వడదెబ్బతో మహిళా కూలీ మృతి

ABN , First Publish Date - 2023-06-03T00:01:57+05:30 IST

ఉపాధి హామీ పనులు చేస్తూ మహిళా కూలీ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం వెంకిర్యాలలో జరిగింది. గ్రామానికి చెందిన మోత్కూరు చిన్న పెంటమ్మ (50) ఏప్రిల్‌ నుంచి గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులకు వెళ్తుంది.

వడదెబ్బతో మహిళా కూలీ మృతి

కొందుర్గు, జూన్‌, 2 : ఉపాధి హామీ పనులు చేస్తూ మహిళా కూలీ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం వెంకిర్యాలలో జరిగింది. గ్రామానికి చెందిన మోత్కూరు చిన్న పెంటమ్మ (50) ఏప్రిల్‌ నుంచి గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులకు వెళ్తుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు గ్రామ శివారులోని సంజీవపురం తండాలో చేస్తున్న పాటు కాలువ పనులకు వెళ్లింది. ఉదయం 10 గంటల సమయంలో పెంటమ్మ పార పని చేస్తూ స్పృహ తప్పి కింద పడిపోయింది. పిట్స్‌ వచ్చాయని భావించిన తోటి కూలీలు ఆమె చేతిలో తాళాల గుత్తిని ఉంచారు. కాగా, ఎంతకూ ఆమె లేవకపోవడంతో మృతి చెందినట్లు గుర్తించారు.

మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రదేశంలో కూలీలకు ఎలాంటి వసతులు కల్పించడం లేదని, అందువల్లే పెంటమ్మ వడదెబ్బతో మృతి చెందిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీను నాయక్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య, సీఐటీయూ మండల నాయకులు రాయికంటి గోపాల్‌ ఆరోపించారు. మృతురాలి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-06-03T00:01:57+05:30 IST