ప్రభుత్వ భూమిని కాపాడాలి
ABN , Publish Date - Dec 22 , 2023 | 11:36 PM
ప్రభుత్వ భూమిని కాపాడాలని, ఉన్నత, కిందిస్థాయి అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని శుక్రవారం మండల పరిధిలోని చందిప్ప గ్రామస్తులు ఆరోపించారు.
శంకర్‌పల్లి, డిసెంబరు 22 : ప్రభుత్వ భూమిని కాపాడాలని, ఉన్నత, కిందిస్థాయి అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని శుక్రవారం మండల పరిధిలోని చందిప్ప గ్రామస్తులు ఆరోపించారు. ఈమేరకు మంత్రి అనసూయ (సీతక్క)ను నగరంలో కలిసి వినతిపత్రం అందజేశారు. కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని మంత్రిని వేడుకున్నారు. మండలంలోని చందిప్ప గ్రామంలో సర్వేనెంబర్ 124లో 7 ఎకరాల 30 గుంటల భూమి 1953-54 నుంచి 2016 వరకు రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు పహాణీలో చూయిస్తూ వస్తున్నారు. కాగా, 2017లో నగరానికి చెందిన సయ్యద్ సమ్మదుల్లా హుస్సేన్ రెవెన్యూ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులతో కుమ్మకై వారి తాత ముత్తాతలకు ఓఆర్సీ ఉందని రికార్డు మార్చుకుని భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రికి విన్నవించారు. భూమిని అక్రమించేందుకు రౌడీ మూకలతో చందిప్పకు చేరుకుని ఆ భూమి నాది అంటూ జేసీబీలతో చదును చేస్తూ గ్రామస్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థులంతా కలిసి పోలీస్‌స్టేషన్, తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు కబ్జాదారుడికి ఓఆర్సీ ఉందని చెప్పడంతో పాటు సీసీఎల్ నుంచి పట్టాపాస్ బుక్ పొందారని, కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్నారని గ్రామస్థులు వాపోయారు. కార్యకమ్రంలో సదానందం గౌడ్, మోహన్, దేవేందర్‌రెడ్డి, శేఖర్, రాజు, గ్రామస్థులు పాల్గొన్నారు.