ఆమనగల్లు అభివృద్ధికి మహర్దశ
ABN , First Publish Date - 2023-09-28T00:49:51+05:30 IST
సీఎం కేసీఆర్ సహకారంతో ఆమనగల్లు మున్సిపాలిటీకి మహర్దశ ఏర్పడనుందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ తెలిపారు. నియోజకవర్గ కేంద్రానికి సమాంతరంగా ఆమనగల్లు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
ఆమనగల్లు, సెప్టెంబరు 27 : సీఎం కేసీఆర్ సహకారంతో ఆమనగల్లు మున్సిపాలిటీకి మహర్దశ ఏర్పడనుందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ తెలిపారు. నియోజకవర్గ కేంద్రానికి సమాంతరంగా ఆమనగల్లు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో బుధవారం మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు నేనావత్ పత్యనాయక్, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీకి టీయుఎ్‌ఫఐడీసీ ద్వారా గతంలో మంజూరు చేసిన రూ.15కోట్లకు అదనంగా మరో రూ.10కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆమనగల్లు పట్టణానికి నూతనంగా మంజూరైన పాలిటెక్నిక్ కళాశాలకు పట్టణ సమీపంలోని 1429 సర్వేనెంబర్‌లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగిందని, రూ.25 కోట్లతో భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆమనగల్లు, కడ్తాల మండల కేంద్రాలలో రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు వారం రోజుల్లో మంత్రి హరీశ్‌రావుచే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ లలిత, కమిషనర్ శ్యామ్‌సుందర్, బీఆర్‌ఎస్ నాయకులు కంబాల పరమేశ్, అప్పం శ్రీను, తదితరులు ఉన్నారు.