట్టుదలతో ఉద్యోగం సాధించారు. కేశంపేట మండలం తూర్పుచౌలపల్లి పంచాయతీ పరిధి మీనమోనిపల్లికి చెం దిన అనపోసల సత్యనారాయణ, దివంగత నాగమణి దంపతుల కూతురు గాయత్రి సివిల్‌ ఎస్సైగా ఎంపికయ్యారు. ఆమె విద్యాభ్యాసం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ విద్యాలయాల్లో ఇంటర్‌, సీబీఐటీలో ఇంజినీరింగ్‌ చేశారు. గాయత్రి తల్లి గత సంవత్సరం గుండె సంబంధిత వ్యాధితో మృతిచెందారు. దళిత కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగం సాధించిన గాయత్రిని ఎంపీపీ రవీందర్‌యాదవ్‌, జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రవణ్‌రెడ్డి అభినందించారు.

చేవెళ్ల: చేవెళ్ల మండలంలో ఇద్దరు, మొయినాబాద్‌ మండలంలో ఓ యువతి ఎస్సై ఉద్యోగం సాధించారు. గుండాలకు చెందిన నక్క నర్సింహారెడ్డి-లక్ష్మి దంపతులు వ్యవసాయం చేస్తున్నారు. వారి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి గ్రామంలోనే పదో తరగతి వరకు, ఇంటర్‌ వికారాబాద్‌లో చదివాడు. చేవెళ్ల పరిధి బండారు శ్రీనివాస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌(ఎంటెక్‌) పూర్తి చేశాడు. 2018లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి శంషాబాద్‌ ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఎస్సై నియామక పరీక్షలో సివిల్‌ ఎస్సై ఉద్యోగం సాధించాడు. అలాగే చేవెళ్ల మండలం నాన్‌చెరుకు చెందిన కౌకుంట్ల అంజయ్య-లక్ష్మి దంపతులది వ్యవసాయ కుటుంబం. పాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్నకుమారుడు వెంకటేశ్‌ ఖానాపూర్‌లోని ప్రభుత్వ పాశాలలో పదో తరగతి వరకు చదివాడు. చేవెళ్లలో ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేశాడు. హైదరా బాద్‌ సెంట్రల్‌ యూనివర్సీటీలో పీజీ(తెలుగు పండిత్‌) చేశాడు. ఎస్సై ఉద్యోగ పరీక్ష రాసి ఎంపికయ్యాడు.

మొయినాబాద్‌ రూరల్‌: రెడ్డిపల్లికి చెందిన మోర శ్రీవాణి కమ్యూనికేషన్‌ విభాగంలో ఎస్సైగా ఎంపికయ్యారు. దివంగత తెలుగు పండిత్‌ మోర శ్రీశైలం కుమార్తె శ్రీవాణి (25). కష్టపడితే సాధించలేనిది ఏమి లేదన్నారు.

కొందుర్గు: మండల పరిఽధి విశ్వనాథ్‌పూర్‌నకు చెందిన గుండేటి రాంరెడ్డి-చంద్రకళ 3 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. వారు కూతురు సంధ్యారాణి(25), కుమారుడు కరుణాకర్‌రెడ్డిని చదివిస్తున్నారు. సంధ్యారాణి ఎస్సైగా సెలెక్ట్‌ అయ్యారు. ఆమె 5వ తరగతి వరకు గ్రామ పాఠశాలలో, 6, 7 తరగతులు తంగళ్లపల్లి పాఠశాలలో.. 8, 9, 10 తరగతులు కొందుర్గులోని ఉన్నత చదివారు. ఇంటర్‌, డిగ్రీ హైదరాబాద్‌లో చదివారు. ఎస్పై పరీక్ష రాసి తొలి ప్రయత్నంలోనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా సెలెక్ట్‌ అయ్యారు. అలాగే కొందుర్గుకు చెందిన రాయికంటి మల్లేశ్వర్‌-బుచ్చమ్మ దంపతులు 5 ఎకరాల్లో వ్యవసాయం చేస్తారు. వారి ఇద్దరు కుమారులు శివశంకర్‌, జగదీశ్వర్‌లను చదివించారు. ఎస్సై పరీక్షల్లో చిన్న కొడుకు జగదీశ్వర్‌ ఎస్సైగా సెలెక్ట్‌ అయ్యారు. అతడు పాఠశాల విద్య స్థానికుంగా అభ్యసించాడు. ఇంటర్‌ ఫరూఖ్‌నగర్‌ మండలం మొగల్‌గిద్ద, ఇంజినీరింగ్‌ చౌటుప్పల్‌లో పూర్తి చేశారు. 2018లో ఎస్సై పరీక్ష రాసినా సెలెక్ట్‌ కాలేదు. రెండో ప్రయత్నంలో సెలెక్ట్‌ అయ్యాడు.

యాచారం: యాచారం మండలం మాల్‌కు చెందిన ఎండీ సత్తార్‌-గౌసియాబేగంల రెండో కుమారుడు సొహైల్‌ ఎస్సై ఉద్యోగం సాధించాడు. సత్తార్‌ వెల్డింగ్‌ పనులు చేసేవాడు. సొహైల్‌ సైతం తండ్రికి సహకరించేవాడు. పాఠశాల విద్య, ఇంటర్‌ మాల్‌లో పూర్తి చేశాడు. బీటెక్‌ ఇబ్రహీంపట్నంలోని చదివాడు. 2017 గేట్‌లో సీటు సాధించాడు. 2019లో ఎంటెక్‌ పూర్తిచేశాడు. 2018లో లోకో పైలెట్‌ ఉద్యోగం సాధించాడు. అంతకు ముందు చదువు ఖర్చుల కోసం వెల్డింగ్‌ పనులు, హోం ట్యూషన్స్‌ చెప్పేవాడు. 2015 లో తండ్రి మరణించగా కుటుంబ పోషణకు పనులు చేస్తూనే ఉద్యోగాలకు సిద్ధం అయ్యేవాడు. ఎస్సై పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించాడు.

Updated Date - 2023-08-08T00:11:16+05:30 IST