వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

ABN , First Publish Date - 2023-02-06T23:47:28+05:30 IST

ఆలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. సోమవారం పలు ఆలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహించారు. తలకొండపల్లి, కేశంపేట, ఆమనగల్లులోని పలు ఆలయాలు బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యాయి.

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
మంచాల: ఆరుట్లలో వేణుగోపాల స్వామి రథోత్సవంలో పాల్గొన్న స్థానికులు

  • ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు

  • ఆరుట్లలో వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం

  • బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన పలు ఆలయాలు

ఆలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. సోమవారం పలు ఆలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహించారు. తలకొండపల్లి, కేశంపేట, ఆమనగల్లులోని పలు

ఆలయాలు బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యాయి.

మంచాల, ఫిబ్రవరి 6: ఆరుట్లలో శ్రీ వేణుగోపాల స్వామివార్ల కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. కల్యాణఘట్టం అనంతరం రథోత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవ మూర్తులను వీధుల వెంట ఊరేగించారు. సమీప గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ రథయాత్రలో కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.

ముగిసిన వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

కందుకూరు, ఫిబ్రవరి 6: మండలంలోని పులిమామిడిలో గల చీకటి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం సాయంత్రం అట్టహాసంగా ముగిశాయి. ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ మొకరాల రాజశేఖర్‌శర్మ, సర్పంచ్‌ అనీతాశ్రీనివా్‌సల ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి సోమవారం వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఉదయం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు, మహాగణపతి, నవగ్రహలక్ష్మి, సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలకు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం జైత్వారంపులిమామిడి గ్రామాలకు చెందిన భజనమండలి సభ్యులతో భజన కార్యక్రమాలు, ఎడ్ల పందాలు, ట్రాక్టర్‌ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజమ్మ, ఉపసర్పంచ్‌ వెంకటాచారి, నాయకులు ఏజీ అంజయ్యగౌడ్‌, బొక్క నర్సింహారెడ్డి, అనేగౌని దామోదర్‌గౌడ్‌, అంజిరెడ్డి, వెంకటే్‌షగుప్త, శ్రీనివాస్‌, సీఐ కృష్ణరాంజు, మాజీ వైస్‌ఎంపీపీ సంధ్యాదామోదర్‌గౌడ్‌, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.

వెల్జాలలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

తలకొండపల్లి: మండలంలోని వెల్జాల గ్రామ సమీపంలో వెలసిన శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయంలో ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు నిర్వాహకులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సర్పంచ్‌ సీఎల్‌ సంగీతశ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీటీసీ అంబాజీ, ఉపసర్పంచ్‌ అజీజ్‌, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ కూన రవిలు కోరారు. బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను సోమవారం ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌కు ఆలయ ధర్మకర్త శ్రీనివాస మూర్తి, నాయకులు శ్రీనివాస్‌ యాదవ్‌, అంబాజీ, సుదర్శన్‌రెడ్డి, రమేశ్‌ యాదవ్‌, కిషన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, అశోక్‌గుప్త, భాస్కర్‌రావు, శేఖర్‌గౌడ్‌, జగన్‌, నర్సింహ అందజేశారు.

నేటి నుంచి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

కేశంపేట: మండల కేంద్రంలోని దవళగిరి గుట్టపై వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి (మంగళవారం) నిర్వహించేందుకు పంచాయతీ పాలకవర్గం ఏర్పాట్లు పూర్తిచేసింది. నేడు అంకురార్పణ, పంచామృతం, రాత్రికి అభిషేకం, బుధవారం(రేపు) ధ్వజారోహణం, రాత్రికి గరుడసేవ, భగవాత్‌ నామ సంకీర్తన, 9న వేంకటేశ్వర స్వామి అలంకరణం, 10న అలువేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణం, రాత్రి రథోత్సవం, 11న పూర్ణాహుతి, బండ్లు తిప్పుట, 12న స్వామి పట్టాభిషేకం, చక్రతీర్థం, 13న రెండెద్దుల పందెం బండ లాగుడు ఏర్పాట్లు చేశారు. అంతరాష్ట్ర పందెం బండ ఆకర్షణగా నిలువనుంది. సర్పంచ్‌ తలసాని వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సజ్జల విశ్వనాథం, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ నారాయణరెడ్డిలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

రేపటి నుంచి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు

చేవెళ్ల: ఈనెల 8వ తేదీ(రేపు) నుంచి 10వ తేది వరకు చేవెళ్లలోని కొనగుట్టు శివాలయం శ్రీశ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఫౌండర్‌ ట్రస్టీ, ఆలయ కమిటీ అధ్యక్షుడు సున్నపు వసంతం, సున్నపు మాణిక్య ప్రభు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ.. బుధవారం శ్రీగణపతి పూజ, దీపారాధన, ధ్వజారోహణం, రుద్రాభిషేకం, అమ్మవారికి అర్చన, , రాత్రి భజన కార్యక్రమాలు ఉంటాయన్నారు.

నేటి నుంచి శివలింగ ప్రతిష్ఠాపన మహోత్సవం

ఆమనగల్లు: ఆమనగల్లులోని అయ్యప్ప కొండ ఆలయ ఆవరణలో పట్టణానికి చెందిన రేగటి శ్రీలతశ్రీనివాస్‌ దంపతులు ఆధ్వర్యంలో శివపార్వతుల విగ్రహం ఎదుట శివాలయాన్ని నిర్మించారు. మంగళవారం(నేడు) నుంచి 9వ తేదీ వరకు శివలింగ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం చంద్రశేఖర శివచార్య మహాస్వామి శిష్యబృందం, మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన 108 గురుసిద్ద మణికంఠ శివాచార్య మహాస్వామిల ఆధ్వర్యంలో గణపతి, భవాని, రామలింగేశ్వర స్వామి, నంది, వీరభద్ర స్వామి, నాగులు, ధ్వజస్తంభ, శిఖర, బలిపీఠం, ప్రతిష్ఠాపన మహోత్సవాలను నిర్వహించనున్నారు. సమీప గ్రామాల ప్రజలు, శివభక్తులు, పెద్ద సంఖ్యలో తరలి రావాలని నిర్వాహకులు సహర శ్రీను ఈ సందర్భంగా కోరారు.

Updated Date - 2023-02-06T23:47:52+05:30 IST