కోడిగుడ్లపై ముద్ర
ABN , First Publish Date - 2023-06-26T00:13:38+05:30 IST
అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణుల, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహరం అందిస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో అమలు
పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు
నెలకు మూడు బ్యాచుల చొప్పున సరఫరా
బ్యాచుకో రంగులో స్టాంపింగ్
అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే పౌష్టికాహారం, గుడ్లు పక్కదారి పడుతున్నాయన్న వార్తలు నిత్యం చూస్తూనే ఉన్నాం. అలా కాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లపై స్టాంపింగ్ చేయాలని నిర్ణయించారు. ఇలా స్టాంపింగ్ చేసిన గుడ్లనే కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో చాలా వరకు కోడిగుడ్లు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేసినట్టవుతుందని భావిస్తున్నారు. చేవెళ్లలోని కేంద్రాలకు ఈ కోడిగుడ్లు ఇప్పటికే చేరాయి.
చేవెళ్ల, జూన్ 25: అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణుల, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహరం అందిస్తున్నారు. ఏడు నెలల వయసు శిశువుల నుంచి మూడేళ్ల పిల్లల వరకు నెలకు 16చొప్పున గుడ్లు ఇస్తారు. అలాగే గర్భిణులు, బాలింతలు, అంగన్‌వాడీ కేంద్రాలకొచ్చే చిన్నారులకు రోజుకొకటి చొప్పున గుడ్లను ప్రభుత్వం పౌష్టికాహారంలో భాగంగా అందజేస్తోంది. అయితే ప్రస్తుతం ఇస్తున్న కోడిగుడ్లు నాసిరకంగా ఉంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. చెడిపోయిన, పరిమాణంలో చిన్నగా ఉన్న గుడ్లను సరఫరా చేస్తున్న ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లు, కొందరు మధ్యవర్తుల ప్రమేయంతోనే ప్రభుత్వం సరఫరా చేసే గుడ్లలో నాణ్యత లోపించడంతో పాటు కొన్నిసార్లు పక్కదారి పడుతున్నాయని భావించిన ప్రభుత్వం వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. జూన్ మొదటి వారం నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న గుడ్లపై అంగన్‌వాడీ ముద్ర వేసి సరఫరా చేస్తున్నారు. కేంద్రాలకు ప్రతీ నెల వచ్చే గుడ్లపై ముద్రలు వేసి పంపిణీ చేస్తున్నారు. అన్ని సెంటర్లకు మూడు బ్యాచ్‌ల్లో గుడ్లను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి బ్యాచ్‌లో వచ్చే గుడ్లపై బ్లూ కలర్, రెండో బ్యాచ్ గుండ్లపై రెడ్ కలర్ ముద్రలు వేస్తారు. మూడో బ్యాచ్‌లో వచ్చే గుడ్లపై ఆకుపచ్చ రంగు ముద్రవేసి పంపిణీ చేస్తారు. ఇప్పటివరకు చేవెళ్ల డివిజన్‌లో రెండు బ్యాచ్‌ల గుడ్లు సరఫరా చేశారు.
పక్కదారి పట్టకుండా
కొందరు అంగన్‌వాడీ గుడ్లను బయట అమ్ముకుంటున్నారు. అంగన్వాడీ కోడిగుడ్లపై ముద్ర వేస్తే బయట సరఫరా చేసినా గుర్తించొచ్చనే ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఆరోగ్యలక్ష్మి పథకం కింద అంగన్‌వాడీ కేంద్రాల్లో నెలకు 26గుడ్లు, రోజూ 200ఎంఎల్ పాలు, మధ్యాహ్న భోజనం అందజేస్తారు. చేవెళ్ల డివిజన్‌లో ప్రతీ నెల 2లక్షల గుడ్లు సరఫరా అవుతాయి. కాంట్రాక్టర్ సరఫరా చేసే గుడ్లను అంగన్‌వాడీ టీచర్లు పరిశీలించాలి. వాటిపై ముద్ర లేకపోతే తీసుకునేందుకు నిరాకరించి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకవెళ్లాలి. నాణ్యత లేని గుడ్లు సరఫరా అయితే కాంట్రాక్టర్‌ను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటారు. చేవెళ్ల డివిజన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్ మండలాల్లో 216 మెయిన్ అంగన్‌వాడీ సెంటర్లు, 39 మినీ అంగన్‌వాడీ లున్నాయి. 6నెలల నుంచి 3ఏళ్ల లోపు పిల్లలు 8,590 మంది.. 3ఏళ్ల నుంచి ఆరేళ్ల లోపు పిల్లలు 3,479 మంది ఉన్నారు. ప్రస్తుతం 1,048 మంది గర్భిణులున్నారు. వీరిలో 853 మంది అంగన్‌వాడీ కేంద్రాలకొచ్చి భోజనం చేస్తున్నారు. ప్రతీ నెల డివిజన్‌లోని అన్ని సెంటర్లకు రెండు లక్షల వరకు గుడ్లు సరఫరా చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ నిర్ణయం లబ్ధిదారులకు మేలు చేసేదే : శోభారాణి, సీడీపీవో, చేవెళ్ల
కోడిగుడ్లపై ప్రభుత్వం ముద్ర వేసి పంపిణీ చేసే విఽధానం బాగుంది. దీంతో లబ్ధిదారులకు నాణ్యమైన గుడ్లు అందుతాయి. ప్రభుత్వ నిర్ణయం అందరికీ మేలు చేసేదే. నూతన విధానంలో చేవెళ్ల డివిజన్‌కు ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌ల గుడ్లు సరఫరా అయ్యాయి.\