పడిగాపులేనా?

ABN , First Publish Date - 2023-03-30T23:50:55+05:30 IST

ఈ-కుబేర్‌లో బిల్లులు ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

పడిగాపులేనా?

పెండింగ్‌లో రూ.50కోట్ల బిల్లులు

ఈ-కుబేర్‌ బిల్లులకు మోక్షమెప్పుడో?

నెలలుగా పెండింగ్‌లో జీపీఎఫ్‌, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, ఇతర బిల్లులు

నిధుల విడుదల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఎదురు చూపులు

నేటితో ముగుస్తున్న ఆర్థిక సంవత్సరం.. బిల్లులు క్లియర్‌ చేయాలని వేడుకోలు

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ బిల్లులు ఈ-కుబేర్‌లో నెలల పాటు పెండింగ్‌లో ఉండడంతో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్‌ జిల్లాలో 8,071 మంది ఉద్యోగులు, 4,212 మంది పెన్షనర్లు ఉన్నారు. వారికి మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, సరెండర్‌ లీవ్‌, సప్లిమెంటరీ సాలరీ, పీఆర్సీ, రిటైర్డ్‌ ఉద్యోగుల కమిటేషన్‌, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌, జీపీఎఫ్‌ తదితర బిల్లులకు ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ ఇవ్వడం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8 నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సంవత్సరం నేటితో ముగుస్తున్నందున ఇప్పటికైనా ఆర్థిక శాఖ బిల్లులకు క్లియరెన్స్‌ ఇవ్వాలని వేతన జీవులు కోరుతున్నారు.

వికారాబాద్‌, మార్చి 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఈ-కుబేర్‌లో బిల్లులు ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి బిల్లులు సమర్పించి నెలలు గడుస్తున్నా ఆర్థిక శాఖ ఆమోదం పడక డబ్బులు రాక ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. రేపు మాపు అని ఎదురుచూస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నిరాశే ఎదురవుతోంది. మరి ఆర్థిక సంవత్సరం చివరి రోజైనా(మార్చి 31) ప్రభుత్వం క్లియరెన్స్‌ ఇస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో 8,071 మంది ఉద్యోగులు, 4,212 మంది పెన్షనర్లు ఉన్నారు. ఒక జిల్లా ట్రెజరీ కార్యాలయం, నాలుగు సబ్‌ ట్రెజరీ కార్యాలయాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ బిల్లులను ఈ కార్యాలయాల్లోనే సమర్పిస్తారు. ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్‌, పార్ట్‌ ఫైనల్‌, అడ్వాన్సులు, ఫైనల్‌ పేమెంట్‌, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, టీఎ్‌సజీఎల్‌ఐ, సరెండర్‌ లీవ్‌, సప్లిమెంటరీ వేతనాలు, అటోమెటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌, పీఆర్సీ బకాయిలు, రిటైర్డ్‌ ఉద్యోగుల కమిటేషన్‌, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ తదితర బిల్లులు ఉంటాయి. ఆర్థికశాఖ క్లియరెన్స్‌ లేక వందలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, పెన్షనర్ల బిల్లులలైనా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఉద్యోగులు, రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ వాపోతున్నారు. అనారోగ్యంగా ప్రైవేట్‌/ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం కోసం వేలాది రూపాయల బిల్లులు చెల్లించి రీయింబర్స్‌మెంట్‌ కోసం బిల్లులను ట్రెజరీల్లో అందజేసి నెలలు గడుస్తున్నా ఆర్థికశాఖ క్లియరెన్స్‌ రాక ఈ-కుబేర్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్‌ బిల్లుల్లో రూ.60వేలలోపు వాటిని మంజూరు చేసి.. ఆ పైన ఉన్న బిల్లులను పెండింగ్‌లో ఉంచారంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కాగా జిల్లాలో వివిధ బిల్లులకు సంబంధించి ఈ-కుబేర్‌లో రూ.50కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ-కుబేర్‌లో గతేడాదికి బిల్లులనూ ఇంత వరకు ఇవ్వకపోవడం గమనార్హం.

ఆర్థిక శాఖ క్లియరెన్సిస్తేనే..!

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బిల్లులు డీడీవోలు చేసి ట్రెజరీకి పంపుతారు. ట్రెజరీలో ఇచ్చే ప్రతీ బిల్లుకు టోకెన్‌ జనరేట్‌ అవుతుంది. బిల్లుపై ఆర్థికశాఖ ఆమోద ముద్ర పడాలంటే ఈ-కుబేర్‌ పోర్టల్‌కు బిల్లును అప్‌లోడ్‌ చేస్తే.. దానికి ఆర్థిక శాఖ సెంట్రల్‌ అడ్మినిస్ర్టేషన్‌ క్లియరెన్స్‌ ఇవ్వాలి. అప్పుడే ఉద్యోగి ఖాతాలో బిల్లు డబ్బులు జమ అవుతాయి. ఓకే కాకుంటే ఈ-కుబేర్‌లోనే పెండింగ్‌లో ఉంటాయి. ఆర్థిక శాఖ క్లియర్‌ చేసే వరకు వేచి ఉండాల్సిందే. ఒక ఆర్థిక సంవత్సరంలో సమర్పించే బిల్లులకు అదే ఏడాదిలో క్లియరెన్స్‌ ఇవ్వాలి. ఆ బిల్లు క్లియర్‌ కాకుంటే కొత్త ఆర్థిక సంవత్సరంలో బిల్లులన్నీ మళ్లీ సమర్పించాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగులు/రిటైర్డ్‌ ఎంప్లాయీలకు భారమే. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 రోజైనా ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులకు క్లియరెన్స్‌ చేస్తుందా లేదా అనేది ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆర్థిక శాఖ నిర్ణయం కోసం వేలాది మంది ఉద్యోగులు వేచి చూస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగుల కుటుంబాలు

బిల్లులు రాక ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, సర్వీసులో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. సర్వీసులో మృతిచెందిన వారి కుటుంబాల పట్ల అయినా ప్రభుత్వం కరుణ చూపకపోవడం లేదు. ఉద్యోగి కుటుంబానికి రావాల్సిన బిల్లులు నెలలుగా పెండింగ్‌లో పెడుతున్నారు. ఓ పక్క కుటుంబ పెద్ద మృతితో తీరని రోదన ఉంటే, వేతన సెటిల్‌మెంట్‌, పెన్షన్‌ రాక ఆర్థిక ఇబ్బందులతో బాధిత కుటుంబాలు మరింత కుంగుబాటుకు గురవుతున్నాయి. గ్రాట్యుటీ, పెన్షన్‌ బెన్‌ఫిట్‌ ఫండ్‌, జీఐఎస్‌ తదితర బిల్లులు ఆలస్యం అయినా ఉద్యోగి పొదుపు చేసుకున్న జీపీఎఫ్‌, టీఎ్‌సజీఎల్‌ఐ బిల్లులైనా త్వరగా క్లియర్‌ చేయకపోవడం సరికాదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సంక్షేమ పథకాలకు నెలకు రూ.వేల కోట్లు వెచ్చించే ప్రభుత్వం.. వేతన జీవుల కుటుంబాలను ఆదుకోవడంలో మాత్రం వెనకడుగు వేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 6 నుంచి 8 నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated Date - 2023-03-30T23:50:55+05:30 IST