పత్తి కొనుగోళ్లపై అధికారి ఆరా!
ABN , Publish Date - Dec 14 , 2023 | 11:32 PM
‘అత్తెసరు కొనుగోళ్లు.. పత్తి అమ్మకాల్లో మోసాలు’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో మంగళవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
కాటన్ మిల్లును సందర్శించిన డీఏవో
పరిగి, డిసెంబరు 14: ‘అత్తెసరు కొనుగోళ్లు.. పత్తి అమ్మకాల్లో మోసాలు’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో మంగళవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ గురువారం పరిగి మండలం రంగంపల్లి శివారులోని కాటన్‌మిల్లును సందర్శించారు. పత్తి అమ్మకాల్లో రైతులకు కలుగుతున్న కష్టాలపై ఆరా తీశారు. పత్తి కొనుగోళ్ల వివరాలను పరిశీలించారు. డీఏవో మాట్లాడుతూ.. పత్తి కొనుగోళ్లలో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్తిసాగుకు సంబంధించి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదులేకుంటే, ఆప్‌లైన్‌లో ఏఈవో, ఆర్‌ఐలు ధ్రువీకరణ పత్రం ఇస్తే రైతులను ఇబ్బందులు పెట్టకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. మద్దతు ధరకు తక్కువ కాకుండా పత్తి కొనుగోలు చేయాలన్నారు. పత్తి కొన్న వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఏవో ప్రభాకర్‌రెడ్డి, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.