పర్యావరణ పరిరక్షణ పాలకుల బాధ్యత

ABN , First Publish Date - 2023-07-09T23:39:59+05:30 IST

అటవీ ప్రాంతాలను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణకు పాలకులు చర్యలు తీసుకోవాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌51ఎ(జి) చెబుతున్నా విషపూరిత రసాయనాలు వెదజల్లే ఫార్మా కంపెనీల కోసం ఫార్మాసిటీ ఏర్పాటుకు వేలాది ఎకరాలు లాక్కుంటూ రైతులను బిచ్చగాళ్లను చేస్తున్న ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్‌, కిసాన్‌ సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు.

పర్యావరణ పరిరక్షణ పాలకుల బాధ్యత
నానక్‌నగర్‌ సమావేశంలో మాట్లాడుతున్న కోదండరామ్‌

నిరంతరం రైతులకు అండగా ఉంటాం

టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్‌, కిసాన్‌ సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి

యాచారం, జూలై 9: అటవీ ప్రాంతాలను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణకు పాలకులు చర్యలు తీసుకోవాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌51ఎ(జి) చెబుతున్నా విషపూరిత రసాయనాలు వెదజల్లే ఫార్మా కంపెనీల కోసం ఫార్మాసిటీ ఏర్పాటుకు వేలాది ఎకరాలు లాక్కుంటూ రైతులను బిచ్చగాళ్లను చేస్తున్న ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్‌, కిసాన్‌ సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. టీజేఎస్‌ ఆధ్వర్యంలో కుర్మిద్ద, తాడిపర్తి, నానక్‌నగర్‌, మేడిపల్లి, తక్కళ్లపల్లి, చింతపట్ల గ్రామాల్లో గొలుసుకట్టు చెరువులను పరిశీలించారు. అనంతరం గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో వారు మాట్లాడారు. ఫార్మా కంపెనీల రసాయనాలతో జల వనరులు, భూగర్భ జలాలూ కలుషితం అవడం ఖాయం అని ఆందోళన వ్యక్తం చేశారు. చౌటుప్పల్‌, జీడిమెట్ల, ఐడీఏ బొల్లారం ప్రాంతాల్లో విష కంపెనీలతో ప్రజలు నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. యాచారం మండలంలో 400 ఫార్మాకంపెనీల ఏర్పాటుకు పూనుకున్నట్లు చెప్పారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. కాలుష్య నియంత్రణ మండలి విష కంపెనీలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే రైతుబంధు, బీమా పథకాలను రద్దు చేస్తారని కేసీఆర్‌, కేటీఆర్‌ రైతులను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలే బ్యాంక్‌లను జాతీయం చేసి రైతులను ఆదుకున్న సంగతి గుర్తు తెచ్చుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ పాలకులను గద్దెదించే వరకూ విశ్రమించొద్దన్నారు. ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు చెరువు, కుంటల మరమ్మతులను విస్మరించారన్నారు. పూడిక పేరుకున్న, మత్తళ్లు పాడైన, కట్టలు బలహీనమైన చెరువులను పరిశీలించారు. నాయకుల వెంట కుర్మిద్ద, తాడిపర్తి, నానక్‌నగర్‌ సర్పంచ్‌లు బి.రాజశేఖర్‌రెడ్డి, దూస రమేశ్‌, పెద్దయ్య, కాంగ్రెస్‌ నాయకుడు మర్రి నిరంజన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-07-09T23:39:59+05:30 IST