కొంగర కలాన్ శిగలో మరో నగ
ABN , First Publish Date - 2023-03-06T23:13:41+05:30 IST
ఇబ్రహీంపట్నం మండలంలో గిరిజన తండాకు అనుబంధంగా ఉన్న ఏకైౖక గ్రామం కొంగర కలాన్. ఔటర్ రింగ్ రోడ్డుతోపాటు ఆదిభట్ల ఐటీ జోన్‌కు కేవలం కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ నాలుగైదేళ్ల క్రితం వరకు అభివృద్ధిలో వెనకబడి ఉండేది.
కలెక్టరేట్ రాకతో మారిన కొంగర కలాన్ గ్రామ రూపురేఖలు
ఈ ప్రాంతంలోనే పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమవుతున్న ఫాక్స్‌కాన్ సంస్థ
రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఆ సంస్థ చైర్మన్
ఇకపై కొంగర కలాన్‌లో అభివృద్ధి పరుగులు.. యువతకు ఉపాధి అవకాశాలు
ఇబ్రహీంపట్నం మండలంలో గిరిజన తండాకు అనుబంధంగా ఉన్న ఏకైౖక గ్రామం కొంగర కలాన్. ఔటర్ రింగ్ రోడ్డుతోపాటు ఆదిభట్ల ఐటీ జోన్‌కు కేవలం కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ నాలుగైదేళ్ల క్రితం వరకు అభివృద్ధిలో వెనకబడి ఉండేది. రూ.58 కోట్లతో కలెక్టరేట్ ఏర్పాటుతో కొంగర కలాన్ రూపురేఖలు మారిపోయాయి. తాజాగా ఫాక్స్‌కాన్ సంస్థ ఇక్కడ రూ.3,500 కోట్లతో 196 ఎకరాలలో పరిశ్రమ ఏర్పాటుకు చైర్మన్ యంగ్ లియూతో సీఎం కేసీఆర్‌ల మధ్య జరిగిన ఒప్పందం నేపథ్యంలో కొంగర కలాన్ శిగలో మరో నగ చేరినట్లయింది. తైవాన్‌కు చెందిన ఎలక్ర్టానిక్స్, సెల్‌ఫోన్ తయారీ రంగంలో దిగ్గజ సంస్థగా పేరొందిన ఫాక్స్‌కాన్ సంస్థ రాకతో ఈప్రాంతంలోని యువతకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ధీమా పెరిగిందనే చెప్పుకోవచ్చు.
ఆదిభట్ల, మార్చి 6 : ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగర కలాన్ గ్రామం నేడు పరిచయం అక్కర్లేని పేరుగా మారింది. కొంత కాలం క్రితం వరకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది.. కేవలం ఇటుక బట్టీలకే పరిమితమైన గ్రామం నేడు సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటుతో ఉన్నట్లుండి ప్రత్యేకత సంతరించుకుంది. కొంగర కలాన్ గ్రామంలో సర్వే నెం 300లలో 370 ఎకరాలలో విస్తరించి ఉన్న ప్రభుత్వ భూమి కొంగర కలాన్ పాలిట వరంగా మారింది. ఇప్పటికే కలెక్టరేట్ ప్రారంభం కావడంతోపాటు తాజాగా తైవాన్‌కు చెందిన అతిపెద్ద సంస్థ ఫాక్స్‌కాన్ లాంటి పలు అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుకు సిద్ధం కావడంతో ఈప్రాంతం అభివృద్ధిపై అంచనాలు పెరిగాయి. రానున్న రోజులలో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు ఈప్రాంతంలో ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆదిభట్ల ఐటీ సెక్టార్‌లో టీసీఎస్‌తోపాటు టాటా బోయింగ్, టాటా అడ్వాన్స్ సిస్టం, టాటా లాకీడ్ మార్టీర్ లాంటి పలు సంస్థల ఏర్పాటుతో అంతర్జాతీయస్థాయి గుర్తింపు రాగా, మరిన్ని సంస్థలు రానుండటంతో భవిష్యత్‌లో ఈ ప్రాంత అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని నిరుద్యోగ యువత నమ్మకంతో ఉన్నారు.
ఫాక్స్‌కాన్ రాకతో మహర్దశ
తైవాన్ దేశానికి చెందిన దిగ్గజ సంస్థ ఏర్పాటుకు ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్ వేదిక కానుంది. ఈ మేరకు ప్రభుత్వం సదరు సంస్థ ఏర్పాటుకు భూమి కేటాయించేందుకు సర్వే సైతం పూర్తి చేసినట్లు తెలుస్తుంది. కొంగరకలాన్ కలెక్టరేట్ సమీపంలో సర్వే నెంబర్ 300లలో సుమారు 200 ఎకరాలు కేటాయించినట్లు సమాచారం. ఎలక్ర్టానిక్స్, సెల్‌ఫోన్ తయారీ రంగంలో పెద్ద సంస్థగా పేరొందిన ఫాక్స్‌కాన్ తమ యూనిట్ ఏర్పాటుకు కొంగకలాన్‌ను ఎంచుకోవడంతో ఈ ప్రాంత ముఖ చిత్రం మారనుంది. మున్ముందు ఇక్కడ అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయమని ఈ ప్రాంత వాసులు చెప్పుకుంటున్నారు. సుమారు రూ.3500 కోట్ల భారీ పెట్టుబడితో లక్షల మందికి ఉపాధినిచ్చే సంస్థ రావడం గొప్ప విషయంగా ప్రజలు భావిస్తున్నారు. ఏటా కొన్ని వేలమంది నిరుద్యోగ యువతకు ఉపాధినిచ్చే ఈ సంస్థ పదేండ్లలో లక్ష మందికి ఉపాధి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఈ సంస్థ ఏర్పాటుకు రెండు ప్రాంతాలను పరిశీలించి సంస్థ యాజమాన్యం కొంగరకలాన్ ను ఎంచుకుంది.
స్థానిక యువత ఉపాధికి భరోసా?
కొంగరకలాన్‌లో ఏర్పాటు కానున్న సెల్‌ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్.. రానున్న పదేళ్లలో లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించడంతో ఈప్రాంతంలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కలిగే అవకాశాలున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే సంస్థను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం మంచి పరిణామంగా చెప్పుకోవాలి. కానీ స్థానిక యువతకు ఉపాధి విషయంలో ఎంతవరకు భరోసా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఆదిభట్ల కేంద్రంగా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేసినప్పటికీ స్థానిక నిరుద్యోగ యువతకు మాత్రం ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయాయన్న ఆరోపణలున్నాయి. ఇక్కడ నూతనంగా ఏర్పాటు కానున్న ఫాక్స్‌కాన్ సంస్థలలోనైనా స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అభివృద్ధికి బంగారు బాటలు
ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో తైవాన్ దేశానికి చెందిన సంస్థ తమ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధం అయ్యింది. ఎలక్ర్టానిక్స్, సెల్‌ఫోన్ తయారీ రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న ఫాక్స్‌కాన్ ఏర్పాటు తరువాత ఈప్రాంతం మరింత అభివృద్ధి జరుగుతుంది. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయి. సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు తరువాత వస్తున్న మరో పెద్ద సంస్థ కావడంతో ఈప్రాంత అభివృద్ధికి బంగారు బాటలు పడినట్లే. రానున్న కొద్ది రోజుల్లో కోట్లాది రూపాయల పెట్టుబడులతో మరో సంస్థ సైతం రానుంది. దీంతో ఈప్రాంత రానున్న రోజుల్లో అభివృద్ధికి చిరునామాగా మారుతుంది.
మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం