నిర్లక్ష్యం పరాకాష్టకు!
ABN , First Publish Date - 2023-03-05T23:53:50+05:30 IST
రెండున్నరేళ్ల క్రితం భారీ వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డుకు మరమ్మతులు చేయక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మరమ్మతులకు నోచుకోని ప్రధాన రోడ్లు
రెండున్నరేళ్ల క్రితం వర్షాలకు కొట్టుకుపోయిన ఘట్‌కేసర్ చెటేరుకుంట కల్వర్టు రోడ్డు
మట్టి పోసి వదిలేసిన అధికారులు
దుమ్ము లేస్తూ, గుంతలతో వాహనదారుల ఇబ్బందులు
ఆరు నెలల క్రితం పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన
ఇంకా ప్రారంభం కాని పనులు
పట్టించుకోని ఆర్‌అండ్‌బీ
హైదరాబాద్-వరంగల్ హైవే నుంచి ఘట్‌కేసర్‌కు చేరుకునే చెటేరుకుంట కల్వర్టు రోడ్డు 2020 సెప్టెంబరులో భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. అప్పట్లోనే వారం రోజుల పాటు రాకపోకలు నిలిచాయి. కొన్నాళ్లకు ఈ కల్వర్టుకు తాత్కాలిక మరమ్మతులు చేసినా శాశ్వత నిర్మాణ పనులు మాత్రం చేయలేదు. హైదరాబాద్-వరంగల్ హైవేకు.. అలాగే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి ఇది లింక్ రోడ్డు. ఇంత ప్రధాన రోడ్డుకు ఏళ్లుగా రిపేర్ చేయకపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సేవల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందనడానికి ఈ రోడ్డు పనులు అద్దం పడుతు న్నాయి. ఇదిలా ఉంటే వికారాబాద్ జిల్లా పెద్దేముల్ సమీప బుద్ధారం వాగు దాటాక బీటీ రోడ్డుపై భారీ గుంతలు పడ్డాయి. పెద్దేముల్‌లోనూ అడుగడుగునా రోడ్లు గుంతలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఘట్‌కేసర్, మార్చి 5: రెండున్నరేళ్ల క్రితం భారీ వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డుకు మరమ్మతులు చేయక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఘట్‌కేసర్‌లో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి పక్కన పాడైన రోడ్డుకు ఏళ్లుగా మరమ్మతులు చేయడం లేదు. 2020 సెప్టెంబరులో భారీ వర్షంతో ఘట్‌కేసర్ చెటేరుకుంట కల్వర్టుపై నుంచి నీరు ప్రవహించి గండిపడింది. ఇది పట్టణానికి దారితీసే రోడ్డు కావడంతో అప్పట్లో వారం పాటు రాకపోకలు స్తంభించాయి. ఘట్‌కేసర్ పట్టణానికి, కార్యాలయాలు, పోలీస్ స్టేషన్‌కు రావాలన్నా ప్రజలు చుట్టూ అదనంగా 5కిలోమీటర్లు తిరిగి వచ్చేవారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత తాత్కాలికంగా మట్టిపోసి గండిని పూడ్చి ట్రాఫిక్‌ను పునరుద్ధ్దరించారు. ప్రధాన రోడ్డు కల్వర్టుకు గండి పడినా శాశ్వత మరమ్మతులు చేయక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్-వరంగల్ హైవేకు, హైదరాబాద్-విజయవాడ రహదారికి లింక్ అయిన ఈ రోడ్డుకు ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడం అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందన్నది స్పష్టమైతోంది.
వర్షం కురిస్తే బురద.. ఎండితే దుమ్ము
చెటేరుకుంట కల్వర్టు గతంలో కొట్టుకుపోయి ఏదులాబాద్ రోడ్డు సైతం అధ్వానంగా మారింది. ఎండ, చలి కాలాల్లో విపరీతంగా దమ్ము లేస్తోంది. పలుమార్లు మట్టిపోయించినా ఒకటి రెండు రోజుల్లోనే పరిస్థితి మొదటికొస్తోంది. ఆరు నెలల క్రితం మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేసి వరద నీరు దిగువకు పోయేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరంగ్ అధికారులను ఆదేశించారు. నెలలు గడుస్తున్నా పనులు చేయడం లేదని వాహనదారులంటున్నారు. కల్వర్టు నిర్మాణ సమయంలో రోడ్డు మధ్యలో ఇనుప బోర్డులను పెట్టి అలాగే వదిలేయడంతో వాటిని ఢీకొంటామేమోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రమాదకరంగా గుంతల రోడ్లు
తరచూ యాక్సిడెంట్లు.. పట్టించుకోని అధికారులు, పాలకులు
పెద్దేముల్: పెద్దేముల్-తాండూరు రోడ్డులో పెద్దపెద్ద గోతులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలాసార్లు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పెద్దేముల్ సమీప బుద్ధారం వాగుదాటాక ఒకవైపు రోడ్డు మొత్తం గుంతలు పడింది. పెద్దేముల్ దాటిన తరువాత బుద్ధారం వాగువద్ద మలుపులో రోడ్డు గుంతలమయమైంది. దీంతో వాహనదారులు ఆ మలుపు వద్ద ఎడమవైపున్న గుంతలపు తప్పించుకునేందుకు ప్రమాదం పొంచి ఉన్నా కుడివైపుగా వెళ్తున్నారు. ఇక్కడే మూల మలుపు ఉండడంతో తరచూ ఎదురెదురుగా వాహనాలు ఢీకొంటున్నాయి. నెల క్రితం బైక్, జీపు ఢీకొని ఇద్దరు కాలేజీ విద్యార్థులు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఇది కాక చిన్నచిన్న ప్రమాదాలు ఎక్కువే జరిగాయి. అయితే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గుంతలు పడ్డ చోట్ల ప్యాచ్ వర్క్ చేయడం లేదు. తాండూరు-మంబాపూర్ రోడ్డులోనూ ఖానాపూర్ గేటు సమీపంలో, అలాగే కందనెల్లి సమీపంలో భారీగా గుంతలేర్పడ్డాయి. రోడ్లు పాడై నెలలువుతున్నా, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా ఆర్‌అండ్‌బీ అధికారులు మరమ్మతులు చేయిచడం లేదు.
ఎన్నాళ్లు ఇబ్బంది పడాలో తెలియడం లేదు : : వి.లింగస్వామి, వాహనదారుడు, ఎన్‌ఎ్‌ఫసీ నగర్
చెటేరు కుంట కల్వర్టుకు ఏళ్లుగా మరమ్మతులు చేయడం లేదు. దీంతో రాకపోకలకు, వాహనదారులకు ఇబ్బంది కలుగుతోంది. రోడ్డు ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయే తెలియడం లేదు. మండల కేంద్రంలోని కార్యాలయాల వద్దే రోడ్డు ఇంత అధ్వానంగా ఉన్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం సరికాదు. ఇప్పటికైనా అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
రోజూ అవస్థలు పడుతున్నాం : రమేష్, వాహనదారుడు, ఎన్‌ఎ్‌ఫసీ నగర్
ఎప్పుడో పాడైన రోడ్డుకు మరమ్మతులు చేయక ప్రజలమంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోడ్డుపై వెళ్తే వాహనదారులకు చుక్కలు కన్పిస్తున్నాయి. అదీగాక రోడ్డు మధ్యలో రెండు ఇనుప బోర్డులను వదిలేశారు. అవి ఎప్పుడు మీద పడతాయోనని భయమేస్తోంది. రోడ్డు పనులను వెంటనే పూర్తి చేసి వాహనదారుల ఇబ్బందులు తీర్చాలి.