కిరాణంలో ‘ముద్ర’ గుడ్లు

ABN , First Publish Date - 2023-07-03T00:20:48+05:30 IST

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వం సరఫరా చేస్తున్న అంగన్‌వాడీ కోడిగుడ్లు పక్కదారి పడుతున్నాయి.

కిరాణంలో ‘ముద్ర’ గుడ్లు

అంగన్‌వాడీ కోడిగుడ్లు పక్కదారి

దర్జాగా విక్రయిస్తున్న యజమానులు

చేవెళ్ల, జూలై 2 : ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వం సరఫరా చేస్తున్న అంగన్‌వాడీ కోడిగుడ్లు పక్కదారి పడుతున్నాయి. వాటిని గ్రామాల్లోని కిరాణ షాపుల్లో దర్జాగా అమ్ముతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం జూన్‌ మొదటి వారం నుంచి అన్ని కేంద్రాలకు గుడ్లపై అంగన్‌వాడీ ముద్ర వేసి సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా మొదటి బ్యాచ్‌లో వచ్చే గుడ్లపై బ్లూ కలర్‌ ముద్ర, రెండో బ్యాచ్‌లో వచ్చే గుండ్లపై రెడ్‌ కలర్‌ ముద్ర వేస్తారు. మూడవ బ్యాచ్‌లో గ్రీన్‌ కలర్‌ ముద్రవేసి సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, చేవెళ్ల మండలం దేవునిఎర్రవల్లిలోని ఓ కిరాణ షాపుల్లో అంగన్‌వాడీ కేంద్రం నుంచి సరఫరా చేసిన కోడి గుడ్లు (ముద్రవేసి ఉన్న గుడ్డు) దర్శనమిచ్చాయి. గ్రామానికి చెందిన ఓ యువకుడు గ్రామంలోని కిరాణషాపులో ఆదివారం కోడిగుడ్లు కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. షాపు యాజమాని ఇతర గుడ్లతో పాటు ముద్రవేసి ఉన్న రెండు కోడి గుడ్లు కలిపి ఇచ్చాడు. అనంతరం ఆ యువకుడు ఇంటికి వెళ్లాక గమనించడంతో రెండు గుడ్లపై రెడ్‌ కలర్‌ వేసి ఉండటంతో ఫొటోలు తీసి పలు సోషల్‌ మీడియా గ్రూపుల్లో పోస్ట్‌ చేశాడు. దీంతో గ్రామంతో పాటు మండలంలో ముద్ర వేసి ఉన్న కోడిగుడ్ల విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న కోడిగుడ్లను అంగన్‌వాడీ సెంటర్‌ నిర్వాహకులు, అధికారులు గుట్టుచప్పుడు కాకుండా దొడ్డిదారిన అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఫోటోరైటప్‌ : 2 ఐఏపీ 1 : పోటీలో పాల్గొన్న విద్యార్థులు

అపజయమే విజయానికి తొలిమెట్టు

డీఆర్డీవో మిస్సైల్‌ సైంటిస్ట్‌ రాంచందర్‌రావ్‌

శంషాబాద్‌, జూలై 2 : కొన్నిసార్లు అపజయమే విజయానికి తొలిమెట్టు అవుతుందని డీఆర్డీవో మిస్సైల్‌ సైంటిస్ట్‌ ఎ.రాంచందర్‌రావు అన్నారు. ఎస్‌ఐపీ రీజినల్‌ ప్రాడిజీ-2023 తెలంగాణ కాంటెస్ట్‌ను ఆదివారం శంషాబాద్‌లోని క్లాసిక్‌ కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ పోటీలను సైంటిస్ట్‌ ఎ.రాంచందర్‌రావు, సిప్‌ (ఎస్‌ఐపీ) అకాడమీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినేష్‌ విక్టర్‌లతో కలసి ప్రారంభించారు. 6 నుంచి 12 సంవత్సరాల వయస్సుగల 2,500 మంది విద్యార్థులకు ఈ పోటీ నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు కాలిక్యులేటర్‌ కంటే వేగంగా కేవలం 11 నిమిషాల్లో 200 లెక్కలు చేసి అందరినీ అబ్బురపర్చారు. ఈ సందర్భంగా ఎ.రాంచందర్‌రావ్‌ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల్లో సిప్‌ అకాడమీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అకాడమీ దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే పిల్లలు మిస్సైల్‌ లాంటివారని కొనియాడారు. పిల్లల్లో ఎందరో రామానుజులు, ఆర్యభట్టలు, శంకుతలాదేవి వంటివారు ఉంటారని అన్నారు. పిల్లలు వారి ప్రయత్నంలో అపజయం ఎదురైనా అది విజయానికి తొలిమెట్టుగా భావించాలన్నారు. దినేష్‌ విక్టర్‌ మాట్లాడుతూ 2003లో సిప్‌ సంస్థ స్థాపించబడి 23 రాష్ట్రాలకు వ్యాపించిందన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు 350 పట్టణాల్లో రెండు లక్షల మంది విద్యార్థులు ప్రతి యేడాది శిక్షణ పొందుతున్నారన్నారు. ఈ సంస్థ కేవలం గణితంలోనే కాకుండా జీవితానికి ఉపయోగపడే ఎన్నో అంశాలపై నైపుణ్య శిక్షణ ఇస్తుందన్నారు. ఈసందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొని చూపరులను ఆకట్టుకున్నారు.

Updated Date - 2023-07-03T00:20:48+05:30 IST