ఎట్టకేలకు మోక్షం!
ABN , First Publish Date - 2023-03-02T00:17:48+05:30 IST
జీవో 59 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ మార్కెట్ ధర ప్రకారం భూములను వెంటనే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
జీవో 59 కింద భూముల క్రమబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్
సవరణ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
దరఖాస్తు తేదీ నాటి ప్రకారమే క్రమబద్ధీకరణ రుసుము
కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మరింత భారం
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, మార్చి 1 : జీవో 59 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ మార్కెట్ ధర ప్రకారం భూములను వెంటనే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవోను సవరిస్తూ బుధవారం సరికొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో వేలాది మందికి ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం గతంలో 58, 59 జీవోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2014 డిసెంబరు 31వ తేదీన భూముల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం జీవో నెం.58 (ఉచితంగా క్రమబద్ధీకరణ), జీవో నెం.59 (నామమాత్రపు విలువతో) జారీ చేసింది. వీటి ప్రకారం క్రమబద్ధీకరణ చేసుకునే వారికి ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందులో 125 గజాలలోపు స్థలం ఉన్నవారికి జీవో 58 కింద ఉచితంగానే భూమిని క్రమబద్ధీకరణ చేసేందుకు సర్కార్ నిర్ణయించింది. ఆపైన భూమి ఉన్నవారికి నిబంధనల మేర ప్రభుత్వ, అసైన్డ్, అర్బన్ ల్యాండ్ సీలింగ్, సర్‌ప్లస్ భూములను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే గతంలో వివిధ కారణాల వల్ల దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికే అప్పట్లో భూములను క్రమబద్ధీకరించారు. వేలాది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంచింది. అయితే తాజాగా ప్రభుత్వం క్రమబద్ధీకరణకు మరో అవకాశం కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకోని వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. అయితే పాత నిబంధనల మేరకు అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు అంటే 2014 జూన్ 2వ తేదీ నాటికే ఫ్రభుత్వ భూముల్లో ఆక్రమణల్లో ఉన్నవారు మాత్రమే ఇందుకు అర్హులని వెల్లడించింది. దీంతో అనేకమంది మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా మరో సారి పరిశీలించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రతి మండలానికి ఒక జిల్లాస్థాయి అధికారిని నియమించి దరఖాస్తులను కాచివడబోశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినప్పటికీ వీటిపై తుది నిర్ణయం తీసుకునే విషయంలో సర్కార్ నానుస్తూ వచ్చింది. ఆర్ధిక వనరుల కోసం ఇబ్బందులు పడుతున్న సర్కార్ తాజాగా క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. కొత్త, పాత దరఖాస్తులన్నింటినీ వేగవంతంగా పరిశీలించాలని కలెక్టర్లకు ఆదేశించింది. గతంలో 59 జీవో కింద పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతోపాటు అంతకు ముందు జారీ చేసిన జీవో 166 కింద తీసుకున్న దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు దరఖాస్తుల పరిశీలన దాదాపు పూర్తి చేశారు. ఈనెల 6వ తేదీలోగా వీటిని పూర్తిగా పరిష్కరించనున్నారు. అన్ని సక్రమంగా ఉన్న దరఖాస్తుదారులకు ప్రభుత్వం నిర్ధేశించిన ధర ప్రకారం భూములను క్రమబద్ధీకరిస్తారు.
దరఖాస్తు చేసుకున్న తేదీ ప్రకారమే..
కొత్తగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే వారికి రుసుం భారీగా పెరగనుంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో క్రమబద్ధీకరణపై కొత్త మెలిక పెట్టింది. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్న నాటికి ఉన్న మార్కెట్ ధర ప్రకారం రుసుము చెల్లించాలని పేర్కొంది. దీంతో ఈ జీవో విడుదల చేసిన సమయంలో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రయోజనం కలుగుతుండగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రుసుము తడిసి మోపెడు కానుంది. ఇటీవల కాలంలో ఫ్రభుత్వం భూముల ధరలు భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీని ప్రకారం క్రమబద్ధీకరణ చేయించుకునే వారికి భారం మరింత పెరుగుతుంది.
ఉమ్మడి జిల్లా నుంచే అధికం
రాష్ట్రంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నుంచే అత్యధికంగా క్రమబద్ధీకరణ దరఖాస్తులు వచ్చాయి. క్రమబద్ధీకరణకు పట్టణ ప్రాంతాల్లోనే అఽధికంగా దరఖాస్తులు రావడం గమనార్హం. ఇదిలా ఉంటే భూముల క్రమబద్ధీకరణ వల్ల రాష్ట్రంలో వచ్చే ఆదాయంలో సింహభాగం రంగారెడ్డిజిల్లా నుంచే రానుంది. ఇందులో శేరిలింగంపల్లి మండలం నుంచి భారీగా ఆదాయం రానుంది. క్రమబద్ధీకరణకు అత్యధికంగా అబ్ధుల్లాపూర్‌మెట్‌లో 3866 దరఖాస్తులు రాగా తరువాత శేరిలింగంపల్లిలో 3,707 దరఖాస్తులు వచ్చాయి. విస్తీర్ణం ప్రకారం చూస్తే శేరిలింగంపల్లిలోనే అత్యధికంగా దరఖాస్తులు అందాయి. జిల్లా వ్యాప్తంగా ఈజీవో కింద 38,43,899 గజాల ఫ్రభుత్వ భూమి క్రమబద్ధీకరణకు దరఖాస్తులు అందగా.. ఇందులో శేరిలింగంపల్లి నుంచే అత్యధికంగా 12,73,820 చదరపు గజాల భూములకు సంబంధించి క్రమబద్ధీకరణకు దరఖాస్తులు రావడం గమనార్హం. ఈ మండలంలో భూములు ధరలు అత్యధికం కావడంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో అర్హతలు ఉన్నవారి కంటే అర్హతలు లేనివారే అత్యధికంగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇందువల్ల అఽధికారులు ఈ మండలంపై క్షుణంగా తనిఖీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సొమ్ము వాపస్ ఏదీ?
భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురైన 1,661 మంది దరఖాస్తుదారులకు డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో ప్రభుత్వం మీన వేషాలు వేస్తోంది. దరఖాస్తు సమయంలో వసూలు చేసిన 25శాతం డబ్బు ఇంకా దరఖాస్తుదారులకు అందచేయలేదు. వాస్తవానికి తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు తిరిగి ఇవ్వాల్సిన డబ్బును వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు అతీగతి లేదు. దరఖాస్తులు తిరస్కరించి ఇప్పటికే అయిదేళ్లు గడిచినా వారికి ఇంకా డబ్బు చెల్లించలేదు. ఈ డబ్బుల కోసం దరఖాస్తుదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాస్తవంగా గతంలోనే దరఖాస్తులు తిరస్కరించిన వారందరికీ ఈ డబ్బు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఆయా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అయితే వీటిని ఏ ఖాతా నుంచి చెల్లించాలనేది స్పష్టం చేయలేదు. దరఖాస్తుదారుల నుంచి వసూలు చేసిన డబ్బు మొత్తం ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యింది. దీంతో ఈ డబ్బు జిల్లా అధికారులు చెల్లించలేకపోయారు. ప్రభుత్వం తన ఖాతాలో జమ అయిన సొమ్మును విడుదల చేయకపోవడంతో జాప్యం జరిగింది. ఉమ్మడి జిల్లాలో అర్హతలేని వారిగా గుర్తించిన 1661 మంది దరఖాస్తుదారులకు సంబంధించి ప్రభుత్వం రూ. 25.05కోట్లు చెల్లించాలి.
-----------------------------------------------------
జీవో 59 కింద భూముల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులు (పెండింగ్, కొత్తవి కలిపి)
రంగారెడ్డిజిల్లా 31,830
మేడ్చల్ జిల్లా 71,316
వికారాబాద్ 161
---------------------------------------------------------
ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ఇలా...
మొత్తం విస్తీర్ణం ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్
విలువ ప్రకారం (శాతంలో)
0-125 గజాల వరకు ఉచితం
126- 250గజాల వరకు 50శాతం
251-500గజాల వరకు 75శాతం
500 గజాలపైన 100శాతం