నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2023-06-26T22:51:27+05:30 IST
ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన పేదలకు అందించాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజా సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్ .వీరయ్య
పరిగి/మోమిన్‌పేట్/వికారాబాద్ రూరల్, జూన్ 26: ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన పేదలకు అందించాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. పేదల సమస్యల సాధనకు ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర సోమవారం పరిగి, మోమిన్‌పేట, వికారాబాద్‌లో సాగింది. ఈ సందర్భంగా మోమిన్‌పేట్‌లో ఆయన అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న ప్రతీ ఒక్కరికి 125 గజాల స్థలాన్ని కేటాయించాలన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు అందించాలన్నారు. గతంలో పట్టాలు పొందిన పేదవారికి ఇళ్ల స్థల సరిహద్దులను నిర్ణయించి భూమిని అప్పగించాలన్నారు. పరిగిలో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్.వెంకట్రాములు, రైతు సంఘం కార్యదర్శి పి.జంగారెడ్డి మాట్లాడుతూ, తొమ్మిదేళ్ల పాలనలలో ఎంతమందికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ఇచ్చారని ప్రశ్నించారు. పరిగి నియోజకవర్గంలో అయితే ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. పరిగి మండలం రంగాపూర్‌లోని సర్వేనంబర్ 18లో 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లులక్ష్మీ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, డీవైఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశ్, నాయకులు ఎం.వెంకటయ్య, ఆర్.మైపాల్, బుస చంద్రయ్య, రవి, హబీబ్, సత్తయ్య, లక్ష్మీ, సునీత పాల్గొన్నారు. కాగా వికారాబాద్‌లోని స్థానిక కార్యాలయంలో వీరయ్య మాట్లాడుతూ జూలై 3న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తున్నామని, విజయవంతం చేయాలని తెలిపారు. పి.మల్లేశం, మహిపాల్, రవి, శ్రీను నాయక్, సుదర్శన్, సతీష్, లాలయ్య పాల్గొన్నారు.