భూ వివాదంలో దోమ ఎస్‌ఐ విశ్వజాన్‌

ABN , First Publish Date - 2023-02-25T00:16:46+05:30 IST

దోమ ఎస్‌ఐ విశ్వజాన్‌ భూ వివాదంలో డబ్బులు డిమాండ్‌ చేసినట్లుగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భూ వివాదంలో దోమ ఎస్‌ఐ విశ్వజాన్‌

  • డబ్బులు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు

దోమ, ఫిబ్రవరి 24: దోమ ఎస్‌ఐ విశ్వజాన్‌ భూ వివాదంలో డబ్బులు డిమాండ్‌ చేసినట్లుగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలంలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో వికారాబాద్‌కు చెందిన యాదగిరి అనే ఓ రియల్టర్‌తో ఎస్‌ఐ విశ్వజాన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో కేశవపేటలో రైతు హన్మంతు దగ్గర 21గుంటల భూమిని రూ.32లక్షలకు ఎస్‌ఐ విశ్వజాన్‌ తన స్నేహితుడు మణికాంత్‌కు ఇప్పించాడు. భూమి అగ్రిమెంట్‌ సమయంలో రూ.9లక్షలు రైతు హన్మంతుకు ఇచ్చారు. మిగతా రూ.23లక్షలు రిజిస్ర్టేషన్‌ సమయంలో ఇచ్చి రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో మణికాంత్‌ ఈ భూమికి సంబంధించిన రూ.4లక్షలు హన్మంతుకు ఇవ్వకుండా మధ్యవర్తి యాదగిరికి ఇచ్చాడు. ఇందులో కమీషన్‌ పోను మిగతా రూ.3లక్షలా 50వేలు రైతు హన్మంతుకు ఇవ్వాల్సి ఉండగా యాదగిరి ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చాడు. దీంతో రైతు హన్మంతు భూమి కొన్న మణికాంత్‌కు డబ్బులు అందలేదని తరచూ ఫోన్‌ చేస్తున్నాడు. ఈ విషయాన్ని మణికాంత్‌ ఎస్‌ఐ విశ్వజాన్‌ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయంలో కల్పించుకున్న ఎస్‌ఐ విశ్వజాన్‌.. యాదగిరికి ఫోన్‌ చేసి రైతుకు డబ్బులు ఇవ్వాలని సూచించారు. యాదగిరి వినకపోవడంతో ఎస్‌ఐ తీవ్ర పదజాలంతో దూషించారు. ‘ఎస్పీకి చెప్పుకుంటావా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో..’ అనే మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ విషయంపై రియల్టర్‌ యాదగిరిని వివరణ కోరగా రైతుకు రూ.3లక్షల 50వేలు ఇవ్వాల్సి విషయం వాస్తవమే కానీ రైతుకు, తనకు సంబంధించిన విషయంలో ఎస్‌ఐ కల్పించుకొని తన ఫోన్‌ ట్యాంపరింగ్‌ చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని మీడియా ముందు వాపోయాడు. ఎస్‌ఐ విశ్వజాన్‌ను వివరణ కోరగా తన స్నేహితుడికి భూమి ఇప్పించడం జరిగిందని, అట్టి విషయంలో రైతుకు రూ.3లక్షల 50వేలు ఇవ్వాల్సి ఉండగా అట్టి డబ్బులను తానే ఇస్తానని రియల్టర్‌ యాదగిరి తీసుకొని ఇవ్వకపోవడంతో ఎందుకు ఇవ్వడం లేదని గడ్డిగా అడిగినట్లు తెలిపారు.

Updated Date - 2023-02-25T00:16:47+05:30 IST