కదిలిస్తే కన్నీరే!
ABN , First Publish Date - 2023-03-19T00:10:38+05:30 IST
యాచారం మండలం మంతన్‌గౌరెల్లి, కేస్లితండాల ప్రజలు ప్రకృతి ప్రకోపానికి అల్లాడుతున్నారు. వడగళ్ల వానతో రైతులు, గ్రామస్తులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు.

మంతన్‌గౌరెల్లి వాసుల కకావికలం!
పాడైన పంటలు, చెదిరిన గూళ్లు
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
యాచారం, మార్చి 18: యాచారం మండలం మంతన్‌గౌరెల్లి, కేస్లితండాల ప్రజలు ప్రకృతి ప్రకోపానికి అల్లాడుతున్నారు. వడగళ్ల వానతో రైతులు, గ్రామస్తులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. వడగళ్లు కురిసి మూడు రోజులవుతున్నా జనం తేరుకోలేకపోతున్నారు. ఎవరిని కదిలించినా కన్నేరే వస్తోంది. భారీ వడగళ్లకు మంతన్‌గౌరెల్లి, కేస్లితండాలో 620 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరి, కూరగాయ, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. పంటలు పాడై అప్పుల్లో కూరుకుపోతామంటూ రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనుతున్న దశలో వరి చేలు పాడయ్యాయి. ఎకరానికి రూ.50వేలకుపైగా పెట్టుబడి పెట్టామని రైతులు లబోదిబోమంటున్నారు. మూడు పౌలీ్ట్ర షెడ్లు ధ్వంసమై, కోడిపిల్లలు చనిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వడగళ్లకు పలువురి సిమెంట్ రేకులు పగి లాయి. 9మంది విద్యార్థులు, ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ఇదిలా ఉంటే తాను వేసిన మూడెకరాల వరి 20రోజుల్లో పంట చేతికందే దశలో వడగళ్ల వానొచ్చి పూర్తిగా పాడైందని మంతన్‌గౌరెల్లి రైతు జహాంగిర్ ఆవేదన వ్యక్తం చేశాడు. పంట చేతికొస్తే రూ.1.2లక్షల ఆదాయం వొచ్చేదన్నాడు. ఇప్పుడు పంటపోయి పిల్లల స్కూలు ఫీజు ఎలా కట్టాలో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియడం లేదని వాపోయాడు. తన ఇంటి నాలుగు రూంల రేకులు వడగళ్లకు పగిలిపోయాయని, అధికారులొచ్చి ఇల్లు ధ్వంసమైనట్టు రాసుకపోయారని, బియ్యం తడిచిపోయాయని, గురువారం రాత్రి ఉపాసమే ఉన్నం అని మంతన్‌గౌరెల్లి వాసి రాములు ఆవేదనతో చెప్పాడు. మంతన్‌గౌరెల్లికే చెందిన 9వ తరగతి విద్యార్థిని స్పందన మాట్లాడుతూ.. తాను స్కూల్ నుంచి ఇంటికొచ్చి చదువకుంటుండగా రేకులు పగిలి వడగళ్లు తలకు తగిలి గాయమైందని తెలిపింది. తన శరీరంపై రక్తపు మరకలు చూసి అమ్మనాన్నలు కూడా రోదించారని బాలిక చెప్పింది. వెంటనే మాల్‌లోని ఆస్పత్రికి తీసుకపోయి ట్రీట్మెంట్ చేయించారని తెలిపింది. ప్రకృతి బీభత్సంపై తహసీల్దార్ సుచరిత మాట్లాడుతూ.. వడగళ్లతో పాడైన పంటలు, దెబ్బతిన్న ఇళ్ల వివరాలను సేకరించామని, బాధితులందరికీ ప్రభుత్వం సాయం అందిస్తుందని తెలిపారు. ఈ రెండు గ్రామాల్లో వడగళ్లతో కూలిన ఇళ్ల నివేకను కలెక్టర్ అందజేస్తామన్నారు. అలాగే పంటనష్టం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యంతో పంటలు, ఇళ్లు కోల్పోయిన ప్రతీ ఒక్కరినీ ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని ఆమె భరోసా ఇచ్చారు.