Share News

బీజేపీని గెలిపిస్తే బహుళ ప్రయోజనాలు

ABN , First Publish Date - 2023-11-22T00:18:44+05:30 IST

భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని షాద్‌నగర్‌ అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందె బాబయ్య తెలిపారు.

బీజేపీని గెలిపిస్తే బహుళ ప్రయోజనాలు
బాబయ్య సమక్షంలో బీజేపీలో చేరుతున్న యువకులు

షాద్‌నగర్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందె బాబయ్య

షాద్‌నగర్‌అర్బన్‌, నవంబర్‌ 21: భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని షాద్‌నగర్‌ అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందె బాబయ్య తెలిపారు. షాద్‌నగర్‌ పట్టణంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం విస్తృతంగా ప్రచారం చేశారు. పలు గ్రామాల యువకులను బాబయ్య బీజేపీలో చేర్చుకున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకుండా మరోసారి ప్రజలను మోసగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్‌ ఆశించిన అభివృద్ధి చేయలేకపోయిందని విమర్శించారు. నేడు ప్రధాని మోదీ ప్రపంచ దేశాలు మెచ్చుకునేలా పారదర్శక పాలన అందిస్తున్నారని అన్నారు. తాను విజయం సాధించగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపడతానని తెలిపారు. ప్రతీ మండలంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తానని వెల్లడించారు. సొంత జాగాలో ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, వరికి 3,100 రూపాయల మద్దతు ధరను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఉజ్వల లబ్దిదారులకు ఏటా నాలుగు వంట గ్యాస్‌ సిలిండర్లు, పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను తగ్గింపు లభిస్తుందన్నారు. కుల, మత, రాజకీయాలకతీతంగా అందరికీ న్యాయం చేసేది బీజేపీయేనన్నారు. అవినీతి, స్వార్థ రాజకీయాలు చేస్తూ వస్తున్న పార్టీలను పక్కన పెట్టి బీజేపీని గెలిపించాలని అందె బాబయ్య కోరారు. అనంతరం ముదిరాజ్‌ సంఘం షాద్‌నగర్‌ తాలుకా అధ్యక్షుడు ఆంచ రాములు ఆధ్వర్యంలో ముదిరాజ్‌ల సమావేశాన్ని నిర్వహించి, అందె బాబయ్య గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కొందుర్గు మండల ఎమ్మార్పీఎస్‌ ఇన్‌చార్జి వినోద్‌మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ళ నర్సింహ మాదిగ హాజరై బాబయ్య విజయం కోసం మాదిగలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో నాయకులు ఎన్‌.శ్రీవర్ధన్‌రెడ్డి, డాక్టర్‌ టి.విజయకుమార్‌, చెంది మహేందర్‌రెడ్డి, పాతపల్లి కృష్ణారెడ్డి, కక్కునూరి వెంకటేష్‌గుప్త, ఎం.మురళి, అందె కిష్టమ్మ, వంశీకృష్ణ, మఠం ఋషికేష్‌, ముదిరాజ్‌ సంఘం నాయకులు అంచె రాములు, అందె పైలయ్య, శ్రీధర్‌వర్మ తదితరులున్నారు.

Updated Date - 2023-11-22T00:18:44+05:30 IST