నిధుల కొరత లేదు!

ABN , First Publish Date - 2023-03-25T23:02:36+05:30 IST

మనఊరు - మనబడి కింద ఎంపిక చేసిన పాఠశాలల పునరుద్ధ్దరణ పనులు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటి కి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

నిధుల కొరత లేదు!

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటి కి మనఊరు - మనబడి పనులు పూర్తయ్యేలా చర్యలు

ఆ పనులు చేస్తే డబ్బులు రావని దుష్ప్రచారం చేస్తే చర్యలు

జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మనఊరు - మనబడి కింద ఎంపిక చేసిన పాఠశాలల పునరుద్ధ్దరణ పనులు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటి కి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం డీపీఆర్‌సీలో జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి అఽధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మన ఊరు- మన బడి కార్యక్రమానికి ఎలాంటి నిధుల కొరత లేదని, చిన్నచిన్న మరమ్మతులు కూడా చేయించకపోవడం వల్లనే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. జూన్‌ నెలలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మన ఊరు -మన బడి పనులు చేస్తే డబ్బులు రావని దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలకు వికారాబాద్‌ నియోజకవర్గంలో ఎక్కువగా పంటలకు నష్టం జరిగిందని, పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారని, రైతుల వారీగా వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు.

ప్రశ్నపత్రాల లీకేజీ బాధ్యులపై చర్యలు

టీఎ్‌సపీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్‌ జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జడ్పీ సమావేశంలో బంట్వారం జడ్పీటీసీ సంతోష టీఎ్‌సపీఎస్సీ పేపర్ల లీకేజీపై మంత్రిని ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని, భవిష్యత్తులో ఆవిధంగా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

సమస్యల వెల్లువ

కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర మాట్లాడుతూ, తమ మండలంలో మన ఊరు - మన బడి పనులు పనులు చేస్తే మీకు డబ్బులు రావంటూ సంబంధిత పర్యవేక్షణ అధికారులే దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాగైతే పనులు ఎలా జరుగుతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత వరకు ఆ పనులపై ఒకసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదని మంత్రి దృష్టికి తీసుకురాగా, కలెక్టర్‌ స్పందించి పనులు పర్యవేక్షించే బాధ్యతను ఇరిగేషన్‌ ఏఈ నుంచి వేరే వారికి అప్పగించి పనులు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి మన ఊరు - మన బడి పనులపై సమీక్ష నిర్వహించాలని కోరగా, వచ్చే వారం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. వర్షాకాలం ప్రారంభం కాక ముందే పీఆర్‌ రోడ్ల పనులు పూర్తి చేయాలని ఈఈకి సూచించారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ, జడ్పీ సర్వ సభ్య సమావేశాల్లో మొదట ఉన్న కొన్ని అంశాలపైనే చర్చ కొనసాగుతోందని, చివర ఉన్నవి చర్చ లేకుండానే సభ ముగిసిపోతోందన్నారు. సదరం శిబిరాలు రెగ్యులర్‌గా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దోర్నాల్‌ బ్రిడ్జి నిర్మాణం పనులు ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, ఇద్దరు కాంట్రాక్టర్లను తప్పించి మరొకరికి పనులు అప్పగించినా పరిస్థితిలో మార్పు లేదన్నారు. చీమల్‌దరి, మోమిన్‌పేట, మొరంగపల్లి వద్ద బ్రిడ్జిల నిర్మాణం పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి కాక ఒకరు కొట్టుకుపోయి మృతి చెందినా అధికారుల పనితీరులో మార్పు రావడం లేదన్నారు. డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, పంట కాపాడుకునేందుకు మామిడి రైతులకు సరైన సూచనలు సలహాలు ఇవ్వాలని సూచించారు. ఉపాధి హామీ పనుల కింద రైతులు నిర్మించుకున్న కల్లాలకు, పాఠశాలల్లో టాయిలెట్లకు సంబంధించిన బిల్లులు ఇంకా రాలేదని, వెంటనే ఇప్పించాలన్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఆయిల్‌ఫామ్‌ సాగుపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించగా, డీహెచ్‌ఎస్‌వో చక్రపాణి స్పందిస్తూ, ఆయిల్‌ఫాం సాగుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిందన్నారు. మర్పల్లి జడ్పీటీసీ మధుకర్‌ మాట్లాడుతూ, కొందరు రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేవని, అలాంటి రైతులకు కూడా సీఎం అందించే రూ.10 వేల సాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బొంరాస్‌పేట్‌ జడ్పీటీసీ చౌహాన్‌ అరుణ దేశు మాట్లాడుతూ, జడ్పీహెచ్‌ఎస్‌లో టాయిలెట్లను శుభ్రం చేయించేందుకు అక్కడి హెచ్‌ఎం సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారని, పారిశుధ్య సిబ్బందిని నియమించాలని కోరారు. బంట్వారం జడ్పీటీసీ సంతోష మాట్లాడుతూ, తమ మండలంలో ఇంకా 80మంది రైతులకు రైతుబంధు సాయం అందలేదని, వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి మాట్లాడుతూ, తమ మండలంలో పంచాయతీ కార్యదర్శులను మార్చాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డిప్యూటీ సీఈవో సుభాషిణి, వివిధ శాఖల జిల్లా అధికారులు కృష్ణన్‌, రేణుకాదేవి, గోపాల్‌, చక్రపాణి, కోటాజీ, సురేష్‌, శ్రీనివాస్‌రెడ్డి, లాల్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి : జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి

వేసవి కాలం ప్రారంభమైన క్రమంలో గ్రామాల్లో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. మిషన్‌ భగీరథ నీరు ప్రతి ఇంటికీ చేరాలని, ఎక్కడైనా నీటి సరఫరా నిలిపివేస్తే ప్రజలకు ముందుగా సమాచారం ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి, జొన్న, నూనె గింజల సాగు పెంచేలా వ్యవసాధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు లాభదాయకంగా ఉండే తేనె టీగల పెంపకంపై దృష్టి సారించాలని చెప్పారు.ఆర్గానిక్‌ పద్ధతిలో కూరగాయలు పండిస్తే పట్టణాల్లో మంచి డిమాండ్‌ ఉందని, లాభాలు కూడా వస్తాయన్నారు. ఽకొత్త కలెక్టర్‌ చొరవతో ధరణి సమస్యలు చాలా వరకూ పరిష్కారమయ్యాయన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా పకడ్బందీ కార్యాచ రణతో విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.

మండల సమావేశాలకు హాజరు కావాల్సిందే : కలెక్టర్‌ నారాయణరెడ్డి

మండల సర్వసభ్య సమావేశాలకు మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. మండల సమావేశాలకు అధికారులు హాజరు కావడం లేదని దౌల్తాబాద్‌, యాలాల్‌ జడ్పీటీసీలు కలెక్టర్‌ దృష్టికి తీసుకు రాగా, ఆయన పై విధంగా స్పందించారు. మండల స్థాయి అధికారులు రెగ్యులరైనా, ఇన్‌చార్జిలైనా సమావేశాలకు హాజరు కావాల్సిందేనని కలెక్టర్‌ స్పష్టం చేశారు. మండల సర్వసభ్య సమావేశాలకు విధిగా హాజరయ్యేలా సంబంధిత శాఖల జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. విద్య, వైద్యం సక్రమంగా అందేలా మండల స్థాయిలో ఎంపీపీ, జడ్పీటీసీలపై గురుతర బాధ్యత ఉందన్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమంలో టెండర్‌ వర్క్‌ తమకు వదిలేయాలని, మిగతా పనులు స్థానికంగా ఉండే వారితో పూర్తి చేయించాలని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే, జడ్పీ సర్వసభ్య సమావేశానికి విద్యుత్‌ ఎస్‌ఈ గైర్హాజరవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వాలని తెలియదా అంటూ మండిపడ్డారు.

జిల్లాలో 5,788 మంది రైతులకు సంబంధించి 6418.28 ఎకరాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటలకు నష్టం జరిగిందంటూ మండలాల వారీగా డీఏవో గోపాల్‌ వివరించారు.

డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఆయిల్‌ఫామ్‌ సాగుపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించగా, డీహెచ్‌ఎస్‌వో చక్రపాణి స్పందిస్తూ, ఆయిల్‌ఫాం సాగుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిందన్నారు.

డీపీవో తరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ, గత ఏడాది జిల్లాలో 98.4 శాతం పన్నుల వసూళ్లు చేయగా, ఈసారి వంద శాతం వసూలు చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామన్నారు.

డీఈవో రేణుకాదేవి మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం దుస్తులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Updated Date - 2023-03-25T23:02:36+05:30 IST