ఎంపీ, ఎమ్మెల్యే వికారాబాద్‌కు చేసింది ఏమీలేదు

ABN , First Publish Date - 2023-04-27T00:15:40+05:30 IST

చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ వికారాబాద్‌ ప్రాంతానికి చేసింది ఏమీలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందారెడ్డి ఆరోపించారు.

ఎంపీ, ఎమ్మెల్యే వికారాబాద్‌కు చేసింది ఏమీలేదు
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందారెడ్డి

  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందారెడ్డి

వికారాబాద్‌, ఏప్రిల్‌ 26: చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ వికారాబాద్‌ ప్రాంతానికి చేసింది ఏమీలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి డాక్టర్‌ ఏ.చంద్రశేఖర్‌ నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ఎన్నో హామీలు ఇచ్చి ఏఒక్కటీ అమలు చేయలేదన్నారు. వికారాబాద్‌ జిల్లా 80శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉందని రెవెన్యూ లేని అస్తవ్యస్తమైన జిల్లాను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. 33జిల్లాలో వికారాబాద్‌ జిల్లాకు జరిగిన నష్టం ఏజిల్లాకు జరగలేదన్నారు. జూరాల నుంచి నీటిని తేవాలని నిర్ణయించి ఆ తరువాత శ్రీశైలానికి వెళ్లి 9ఏళ్లు అవుతున్నా జిల్లాకు చుక్కనీరు తీసుకురాలేకపోయారని తెలిపారు. ఎంపీ రంజిత్‌రెడ్డి నీళ్లు వస్తాయని గాలిమాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు జాతీయ రహదారికి గతంలోనే నిధులు వచ్చాయని, భూ సేకరణ జరుగక వెనక్కి పోయాయని గతంలో చెప్పిన ఎంపీ ఇప్పుడు నిధులు తెచ్చానని చెబుతున్నారన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తాండూరులో రూర్బన్‌ పథకం ద్వారా జినుగుర్తి వద్ద స్కీల్‌ డెవల్‌పమెంట్‌ భవనం నిర్మించిందని అయినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన 40శాతం నిధులు అందించక ఆ పనులు అక్కడే ఆగిపోయాయని తెలిపారు. నాగారం వద్ద చెరువు నిర్మాణ పనులు, యాలాల్‌ వద్ద శివసాగర్‌ చెరువు చేపడుతామని చెప్పిన ఇప్పటికీ మాట నిలుపుకోలేక పోయిందన్నారు. గ్రామ పంచాయతీలకు వచ్చిన ట్రాక్టర్లు కూడా కేంద్ర ప్రభుత్వానివేనని గుర్తించాలన్నారు. వికారాబాద్‌ అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి రూ.100కోట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ సైతం రాశారని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేకు ప్రతిపాదనలు మాత్రం ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వాత్సల్యా, ఆయూష్మాన్‌ భారత్‌ పథకాలను తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్‌ జిల్లాకు నిధులు కేటాయించాలని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఆ దిశగా నిధులు వచ్చేలా కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పాండుగౌడ్‌, శ్రీధర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, రాఘవన్‌నాయక్‌, ప్యాట శంకర్‌, చంద్రయ్య, కృష్ణయాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-27T00:15:40+05:30 IST