అవిశ్వాస తీర్మానాలపై అదనపు కలెక్టర్‌ను కలిసిన ప్రజాప్రతినిధులు
ABN , First Publish Date - 2023-02-21T00:27:21+05:30 IST
చైర్మన్, మేయర్లపై అవిశ్వాస నోటీసును అందజేసిన దమ్మాయిగూడ కౌన్సిలర్లు, జవహర్‌నగర్ కార్పొరేషన్ కార్పొరేటర్లు సోమవారం మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యను కలిశారు.
మేడ్చల్ ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): చైర్మన్, మేయర్లపై అవిశ్వాస నోటీసును అందజేసిన దమ్మాయిగూడ కౌన్సిలర్లు, జవహర్‌నగర్ కార్పొరేషన్ కార్పొరేటర్లు సోమవారం మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యను కలిశారు. తాము అందజేసిన అవిశ్వాస నోటీసులపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఎందుకు ఇవ్వడం లేదని వారు అదనపు కలెక్టర్‌ను అడిగారు. నోటీసులపై కౌన్సిలర్లు, కార్పొరేటర్ల చేసిన సంతకాల పరిశీలన చేయాలని ఇటీవల అదనపు కలెక్టర్ కమిషనర్లకు లేఖ రాశారు. మున్సిపల్ కమిషనర్లు కూడా సంతకాలపై విచారణ చేయలేదని, ఇలా ఎందుకు తాత్సారం చేస్తున్నారని అధికారిని ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. అవిశ్వాస నోటీసులపై ప్రభుత్వం నుంచి తనకు మార్గదర్శకాలు రాలేదని మరో రెండుమూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని అదనపు కలెక్టర్ వారికి చెప్పారు. దీంతో వారు వెనుదిరిగారు. అవిశ్వాస నోటీసులు అందజేసి 30 రోజుల తరువాత కూడా చర్యలు తీసుకోకుంటే తాము కోర్టుకు వెళ్తామని, మరో 2, 3రోజులు వేచి చూసి అధికారుల స్పందన లేకుంటే కోర్టుకు వెళ్తామని నోటీసులు అందజేసిన కౌన్సిలర్లు, కాక్పొరేటర్లు అన్నారు.