9న కులవృత్తులకు ఆర్థిక సహాయానికి శ్రీకారం

ABN , First Publish Date - 2023-06-07T23:59:30+05:30 IST

మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ మేయర్‌ రామ్మోహన్‌

 9న కులవృత్తులకు ఆర్థిక సహాయానికి శ్రీకారం

జిల్లా ప్రజ ల తరపున సీఎంకు ధన్యవాదాలు

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి

తాండూరు, జూన్‌7 : కుల వృత్తులు, చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవీయ కోణంలో ఆలోచించి కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం తాండూరులో మంత్రి మాట్లాడుతూ ఆధునికతతో జీవనాధారం భారంగా మారుతున్న వివిధ కులాల వారికి రూ.లక్ష ఇవ్వాలని గొప్ప నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకున్నారన్నారు. దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 9న జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. విశ్వబ్రాహ్మణ, నాయిబ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేతరి వంటి కుల, చేతి వృత్తుల వారికి రూ. లక్ష ఇవ్వాలని నిర్ణయించినట్లు ఈ సందర్బంగా వికారాబాద్‌ జిల్లా ప్రజల తరపున సీఎం కేసీఆర్‌కు ధన్యావాదాలు తెలిపినట్లు చెప్పారు. ఇప్పటికే మత్స్యకారులకు, ముదిరాజ్‌ కులస్థులకు చెరువుల్లో చేపలు వదిలి జీవనోపాధి కల్పించడం జరిగిందని, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, రజక, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌ లాంటి పథకాలు ప్రవేశ పెట్టారు. రూ.లక్ష సహాయానికి సంబంధించి ఇటీవల జరిగిన క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేద, మధ్య తరగతి వారి సాదకబాధలు తెలిసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చరిత్రలో నలిచిపోతారని, అందరి ఆశీస్సులు ఆయనకు అందించాలన్నారు. తెలంగాణ ఏర్పడి పదో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా జరుగుతున్న దశాబ్ధి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మంత్రితోపాటు ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులున్నారు.

Updated Date - 2023-06-07T23:59:30+05:30 IST