ఈద్ ముబారక్
ABN , First Publish Date - 2023-04-21T23:26:28+05:30 IST
ముస్లింల రంజాన్ పవిత్ర మాస ఉపవాస దీక్షలు ముగిశాయి. శనివారం రంజాన్ పండగ నేపథ్యంలో ఆమనగల్లులోని ఈద్గా, మజీద్‌లు ముస్తాబయ్యాయి.
ఆమనగల్లు / కడ్తాల్ /ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 21 : ముస్లింల రంజాన్ పవిత్ర మాస ఉపవాస దీక్షలు ముగిశాయి. శనివారం రంజాన్ పండగ నేపథ్యంలో ఆమనగల్లులోని ఈద్గా, మజీద్‌లు ముస్తాబయ్యాయి. శుక్రవారం వాటిని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఈద్గాల వద్ద శుభ్రం చేసి నమాజ్‌కు సిద్ధం చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని షామియానాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం చెరువు కింద ఉన్న ఈద్గా వద్ద ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేశారు.
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
రంగారెడ్డి అర్బన్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్ ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మండుటెండల్లోనూ ఎంతో నియమ నిష్టలతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వహించారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, సుఖ సంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం వెల్లివెరియాలని కోరారు. నెల రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నిమగ్నమైన ముస్లింలు అదే స్ఫూర్తితో శనివారం రంజాన్ పండగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.
పండగ వేళ వివాదం
యాచారం : రంజాన్ పండగ నేపథ్యంలో యాచారం మండల కేంద్రంలో వివాదం నెలకొంది. శుక్రవారం కొందరు ముస్లింలు రెండు వర్గాలుగా ఏర్పడి మజీద్ మెయింటెనెన్స్ పై ఘర్షణ పడ్డారు. సీఐ లింగయ్య, ఎస్సైలు వెంకటనారాయణ, ప్రసాద్‌లు మజీద్ వద్ద ఇరు వర్గాల వారిని సముదాయించి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. గంటపాటు వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో వారు శాంతించారు.