కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు

ABN , First Publish Date - 2023-05-25T23:25:10+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని తాండూర్‌ తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడు అన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
గోనూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న తాండూర్‌ తహసీల్దార్‌, ఆర్‌ఐ

తాండూర్‌ రూరల్‌, మే 25: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని తాండూర్‌ తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడు అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. తాండూర్‌ పట్టణ పరిధిలోని డీసీఎంఎస్‌ దగ్గర కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అదేవిధంగా గౌతాపూర్‌ గ్రామ శివారులోని బెల్కటూర్‌, చెంగోల్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులతో మాట్లాడారు. అనంతరం గోనూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులతో పాటు లారీల్లో ధాన్యం తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని గోదాం ఇన్‌చార్జి పాండురంగంను ఆదేశించారు. తేమ, తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల దగ్గర టెంట్‌, తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని రైతులు తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన తహసీల్దార్‌ ఆయా గ్రామాల సర్పంచ్‌లతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా రైతులు హరినాథ్‌రెడ్డి, గౌతమ్‌, మల్లేశం, మహిబూబ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-05-25T23:25:10+05:30 IST