వైభవంగా పార్వతీపరమేశ్వరుల కల్యాణం

ABN , First Publish Date - 2023-02-07T00:05:09+05:30 IST

మండలంలోని నవాంద్గీ శ్రీ సంగమేశ్వరాలయంలో సోమవారం పార్వతీపరమేశ్వరుల కల్యాణం వైభవంగా జరిగింది.

వైభవంగా పార్వతీపరమేశ్వరుల కల్యాణం
ఘట్‌కేసర్‌ రూరల్‌ : ఎదులాబాద్‌లో వేణుగోపాలస్వామి రథోత్సవంలో పాల్గొన్న పూజారులు, భక్తులు

బషీరాబాద్‌, ఫిబ్రవరి 6 : మండలంలోని నవాంద్గీ శ్రీ సంగమేశ్వరాలయంలో సోమవారం పార్వతీపరమేశ్వరుల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ కల్యాణ వేడుకలను టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్‌ ఆధ్వర్యంలో అర్చకులు జరిపించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం రమణీయంగా కొనసాగించారు. ఆలయ ప్రాంగణం శివస్వాముల భక్తిపాటలతో మార్మోగింది. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కాగా, అంతకు ముందు ఆలయంలో హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర ప్రారంభం సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్‌ ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్‌ వీరామణి మాధవరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు శంకరప్ప, యూత్‌ అధ్యక్షులు రాజవర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఎం.రాకేష్‌, ధారసింగ్‌, ఉత్తంచంద్‌, జనార్ధన్‌రెడ్డి, జి.వీరేశం, కలాల్‌ నర్సింహులు గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు

ఘట్‌కేసర్‌ రూరల్‌ : మండల పరిధిలోని ఎదులాబాద్‌లో గల రుక్ష్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈమేరకు ఉదయం ప్రత్యేక పూజలు, సేవాకాలము, మంటప ప్రాకారసేవ, ఆరగింపు కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, ఆదివారం రాత్రి వేణుగోపాలస్వామి రథోత్సవంలో భాగంగా ఊరేగింపు కనుల పండువగా సాగింది. అంతకుముందు నగరంలోని మణికొండకు చెందిన శ్రీ నటరాజ నాట్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన భరతనాట్యం, కూడిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సినీ ఆర్టిస్టు రాగిణి పాల్గొని భరతనాట్యం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కాలేరు సురేష్‌, ధర్మకర్తలు అంబారిపేట అప్పలాచార్యులు, ఏవీఎ్‌సఎన్‌ చార్యులు, వరదరాజు చార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

అర్ధనారీశ్వర స్వామిగా దర్శనమిచ్చిన శివుడు

తాండూరు : పట్టణంలోని శ్రీభావిగీభద్రేశ్వరస్వామి ఆలయంలోని శివలింగాన్ని మాఘ సోమవారం సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. పూజారి విజయ్‌కుమార్‌ అర్ధనారీశ్వరస్వామిగా అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చారు.

నేటి నుంచి అత్వెల్లి శివాలయం ఉత్సవాలు ప్రారంభం

మేడ్చల్‌ టౌన్‌ : అత్వెల్లిలో నూతనంగా నిర్మించిన శివాలయంలో పార్వతీ, రాజరాజేశ్వరి, నవగ్రహాల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నేటి(మంగళవారం) ప్రారంభించనున్నారు. శివమాల ధరించిన స్వాములు విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించి ప్రతిష్ఠించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

గ్రామదేవతను దర్శించుకున్న తీన్మార్‌ మల్లన్న

కీసర : యాద్గార్‌పల్లిలోని చిత్తారమ్మ జాతర సందర్భంగా గ్రామస్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈమేరకు తీన్మార్‌ మల్లన్న జాతరకు విచ్చేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు తీన్మార్‌ మల్లన్నను ఘనంగా సత్కరించి జ్థాపికను అందజేశారు.

Updated Date - 2023-02-07T00:05:10+05:30 IST