దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ఆదర్శం

ABN , First Publish Date - 2023-04-03T23:39:24+05:30 IST

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జీవితం, పోరాట పటిమ అందరికీ ఆదర్శమని ప్రజా గాయకురాలు విమలక్క అన్నారు.

దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ఆదర్శం
కడ్తాలలో యువకులకు భారత రాజ్యాంగ పుస్తకాలను అందజేస్తున్న విమలక్క

ప్రజా గాయకురాలు విమలక్క

కడ్తాల్‌, ఏప్రిల్‌3 : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జీవితం, పోరాట పటిమ అందరికీ ఆదర్శమని ప్రజా గాయకురాలు విమలక్క అన్నారు. దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఆమె డిమాండ్‌ చేశారు. కడ్తాల మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక, వివేకానంద యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విమలక్క, కడ్తాల ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, బీసీ సంఘం జిల్లా నాయకుడు చందోజీ ముఖ్య అతిథులుగా హాజరై దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధులకు పండ్లు, యువకులకు భారత రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేశారు. పలువురు యువకులు విమలక్క, రాఘవేందర్‌ ఆధ్వర్యంలో మహనీయుల జ్ఞాన దీక్షను స్వీకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో విమలక్క మాట్లాడుతూ తొలిదశ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కొమురయ్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడారని కొనియాడారు. అమర వీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కొమురయ్య అమరత్వం అందించిన చైతన్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం కొనసాగి స్వరాష్ట్రం సాధించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల రాఘవేందర్‌, ఉప సర్పంచ్‌ కడారి రామకృష్ణ, వివేకానంద యూత్‌ అధ్యక్షుడు మాధవులు, బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్ము శ్రీనివాస్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బీచ్యనాయక్‌, అంబేద్కర్‌ యువజన సంఘాల అధ్యక్షుడు దాసు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T23:39:24+05:30 IST