నాయకుల మధ్య రగడ
ABN , First Publish Date - 2023-12-10T23:01:11+05:30 IST
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకుల మధ్య ప్రొటోకాల్ వివాదంతో మాటామాట పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళం చోటుచేసుకుంది.
ఒకరినొకరు తోసుకున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు
చేవెళ్లలో మహాలక్ష్మి పథకం ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ వివాదం
చేవెళ్ల, డిసెంబరు 10: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకుల మధ్య ప్రొటోకాల్ వివాదంతో మాటామాట పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రెండు పార్టీల నాయకులను సముదాయించారు. ఈ సంఘటన ఆదివారం చేవెళ్ల ప్రభుత్వ ఆసుప్రతి అవరణలో నిర్వహించిన మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో జరిగింది. ఎమ్మెల్యే యాదయ్య, కాంగ్రెస్ నాయకుల మధ్య వేదికపై వాగ్వాదం జరిగింది. పథకాల ప్రారంభోత్సవాన్ని ఆర్డీవో సాయిరాం అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథి ఎమ్మెల్యే యాదయ్య, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, చేవెళ్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి.. మొన్నటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన పామెన భీం భరత్, ప్యాక్స్ చైర్మన్‌లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అధికారిక కార్యక్రమానికి ప్రజాప్రతినిధులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి అధికారులను నిలదీశారు. అధికారుల తీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు కలుగజేసుకుంటూ.. గురివింద గింజ తన కింద ఉన్న నలుపు ఎరుగనట్లు కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సరికాదని చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ రంగారెడ్డి అన్నారు. దీంతో స్పందించిన చేవెళ్ల ప్యాక్స్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి భీంభరత్ మాట్లాడుతూ.. కాంగ్రె్‌సది ప్రజాప్రభుత్వం అని, కేసీఆర్ దొరపాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. ప్రగతిభవన్ ఇనుప కంచెను తమ సీఎం రేవంత్‌రెడ్డి తొలగించారని బీఆర్‌ఎస్‌ను దెప్పి పొడిచారు. అధికారులు ప్రొటోకాల్ పాటించాలన్నారు. దీనికి ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. నాయకులు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవచ్చ గానీ కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడటం సరి కాదన్నారు. భీం భరత్ కలుగజేసుకుంటూ.. ప్రస్తుత పథకాలను గురించే ఎమ్మెల్యే మాట్లాడాలని ఇద్దరు నాయకులు పరస్పరం విమర్శించుకున్నారు. ఏం హోదా ఉందని భీం భరత్‌ను అధికారిక వేదికపైకి పిలిచారని ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య మాటలయుద్ధం జరిగింది. కొట్టుకునే స్థాయికి వెళ్లారు. దీంతో ఎస్సై ప్రదీ్‌పకుమార్, పోలీస్ సిబ్బంది ఇద్దరినీ దూరంగా నెట్టారు. గొడవ విషయం తెలుసుకున్న సీఐ లక్ష్మారెడ్డి, మరింత మంది సిబ్బందితో అక్కడికి చేరుకొని నాయకులను సముదాయించారు. చివరకు ఎమ్మెల్యే మైక్ తీసుకొని అధికారిక కార్యక్రమాన్ని అవహేళన చేయడం ఎవరికీ సరికాదన్నారు. దీంతో ఆర్డీవో కలుగజేసుకొని మారోసారి ప్రొటోకాల్ సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారి కోరడంతో ఎమ్మెల్యే, రెండు పార్టీల నాయకులు బస్సు ఫుట్‌బోర్డు వద్ద రిబ్బన్ కట్‌చేసి మహాలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.