మెగా డీఎస్సీ నిర్వహించాలి

ABN , First Publish Date - 2023-09-21T23:30:08+05:30 IST

అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విధంగా 13,086పోస్టులతో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్‌ జారీచేయాలని బీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులు డిమాండ్‌ చేశారు.

మెగా డీఎస్సీ నిర్వహించాలి
వికారాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న నిరుద్యోగులు

వికారాబాద్‌లో నిరుద్యోగుల నిరసన ర్యాలీ

వికారాబాద్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విధంగా 13,086పోస్టులతో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్‌ జారీచేయాలని బీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. మినీ డీఎస్సీ వొద్దు.. మెగా డీఎస్సీ నిర్వహించాలని గురువారం వికారాబాద్‌లో నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ నుంచి ఎన్టీఆర్‌ చౌరస్తా వరకు ర్యాలీ, అనంరతం రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వరకు ర్యాలీ కొనసాగించారు. వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ నియామకాల కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తుంటే... ప్రభుత్వం నామమాత్రపు పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. కోచింగ్‌ల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసుకున్న నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ప్రభుత్వం వెంటనే 13,086 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి బీఎడ్‌, బీఎడ్‌ నిరుద్యోగ అభ్యర్థులకు ఊరట కలిగేలా మెగా డీఎస్సీ ప్రకటించాలని, పరీక్షలకు నాలుగు నెలల సమయం ఇవ్వాలని, నియామక పరీక్ష ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం తమ డిమాండ్లతో జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2023-09-21T23:30:08+05:30 IST