ఎమ్మెల్యేకు టిక్కెట్ వచ్చినా.. డిపాజిట్ రాదు
ABN , First Publish Date - 2023-04-03T00:02:24+05:30 IST
వికారాబాద్ ఎమ్మెల్యేకు టిక్కెట్ వచ్చేది లేదని, వచ్చినా ఆయనకు డిపాజిట్ మాత్రం రాదని, ఇక ఎమ్మెల్యేతో కలిసి పనిచేసేది లేదని ఎమ్మెల్యే అసమ్మతి నేతలు మర్పల్లి మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ రామేశ్వర్, భూమోళ్ల కృష్ణయ్య, పంది వెంకటయ్య, రాజేందర్‌గౌడ్‌లు స్పష్టం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేతో కలిసి పనిచేయం
మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి కట్టబెట్టడానికి ఇద్దరి వద్ద రూ.5కోట్లు తీసుకున్న ఎమ్మెల్యే
బంధువులకే దళిత బంధు
సమావేశంలో ఎమ్మెల్యే అసమ్మతి నాయకులు
వికారాబాద్, ఏప్రిల్ 2: వికారాబాద్ ఎమ్మెల్యేకు టిక్కెట్ వచ్చేది లేదని, వచ్చినా ఆయనకు డిపాజిట్ మాత్రం రాదని, ఇక ఎమ్మెల్యేతో కలిసి పనిచేసేది లేదని ఎమ్మెల్యే అసమ్మతి నేతలు మర్పల్లి మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ రామేశ్వర్, భూమోళ్ల కృష్ణయ్య, పంది వెంకటయ్య, రాజేందర్‌గౌడ్‌లు స్పష్టం చేశారు. వికారాబాద్‌లోని గౌలికార్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు టిక్కెట్ రాదనే భయం పట్టుకుందన్నారు. అందుకే ఆయన స్ర్కిప్ట్ రాసి ఇచ్చి విలేకరుల సమావేశాలు పెట్టించి తిట్టిస్తున్నారన్నారు. తమను సింహం పార్టీకి చేశారని కొందరు అంటున్నారని, మరి విలేకరుల సమావేశంలో మాట్లాడిన వారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి పని చేశారో చూసుకోవాలన్నారు. రాంచందర్‌రెడ్డి గురించి మాట్లాడే సమయంలో ఒక సారి ఆలోచించి మాట్లాడాలన్నారు. ఆయనకు ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్న చరిత్ర ఉందన్నారు. కొండల్‌రెడ్డి, నరోత్తంరెడ్డి ఎమ్మెల్యేకు మెజార్టీ తీసుకొచ్చిన నాయకులు అన్నారు. మోమిన్‌పేటలో రూ.కోటి పెట్టి ఓడించేందుకు నర్సింహారెడ్డి పనిచేశారని గుర్తుంచుకోవాలన్నారు. వడ్లనందును గుడ్డలూడదీసి కొడుతామన్న నాయకులు దమ్ముంటే రావాలని, తమ వెంట్రుక కూడా పీకలేరని సవాల్ విసిరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి కట్టబెట్టడానికి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఇద్దరి వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుని రూ.5కోట్లు తీసుకున్నాడని ఆరోపించారు. అందుకోసమే మున్సిపల్ పంచాయతీ నడుస్తోందన్నారు. లంకా లక్ష్మీకాంత్‌రెడ్డి ఎమ్మెల్యే ఇంటి ఎదుట కూర్చొని డబ్బులు తీసుకోవాలని, అక్కడ పంచాయతీ పెట్టుకోవాలని విలేకరుల సమావేశంలో తిట్టడం ఏమిటన్నారు. ఎమ్మెల్యే మార్కెట్ కమిటీ, మండల అధ్యక్ష పదవులను అమ్ముకున్నారన్నారు. దళితబంధును వారి అక్కలకు, కొడుకులకు ఇచ్చుకున్నారన్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు జాగ్రత్తగా పెట్టాలని, విమర్శిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అధిష్టానం అన్ని విషయాలను గమనిస్తోందని, మరోసారి ఆయనకు ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదన్నారు. మర్పల్లి మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ రామేశ్వర్ తన పదవికి రాజీనామా చేస్తానని, సోమవారం(నేడు) రాజీనామా పత్రాన్ని అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చందర్‌నాయక్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్‌రెడ్డి, చిగుళ్లపల్లి రమేష్ కుమార్, ధారూరు వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, ఎంపీటీసీ కావలి ప్రకాశ్, బి.రమేష్, ఎంపీటీసీలు సురేష్, యూనుస్, సమ్మద్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యే అసమ్మతి నాయకులు పాల్గొన్నారు.