నెలరోజులు ముందుకు!

ABN , First Publish Date - 2023-06-07T23:53:29+05:30 IST

కోతల సమయంలో వచ్చే ప్రకృతి విపత్తుల నుంచి పంటలను కాపాడేందుకు పంట కాల పురోగతిని ముందుకు జరుపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 నెలరోజులు  ముందుకు!
అలుకుతున్న రైతు.

పంట కాల పురోగతిపై అధికారుల కసరత్తు

మేడ్చల్‌ జూన్‌7(ఆంధ్రజ్యోతిప్రతినిధి): కోతల సమయంలో వచ్చే ప్రకృతి విపత్తుల నుంచి పంటలను కాపాడేందుకు పంట కాల పురోగతిని ముందుకు జరుపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ఆ దిశగా రైతులను సన్నద్దం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో వానాకాలం, యాసంగి సీజనల్లో అత్యధికంగా వరి పంటను సాగు చేస్తారు. వానాకాలంలో వర్షాధారంగా వరి తర్వాత మొక్కజొన్న పంటను పండిస్తారు. ఆతర్వాత పత్తి, కూరగాయల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. వర్షాలు, బోరుబావులపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు. ఈ ఏడాది యాసంగి సీజన్‌లో మునుపెన్నడూ లేని విధంగా కురిసిన వడగళ్ల వర్షాల కారణంగా దాదాపు వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్న విషయం విదితమే. అంతేగాకుండా వరి కల్లాలు, వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ఈ విపత్తులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం వేస్తున్న పంటలను నెల రోజుల ముందే సాగు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లాలో ఈ వానాకాలంలో రైతులు 33వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 18,110 ఎకరాల్లో వరి, 1,850 ఎకరాల్లో మొక్కజొన్న, 3వేల ఎకరాల్లో, 4,450 ఎకరాల్లో కూరగాయలు,4,885 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారని అధికారులు పేర్కొన్నారు.

త్వరలో రైతులకు అవగాహన..

మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాలో అత్యధికంగా 18,110 ఎకరాల్లో వరి పంటలను సాగు చేస్తారు. జిల్లాలో ఎక్కువగా బోర్లపై రైతులు ఆధారపడి వ్యవసాయం సాగు చేస్తారు. సాధారణంగా ప్రతి ఏటా వానాకాలంలో బావులు, బోర్ల కింద వరి నార్లు మృగశిరకార్తెలో పోస్తుంటారు. సన్నరకాలు పండించే రైతులు రోహిణ కార్తెలోనే నార్లు పోస్తారు. దొడ్డు రకాలు సాగు చేసే రైతులు జూన్‌15 తర్వాత నార్లు పోస్తున్నారు. జూలై15 నుండి నాట్లు వేయడం ప్రారంభిస్తారు. వర్షాలను దృష్టిలో పెట్టుకుని జూలైలో నార్లు పోసి ఆగస్తు మొదటి వారంలో నాట్లు వేస్తున్నారు. ఈ పంటలు అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో కోతకు వస్తున్నాయి. ఈ సీజన్‌లో పంట కాలాన్ని ముందుకు జరిపితేనే యాసంగి సీజన్‌లో పంటలు ముందు వేసేందుకు అవకాశం ఉంటుంది. యాసంగి సీజన్‌లో వరినార్లు డిసెంబర్‌లో పోస్తారు. నాట్లు జనవరి మొదటి వారం నుంచి ఆరంభించడం వల్ల అకాల, వడగళ్ల వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయి. నవంబర్‌ 19 కల్లా నార్లు పోయడం పూర్తి చేసి డిసెంబర్‌ 20లోపు నాట్లు వేసినట్లయితే ఇబ్బంది ఉండదని వ్యవసాయ శాఖాధికారులు పేర్కొంటున్నారు. జూన్‌ 15 లోపే వరి నార్లు పోసి, జూలై 15 వరకు నాట్లు పూర్తి చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖాధికారులు సన్నద్ధం అవుతున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రోజుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా పంటల కాలాన్ని ముందుకు తీసుకువచ్చేందుకు శాస్త్ర వేత్తల సలహాలతో ఏయే పంటను ఎప్పుడు విత్తుకోవాలి, వరి నార్లు ఎప్పుడు పోయాలి, ఎన్నిరోజుల్లో నాట్లు వేయాలి, తదితర అంశాలతో కరపత్రాలను జిల్లా వ్యవసాయ శాఖ ముద్రిస్తున్నది. రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు సన్నద్దమౌతున్నారు.

పంట సాగు ముందుకు జరిపే విధంగా రైతులకు అవగాహన : మేరీ రేఖ, జిల్లా వ్యవసాయాధికారిణి

అకాల వర్షాలు, వడగళ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పంట సాగును నెల రోజుల ముందుకు జరుపాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఆ మేరకు రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. కరపత్రాలు ముంద్రించి రైతు వేదికల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో రైతులకు అవగాహన కల్పిస్తాం.

Updated Date - 2023-06-07T23:53:37+05:30 IST