అట్టహాసంగా..

ABN , First Publish Date - 2023-06-02T23:27:50+05:30 IST

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల్లో అట్టహాసంగా జరుపుకున్నారు. పట్టణ, మండల కేంద్రాలతో పాటు గ్రామగ్రామాన ప్రభుత్వ , పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అనంతరం అమరవీరుల స్థూపం, చిత్ర పటాల వద్ద నివాళులర్పించారు. వికారాబాద్‌ కలెక్టరేట్‌ అవరణలో ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌, మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

 అట్టహాసంగా..
కలెక్టరేట్‌లో జెండా ఎగురవేస్తున్న మంత్రి మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం

వికారాబాద్‌ ఇంటిగ్రేటెట్‌ కలెక్టరేట్‌లో జెండాను ఎగురవేసిన ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌

కీసర లో అమర వీరుల చిహ్నం వద్ద నివాళులర్పించిన మంత్రి మల్లారెడ్డి

కలెక్టరేట్‌ ఆవరణలో పతాకావిష్కరణ, పోలీసుల గౌరవవందనం స్వీకరణ, అవార్డుల ప్రదానం

అకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల్లో అట్టహాసంగా జరుపుకున్నారు. పట్టణ, మండల కేంద్రాలతో పాటు గ్రామగ్రామాన ప్రభుత్వ , పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అనంతరం అమరవీరుల స్థూపం, చిత్ర పటాల వద్ద నివాళులర్పించారు. వికారాబాద్‌ కలెక్టరేట్‌ అవరణలో ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌, మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

అభివృద్ధి పథంలో ముందుకు సాగుదాం : రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌

వికారాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్ఫూర్తితో వికారాబాద్‌ జిల్లా అభివృద్ధి పథంలో ముందుండేలా కృషి చేద్దామని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర అవతరణ ద శాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన అమర వీరుల స్థూపం వద్ధ ఆయనతో పాటు జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, కొప్పుల మహే్‌షరెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయకుమార్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, ఎంపీపీ చంద్రకళ తదితరులు నివాళులర్పించారు. అనంతరం వినోద్‌కుమార్‌ జాతీయ పతాకం ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన విజయాలు సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో వికారాబాద్‌ జిల్లా కావాలన్న ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష సాకారమైందని, కొత్త జిల్లా ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైందని చెప్పారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని, మహిళలకు పూర్తి భద్రత, రక్షణ కల్పించే విషయంలో పోలీసు యంత్రాంగం భరోసా కేంద్రం, మూడుషీటీంల ద్వారా తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. జిల్లాలో మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరిద్ధరించి పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవడంతో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. జిల్లాలో గొర్రెల పంపిణీ పథకం రెండో విడత 12,111 మంది లబ్ధ్దిదారులకు ఈనెల 9వ తేదీన గొర్రెలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వికారాబాద్‌ జిల్లాకు మంజూరైన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను అనంతగిరిలో ప్రారంభించుకోబోతున్నామని, ఈ కళాశాలకు ప్రభుత్వం రూ.235 కోట్లు కేటాయించిందని చెప్పారు. జిల్లా ప్రజలకు పరిపాలనాపరంగా మరింత చేరువై 50 పడకల ఆయూష్‌ ఆసుపత్రి, 450 పడకల ప్రభుత్వ ఆసుపత్రి సేవలు త్వరగా అందుబాటులో రావాలని, జిల్లా అభివృద్ధి పథంలో ఇంకా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి చేపట్టిన వివిధ అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలను వినోద్‌కుమార్‌ సన్మానించారు. అమరవీరుడు యాదయ్య తల్లి అనసూజను సన్మానించి, వికారాబాద్‌ డైట్‌ కళాశాలలో ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రం అందజేశారు. కాగా దశాబ్ది వేడుకలకు గతంలో కంటే ఈ సారి ఎక్కువసంఖ్యలో హాజరయ్యారు. సౌకర్యాలు కల్పించకపోవడంతో పాటు కుర్చీలు లేక ఆశాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు కింద కూర్చొవాల్సి వచ్చింది.

స్టాళ్లను సందర్శించిన వినోద్‌కుమార్‌

రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. డీఆర్‌డీఏ, మిషన్‌ భగీరథ, పశువైద్య సంవర్ధక, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ, వ్యవసాయ శాఖలు, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను వినోద్‌కుమార్‌ ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులు, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

తెలంగాణ దేశానికే ఆదర్శం : కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ జూన్‌ 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్ర వారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కీసరలోని తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, అదనపు కలెక్టర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌ కార్యాలయంలో మంత్రి జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడి ్డ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ నిలుస్తుందన్నారు. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. 21 రోజుల పాటు జిల్లాలో పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి చేపట్టిన వివిధ అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. అనంతరం ఉత్తమ అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు రూ. 18 కోట్ల 35 లక్షల 33 వేల నిధులకు సంబంధించి ఆశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ పద్మజారాణికి చెక్కు అందజేశారు. మెప్మా వారికి రూ. 16 కోట్ల 61 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడి ్డ, జిల్లా అదనపు కలెక్టర్‌లు ఏనుగు నర్సింహారెడ్డి, అభిషేక్‌అగస్త్యా, డీఆర్‌వో లింగ్యానాయక్‌, ఆర్డీవో రవి, మల్లయ్య, ఆయా శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నేడు రైతు దినోత్సవం

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మేడ్చల్‌ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతువేదికల వద్దఉత్సవాలు నిర్వహించనున్నారు. మూడుచింతలపల్లిలో కార్యక్రమాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించనున్నారు. రైతువేదికల వద్ద రైతులకు వ్యవసాయ కార్యక్రమాలపై అవగాహన, సాగు పురోగతి తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారిణ మేరీరేఖా తెలిపారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ల వద్ద శుక్రవారం దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ కార్యాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. మేడ్చల్‌ కలెక్టరేట్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఆయా శాఖల ఆధ్వర్యంలో నాడు-నేడు ప్రదర్శన ఆకట్టుకున్నది. జిల్లాలో జరిగే ఉత్సవాలను కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద వీక్షించే విధంగా ప్రత్యేక స్ర్కీన్‌ను ఏర్పాటు చేశారు. వికారాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద చిన్నారులు, విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలకు అతిథులు ముగ్దులై ప్రశంసలు గుప్పించారు. ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థినులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు.

పోచారం మున్సిపాలిటీకి ఉత్తమ అవార్డు

ఘట్‌కేసర్‌ : హరితహారం, పారిశుధ్య నిర్వహణలో పోచారం మున్సిపాలిటీకి ఉత్తమ మున్సిపాలిటీ అవార్డు వరించింది. శుక్రవారం మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈఅవార్డును అందజేశారు. మున్సిపాలిటీకి గతంలో రాష్ట్ర స్థాయిలో ఓడిఫ్‌+ ఆవార్డు వచ్చిన విషయం విదితమే. కాగా దశాబ్ది ఉత్సవాలను పురష్కరించుకొని జిల్లాస్థాయిలోనూ హరితహారం, బస్తీ దవాఖానాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ, తదితర అంశాల్లో ఉత్తమ మున్సిపాలిటీగా గుర్తించి అవార్డును అందజేశారు. చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నానావత్‌ రెడ్డియా నాయక్‌లతో కలిసి కమిషనర్‌ సురేష్‌ మంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

ఉత్సవాల్లో బల్దియా చైర్‌పర్సన్‌కు అవమానం

తాండూరు : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నకు తీవ్ర పరాభవం ఎదురైంది. తాండూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో సామూహిక జెండా కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేని అధికారులు ఆహ్వానించిన వెంటనే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ను వేదికపైకి ఆహ్వానించారు. అప్పటికే ముందు వరుసలో మూడు కుర్చీలు ఉండగా, ఒక కుర్చీలో ఆర్డీవో అశోక్‌కుమార్‌, మరో కుర్చీలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజుగౌడ్‌ కూర్చున్నారు. చైర్‌పర్సన్‌ వేదిక మీదికి ఎక్కగానే ముందు వరుసలో చైర్‌ లేకపోవడంతో ఆర్డీవోను చైర్‌ ఇవ్వాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో రెండో వరుసలోని కుర్చీలో కూర్చునేందుకు చైర్‌పర్సన్‌ అవమానంగా భావించి వేదిక దిగి వెళ్లిపోయారు. చైర్‌పర్సన్‌ అని కూడా చూడకుండా, ఓ మహిళా అనే గౌరవం లేకుండా తనను అవమాన పరిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని చైర్‌పర్సన్‌ పేర్కొన్నారు.

సోనియాగాంధీకి క్షీరాభిషేకం

పరిగి, జూన్‌ 2: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ శ్రేణులు పార్టీ కార్యాలయాలు, చౌరస్తాల్లో జాతీయ జెండాలను ఎగురవేయడంతో పాటు సోనియాగాంధీ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు పరిగిలోని అమరవీరుల చౌరస్తాలో డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి ఏఐసీసీ అధినేత్రీ సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. నీళ్ళు, నిధులు, నియమాకాల పేరుతో సీఎం కేసీఆర్‌ రెచ్చగొట్టి 1400 మంది ఉద్యమకారులను ఆత్మబలిదానం చేయించారని విమర్శించారు. మానవీయ కోణంలో సోనియా ఆలోచించి తెలంగాణ ఇస్తే, ఇక్కడ కేసీఆర్‌ కుటుంబ పాలనగా మారిందన్నారు.

Updated Date - 2023-06-02T23:27:50+05:30 IST