Share News

హైనా దాడి.. రెండు లేగదూడల మృత్యువాత

ABN , First Publish Date - 2023-12-05T23:36:10+05:30 IST

మండల కేంద్రంలోని పెంజర్ల రోడ్డు సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో సోమవారం అర్ధరాత్రి పశువుల కొట్టంలోని పశువులపై హైనా దాడిచేసి రెండు లేగడూదలను చంపేసింది.

హైనా దాడి.. రెండు లేగదూడల మృత్యువాత
హైనా దాడి ప్రదేశాన్ని పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు

కొత్తూర్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఘటన

ప్రజలు భయాందోళన చెందొద్దు : ఇన్‌స్పెక్టర్‌

కొత్తూర్‌, డిసంబరు 5: మండల కేంద్రంలోని పెంజర్ల రోడ్డు సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో సోమవారం అర్ధరాత్రి పశువుల కొట్టంలోని పశువులపై హైనా దాడిచేసి రెండు లేగడూదలను చంపేసింది. ఈ ఘటన వివారాల్లోకి వెళ్తే.. కొత్తూర్‌కు చెందిన బావుగారి నిర్మల రైతు తన పశువులను సోమవారం రాత్రి పొలం వద్ద ఉన్న కొట్టంలో కట్టేసి ఇంటికి పోయింది. మంగళవారం ఉదయం నిర్మల కొట్టం వద్దకు వచ్చి చూసే సరికి రెండు లేగదూడలను ఏదో జంతువు చంపినట్టు గుర్తించింది. ఆమె ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని చూసి అధికారులకు సమాచామిచ్చారు. లేగదూడలను చిరుతపులే చంపిందనే వార్త దావానంలా వ్యాపించడంతో స్థానిక రైతులు, ప్రజలు భయాందోళన చెందారు. అమనగల్‌ ఆటవీ అధికారులు రవికుమార్‌, అజీజ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని దూడలను చంపిన జంతువు పాదముద్రలను పరిశీలించారు. లేగదూడలను చంపి తిన్నది హైనాగా వారు నిర్ధారించారు. అధికారుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పశువైద్యురాలు స్ఫూర్తి లేగదూడలకు పోస్టుమార్టం నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రెడ్డి పరిశీలించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జె.సుదర్శన్‌గౌడ్‌, దేవేందర్‌ అక్కడకి చేరుకొని రైతు నిర్మలను ఓదార్చారు. పశువులపై ఆధారపడి జీవిస్తున్న తనను ప్రభుత్వం అదుకోవాలని నిర్మల విలపించింది. లేగదూడలను చంపింది హైనా అని, చిరుత కాదని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ప్రజలు భయాందోళన చెందొద్దన్నారు.

Updated Date - 2023-12-05T23:36:51+05:30 IST