గుండ్లపోచంపల్లిలో బీజేపీ-కాంగ్రెస్ నాయకుల హల్‌చల్
ABN , First Publish Date - 2023-11-10T23:57:28+05:30 IST
బీజేపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న పూకార్లతో శుక్రవారం గుండ్లపోచంపల్లిలోని ఆయన నివాసం వద్ద హల్‌చల్ నెలకొంది.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న పుకార్లు
మేడ్చల్ టౌన్, నవంబరు 10: బీజేపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న పూకార్లతో శుక్రవారం గుండ్లపోచంపల్లిలోని ఆయన నివాసం వద్ద హల్‌చల్ నెలకొంది. విక్రమ్‌రెడ్డి తమ పార్టీలోకి వస్తున్నారన్న ఉత్సాహంతో కాంగ్రెస్ నేతలు... తమ నేత పార్టీ వీడుతున్నారన్న వార్త తెలుసుకుని బీజేపీ నేతలు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఫలితంగా ఇరు పార్టీల నేతలు ఒకచోటికి చేరడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఆయోమయంలో పడ్డారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున అధిష్ఠానం విక్రమ్‌రెడ్డి పేరును గురువారం రాత్రి దాదాపు ఖరారు చేసి నామినేష్ వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విక్రమ్‌రెడ్డి గురువారం రాత్రి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం నామినేషన్ వేసేందుకు సిద్ధం అయ్యారు. ఇదే క్రమంలో పార్టీ విక్రమ్‌రెడ్డికి బదులుగా ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి పేరును ప్రకటించింది. విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, అభిమానులు శుక్రవారం ఉదయం ఆయన ఇంటి వద్దకు చేరుకొని అధిష్ఠాన నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇదే క్రమంలో విక్రమ్‌రెడ్డికి ఆశచూపి మోసం చేశారని చర్చించుకున్నారు. ఇదే క్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ముఖ్య అనుచరుడు ఉదయ్ గుండ్లపోచంపల్లిలోని విక్రమ్‌రెడ్డి ఇంటికి వచ్చారు. ఆయనతో పాత పరిచయం ఉండటంతో బీజేపీ టికెట్ ఆశ చూపి మోసం చేసిన విషయంపై చర్చించారు. ఒక సందర్భంలో విక్రమ్‌ను కాంగ్రె్‌సలోకి ఆహ్వానించారు. దీంతో విక్రమ్‌రెడ్డి బీజేపీ వీడి కాంగ్రె్‌సలో చేరటానికి చర్చలు జరుపుతున్నారన్న పుకార్లు లేచాయి. విషయం తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు విక్రమ్‌రెడ్డి ఇంటికి చేరుకొని పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. రాత్రి టికెట్ ఖరారు చేసిన అధిష్టానం మరొకరికి టికెట్ కేటాయించిందన్న విషయం కొందరు బీజేపీ నేతలకు అక్కడికి చేరేంత వరకూ తెలియకపోవటంతో వారు అధిష్ఠాన నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విక్రమ్‌రెడ్డి లాంటి యువ నాయకుడు ప్రస్తుత పరిస్థితుల్లో తమ పార్టీలో చేరుతున్నారన్న ఉత్సాహంతో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయన ఇంటికి చేరుకుని తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. మొత్తానికి 3గంటల పాటు కొనసాగిన హైడ్రామాతో విక్రమ్‌రెడ్డి తన నిర్ణయం ప్రకటించకపోవటంతో బీజేపీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా అర్బన్ అధ్యక్షుడు పొన్నాల హరీ్‌షరెడ్డి.. విక్రమ్‌రెడ్డి వద్దకు చేరుకుని పరిస్థితులను సమీక్షించి ఆంతా ఓకే అంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చి వెళ్లారు.
అధిష్ఠానంతో పోరాడి ఒప్పిస్తా
ఊహ తెలిసినప్పటి నుంచి బీజేపీ జెండా మోసి అంచలంచలుగా ఎదుగుతూ తాను నేడు ఈ స్థాయికి వచ్చానని, అయినా అధిష్ఠానం తన కష్టాన్ని గుర్తించకపోవటం బాధాకరం అని విక్రమ్‌రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. అధిష్ఠానంతో పోరాడి బీఫామ్ సంపాదించే ప్రయత్నం చేస్తానని, చివరి క్షణం వరకైనా తనను అధిష్టానం గుర్తిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. సమయం లేనందున తాను కూడా నామినేషన్ దాఖలుచేశానని ఆయన తెలిపారు.
పార్టీ అధిష్ఠానం సమాధానం చెప్పాలి
కీసర: బీజేపీ మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థిగా ముందుగా తనని ప్రకటించి, బీ-ఫామ్‌ను ఏనుగు సుదర్శన్‌రెడ్డికి ఇవ్వడం పట్ల బీజేపీ జిల్లా రూరల్ అధ్యక్షుడు పటోళ్ల విక్రమ్‌రెడ్డి అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కీసర ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశానని, పార్టీ అధిష్టానం ముందు తన పేరును ప్రకటించి, అనంతరం రాత్రికిరాత్రే పేరు మార్చి ఏనుగు సుదర్శన్‌రెడ్డి పేరు ప్రకటించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానన్నారు. దీనిపై తనకు, తన అనుచరులకు పార్టీ అధిష్టానం పట్ల గౌరవం పోతోందన్నారు. ఈ విషయంపై అధిష్టానంతో తాడోపేడో తెల్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు.