పెట్రోలియం, గ్యాస్‌ పైప్‌లైన్ల సమీపంలో తవ్వకాలు, నిర్మాణాలు చేయొద్దు

ABN , First Publish Date - 2023-03-02T23:08:55+05:30 IST

పెట్రోలియం ఉత్పత్తుల రవాణా ప్రాంతాల్లో, గ్యాస్‌ పైపులైన్‌ వెళ్లే ప్రదేశాల్లో రైతులు తవ్వకాలు, ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) డీజీఎం రఘుపతిరావు అన్నారు.

పెట్రోలియం, గ్యాస్‌ పైప్‌లైన్ల సమీపంలో తవ్వకాలు, నిర్మాణాలు చేయొద్దు
మాక్‌డ్రిల్‌లో గ్యాస్‌ లీకైన పైపులైన్‌ను పరిశీలిస్తున్న అధికారులు

హెచ్‌పీసీఎల్‌ డీజీఎం రాఘుపతిరావు

ఘట్‌కేసర్‌ రూరల్‌, మార్చి 2: పెట్రోలియం ఉత్పత్తుల రవాణా ప్రాంతాల్లో, గ్యాస్‌ పైపులైన్‌ వెళ్లే ప్రదేశాల్లో రైతులు తవ్వకాలు, ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) డీజీఎం రఘుపతిరావు అన్నారు. అంకుషాపూర్‌లో గురువారం హెచ్‌పీసీఎల్‌, గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(గెయిల్‌) సంయుక్తంగా నిర్వహించిన మాక్‌ డ్రిల్‌లో వారు పాల్గొన్నారు. పెట్రోలియం, డీజిల్‌, కిరోసిన్‌ తదితర పెట్రో ఉత్పత్తులు, గ్యాస్‌పైపులైన్లు లీకైప్పుడు అగ్ని ప్రమాదాన్ని నివారించేందుకు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్‌డ్రిల్‌లో చేసి చూపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్‌ వరకు 572కిలో మీటర్ల దూరం పెట్రోలియం, గ్యాస్‌లైను ఉందన్నారు. పైపులైన్‌ లీకేజీ అయినట్లు తెలిస్తే గ్రామస్తులైనా, రైతులైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలని సూచించారు. రైతులు తమ భూముల నుంచి వెళ్తున్న పైపులైన్ల వద్ద ఎలాంటి తవ్వకాలు, నిర్మాణాలు చేయరాదని సూచించారు. లోతుగా దన్ను ప్లవ్‌లు సైతం వాడొద్దన్నారు. పైపులైన్‌ లీకై మంటలు చెలరేగినప్పుడు సమీప ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. చమురు, గ్యాస్‌ పైప్‌లైను లీకే అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, రెవెన్యూ, చమురు సంస్థలు, వైద్య, అగ్నిమాపక శాఖల అధికారులు వెంటనే రంగంలోకి దిగి ప్రమాదాన్ని అదుపు చేస్తాయన్నారు. అలాగే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. మాక్‌డ్రిల్‌ను విజయవంతం చేసిన హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌ సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కార్యక్రమంలో కుషాయిగూడ ఏసీపీ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండర్‌ దామోదర్‌సింగ్‌, అగ్నిమాపక శాఖ అధికారులు మల్లేష్‌, సర్పంచ్‌ జలజ, ఉపసర్పంచ్‌ బాలమణి, ఆయా సంస్థల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T23:08:55+05:30 IST