బదిలీలకు వేలాయె!
ABN , First Publish Date - 2023-06-16T00:18:29+05:30 IST
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మొదలైన కసరత్తు
జూలై నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తికి చర్యలు
మూడేళ్లు జిల్లాలో పనిచేసిన అధికారులకు ట్రాన్స్‌ఫర్
రెవెన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్ శాఖల్లో బదిలీలు
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ రోజురోజుకూ వేగవంతం అవుతున్న నేపథ్యంలో జిల్లాలో మూడేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న అధికారులను మరో జిల్లాకు బదిలీ చేసే పనులు ప్రారంభించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్ శాఖల్లో బదిలీలు జరగనున్నాయి. రెవెన్యూ శాఖలో తహసీల్దార్ మొదలుకొని డీఆర్వో వరకు, పోలీస్ శాఖలో ఎస్సై మొదలుకొని ఏఎస్పీ వరకు, పంచాయతీ రాజ్‌లో ఎంపీడీవో నుంచి సీఈవో వరకు జిల్లాలో మూడేళ్లు పనిచేసిన వారిని గుర్తించి ట్రాన్స్‌ఫర్లు చేయనున్నారు.
వికారాబాద్, జూన్ 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల ప్రక్రియతో ప్రత్యక్ష సంబంధం కలిగిన రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ విభాగాల అధికారుల బదిలీలకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. మూడేళ్లకుపైగా జిల్లాలో పనిచేస్తున్న అధికారులను బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జూలై నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తికి జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా వివరాలు సేకరిస్తున్నారు. ఆయా శాఖల అధికారుల్లో జిల్లాలో మూడేళ్లు సర్వీసు పూర్తిచేసిన వారికి ఎన్నికల బదిలీలు ఖాయం. అయితే ఏ స్థాయి అధికారులను బదిలీ చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత శాసన సభ పదవీ కాలం 2024 జనవరి 16తో ముగియనున్న నేపథ్యంలో ఆ లోపే కొత్త ఎమ్మెల్యేలను ఎన్నుకునే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపు ప్రక్రియ చేపట్టింది. ఆగస్టు 2న తాజా ఓటరు ముసాయిదా, అక్టోబరు 4న తుది జాబితాను ప్రచురిస్తారు. జిల్లా కలెక్టర్ మొదలుకొని రెవెన్యూ శాఖలో తహసీల్దార్ వరకు, పోలీసు శాఖలో ఎస్పీ నుంచి ఎస్‌ఐ వరకు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తారు. ఎన్నికల ప్రక్రియలో కీలకంగా వ్యహరించే అధికారుల్లో జిల్లాలో మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న వారిని బదిలీ చేయనున్నారు. వారు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ బదిలీలు చేపట్టనున్నారు. అధికారులు సొంత జిల్లాలో ఎన్నికల విఽధులు నిర్వహించకూడదు. 2024 జనవరి 31వ తేదీ నాటికి ఒకే జిల్లాలో మూడేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న వారెవరూ ఆ జిల్లాలో ఎన్నికల సమయంలో విధులు నిర్వహించకూడదు. సర్వీసుతో సంబంధం లేకుండా సొంత జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లు, ఎస్‌ఐ, ఎంపీడీవోలకు, ఆపై అధికారులకు బదిలీ తప్పనిసరి.
రెవెన్యూలోనే అధికం
జిల్లాలో విధులు నిర్వహిస్తున్న కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీల్లో ఎవరి సర్వీస్ కూడా ఇంకా మూడేళ్లు పూర్తికాలేదు. ప్రస్తుత కలెక్టర్, ఎస్పీల సారథ్యంలోనే జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇద్దరు ఆర్డీవోల్లో తాండూరు ఆర్డీవో అశోక్‌కుమార్ జిల్లాకొచ్చి మూడేళ్లు పూర్తయింది. ఇటీవల స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన ఇన్‌చార్జి డీఆర్వోగా వ్యవరిస్తున్నారు. అశోక్‌కుమార్ బదిలీ తప్పనిసరి కానుంది. వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి జిల్లాకొచ్చి ఏడాది గడిచింది. జిల్లాలో 24 మంది తహసీల్దార్లు ఉండగా వారిలో 13 మందికి బదిలీ తప్పనిసరి అయ్యేలా ఉంది. 11 మంది జిల్లాలో కొనసాగనున్నారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ అమరేందర్‌కృష్ణ, కలెక్టరేట్‌లో వివిధ విభాగాల్లో తహసీల్దార్లుగా పనిచేస్తున్న విద్యాసాగర్‌రెడ్డి, మహే్‌షగౌడ్, హరిత, ఎన్‌వై.గిరి, వికారాబాద్ డీఏవో భీమయ్య, తాండూరు డీఏవో సుధ, బొంరా్‌సపేట్, బషీరాబాద్, పరిగి, ధారూరు తహసీల్దార్లు షర్మిల, వెంకటేశం, రాంబాబు, భవనేశ్వర్‌లకు బదిలీలు లేనట్లేనని తెలుస్తోంది. జిల్లా నుంచి తప్పనిసరిగా బదిలీ కావాల్సిన తహసీల్దార్లలో ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉండి, వారి సేవలు జిల్లాకు అవసరం అని కలెక్టర్ భావిస్తే మాత్రం బదిలీ నుంచి మినహాయింపు ఉండొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతితో అలాంటి వారికి మినహాయింపు లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉండే అధికారులకూ ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇస్తారు.
పోలీసు శాఖలో తక్కువే
జిల్లాలో మూడు సబ్ డివిజన్లు, ఐదు సర్కిళ్లు, 21 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ముగ్గురు డీఎస్పీలు, 16మంది ఇన్‌స్పెక్టర్లు, 55 మంది ఎస్‌ఐలు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అధికారులు ఇతర జిల్లాల వారే. వచ్చే ఏడాది జనవరి కల్లా జిల్లాలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకోని వారికి ట్రాన్స్‌ఫర్ ఆస్కారం లేనట్టే. ఎన్నికల బందోబస్తు, భద్రత పర్యవేక్షణ వారు జిల్లాలోనే విధులు నిర్వహించే అవకాశం ఉంది. స్టేట్ క్యాడర్ అధికారుల్లో వికారాబాద్ సొంత జిల్లా కలిగిన వారు, ఇక్కడ మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు ఇతర జిల్లాలకు బదిలీ కానున్నారు. ఈ నిబంధనల ప్రకారం అయ్యే బదిలీల్లో పోలీసు శాఖలో తక్కువే ఉంటాయని తెలుస్తోంది.
పంచాయతీరాజ్‌లోనూ బదిలీలు?
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈసారి పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సైతం బదిలీలు జరిగే అవకాశం ఉంది. సొంత జిల్లాకు చెందిన వారైనా, మూడేళ్లు జిల్లాలో సర్వీసు పూర్తిచేసుకున్న ఎంపీడీవో, ఎంపీవోల జాబితా పంపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు వివరాల సేకరణకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో 18 మందికిపైగా అధికారులు పనిచేస్తున్నారు. జిల్లాలో సర్వీసు మూడేళ్లు పూర్తిచేసుకున్న ఎంపీడీవోలు 10 మంది ఉన్నారు. కోట్‌పల్లి, తాండూరు, మోమిన్‌పేట్, దౌల్తాబాద్, దోమ, పెద్దేముల్, వికారాబాద్, పరిగి, ధారూరు, ఎంపీడీవోలు జిల్లాకొచ్చి మూడేళ్లయింది. కాగా పెద్దేముల్, వికారాబాద్, పరిగి, ధారూరు, పూడూరు ఎంపీడీవోలు జిల్లా వాసులు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు.. జిల్లాలో 10మంది ఎంపీడీవోల ట్రాన్స్‌ఫర్ ఖాయం కానుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారు. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న నవాబ్‌పేట ఎంపీడీవోను ఎన్నికల బదిలీ నుంచి మినహాయించే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల బదిలీల నుంచి తమను మినహాయించాలని పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. ఎన్నికల బదిలీల్లో తమను భాగం చేయొద్దని మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఎంపీడీవోలు తమ సంఘం ద్వారా కలెక్టర్‌కు విన్నవించినట్లు తెలిసింది. జిల్లా ఎన్నికల అధికారి హోదాలో బదిలీల నుంచి మినహాయించే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుంది. అయితే ఎన్నికల బదిలీలు జిల్లాలో పంచాయతీరాజ్ అధికారులకు వర్తిస్తాయా? లేదా? అనేది తేలాల్సి ఉంది.