క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పేరుతో ఘరానా మోసం

ABN , First Publish Date - 2023-03-11T23:38:51+05:30 IST

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని పలువురి నుంచి డిపాజిట్లు సేకరించిన కేసులో సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పేరుతో ఘరానా మోసం

దర్యాప్తు చేస్తున్న రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు

యాచారం/హైదరాబాద్‌ సిటీ, మార్చి 11(ఆంధ్రజ్యోతి): క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని పలువురి నుంచి డిపాజిట్లు సేకరించిన కేసులో సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేపీడబ్ల్యూ కాంపౌండ్‌. క్రిప్టో, ఇస్టోర్‌ సంస్థలు క్రిప్టో ట్రేడింగ్‌ చేస్తున్నట్లు కొంతమంది ప్రచారం చేసుకున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పడంతో పలువురు రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టి మోసపోయారు. సుఫియానా అనే మహిళ పెట్టుబడుల సేకరణలో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని యాచారం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో గల యాచారం మండల కేంద్రంలో వెలుగుచూసిన మోసం కేసులో నిందితులుగా ఉన్న మహిళ సుఫియానా తాను కూడా రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి మోసపోయానని పోలీసు విచారణలో తెలిపింది. దీంతో మోసం ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు చేసేందుకు కేసును సైబర్‌ క్రైం పోలీసులకు అప్పగించారు. పెట్టుబడి పెట్టిన వారిలో కొందరు నగదు చేతికివ్వగా.. మరికొందరు ఆన్‌లైన్‌లో డబ్బులు పంపారు. ఆన్‌లైన్‌ పేమెంట్లకు సంబంధించిన ఆధారాలుండగా, నగదు ఇచ్చిన వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. సైబర్‌ క్రైం అధికారులు యాచారం, మేడిపల్లి, నానక్‌నగర్‌, అయ్యవారిగూడ. నజ్దిక్‌సింగారం, నందివనపర్తి గ్రామాలతో పాటు నగరంలోని చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉంటున్న బాధితుల నుంచి మోసం జరిగిన తీరుపై వివరాలు సేకరించనున్నారు. అధిక లాభాలు వస్తాయని ఆశపడి డబ్బులు పెట్టిన వారు తమ డబ్బు వస్తుందో.. లేదో! అని ఆందోళన చెందుతున్నారు. కాగా, బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసిన యాచారం పోలీసులు నిర్వాహకురాలు సుఫియానాను అరెస్టు చేశారు. స్థానికుల నుంచి అధిక ఆదాయం పేరుతో పెట్టుబడులు సేకరించిన సుఫియానా బృందం మోసం చేసిందా.. లేక ఇది సైబర్‌ మోసగాళ్ల చేతివాటమా? అన్న కోణాల్లో సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-11T23:38:51+05:30 IST