కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతి తీరని లోటు
ABN , First Publish Date - 2023-09-23T23:09:16+05:30 IST
పరిగి మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతి తీరని లోటని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.
కొడంగల్, సెప్టెంబరు 23: పరిగి మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతి తీరని లోటని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. హరీశ్వర్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిగికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన హరీశ్వర్‌రెడ్డి పరిగి ప్రజలకు ఎన్నో సేవలు చేశారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలిపి కుటుంబాన్ని పరామర్శించారు.
కులకచర్ల: పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి మృతిపట్ల స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు సంతాపం తెలిపారు. కులకచర్ల చౌరస్తాలో శనివారం హరీశ్వర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హరీశ్వర్‌రెడ్డి ఐదు పర్యయాలు పరిగి ఎమ్మెల్యేగా కొనసాగి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ పీరంపల్లి రాజు, నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో హరీశ్వర్‌రెడ్డిది కీలకపాత్ర
వికారాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్ర శాసనసభ మాజీ ఉప సభాపతి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని పలువురు అన్నారు. హరీశ్వర్‌రెడ్డి ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ ఎంపీడీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సత్తయ్య, తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్ట్రీరియల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల నందకుమార్, వీడీడీఎఫ్ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. జిల్లాలో చేపట్టిన ప్రత్యేక రాష్ట్రసాధన ఉద్యమాల్లో హరీశ్వర్‌రెడ్డి స్వయంగా పాల్గొని ఉద్యమానికి బాసటగా నిలిచారని గుర్తుచేశారు. పరిగిలో జరిగిన హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలకు వారు హాజరై నివాళులర్పించారు.