గ్రూప్-4 పరీక్ష సజావుగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2023-06-29T00:00:19+05:30 IST
గ్రూప్-4 పరీక్షను జిల్లాలో సజావుగా నిర్వహించాలని మేడ్చల్ అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి తెలిపారు.
మేడ్చల్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గ్రూప్-4 పరీక్షను జిల్లాలో సజావుగా నిర్వహించాలని మేడ్చల్ అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్‌తో కలిసి గ్రూప్-4 పరీక్ష సన్నద్ధతపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జూలై 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండవ పేపర్ పరీక్ష ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 187పరీక్షా కేంద్రాల్లో 90,220 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. టీఎ్‌సపీఎ్‌ససీ గైడ్‌లైన్స్ ప్రకారం నిబంధనలు పాటించాలని, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్‌లు పరీక్షా కేంద్రాలను ముందస్తుగా సందర్శించి తాగునీరు, విద్యుత్, సీటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ఇతర మౌలిక వసతులను సరి చూసుకోవాలన్నారు. పరీక్ష రోజు పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్‌లను మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. ఆశా, ఏఎన్‌ఎం సిబ్బంది ఉండాలన్నారు. పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు డీఆర్‌వో లింగ్యానాయక్ చీఫ్ సూపరిండెంట్, లైజనింగ్ అధికారులు, రూట్ అధికారులు పరీక్షరోజు చేయాల్సిన విధి విధానాలను క్షుణ్ణంగా వివరించారు.