ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని..
ABN , Publish Date - Dec 23 , 2023 | 11:56 PM
ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని మనస్తాపం చెందిన ఓ బీటెక్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
శంషాబాద్, డిసెంబరు 23 : ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని మనస్తాపం చెందిన ఓ బీటెక్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్జీఐఏ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా నల్లగుంట వెంకటాపురంనకు చెందిన పిన్‌రెడ్డి రమణారెడ్డి కూతురు నిశ్విత(22) శంషాబాద్ మండలం కాచారంలోని వర్థమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. శంషాబాద్‌లోని ఆర్భీనగర్‌లో గల ఓ లేడీస్ హాస్టల్‌లో ఉంటోంది. కాగా, తనతో పాటు చదివే దేవరాజ్ అలియాస్ చిన్ని నిశ్వితలు ప్రేమించుకున్నారు. ఈక్రమంలో అతడు మోసం చేశాడని తెలిసి మనస్తాపానికి గురైంది. దాంతో ఈనెల 22న(శుక్రవారం) రాత్రి హాస్టల్ గదిలో ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న తండ్రి హుటాహుటిన హాస్టల్‌కు చేరుకుని కన్నకూతురు విగతజీవిగా మారడంతో బోరున విలపించాడు. శనివారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహానికి పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.