నెలలోగా ధరణి సమస్యలు పరిష్కారం కావాలి

ABN , First Publish Date - 2023-02-06T23:46:25+05:30 IST

నెల రోజుల్లోగా ధరణి సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ధరణి ఫిర్యాదులపై ఆయన జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, డీఆర్‌వో అశోక్‌కుమార్‌తో కలిసి తహసీల్దార్లు, సిబ్బందితో కలిసి సోమవారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

నెలలోగా ధరణి సమస్యలు పరిష్కారం కావాలి
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, పక్కన అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, డీఆర్‌వో అశోక్‌కుమార్‌

వికారాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నెల రోజుల్లోగా ధరణి సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ధరణి ఫిర్యాదులపై ఆయన జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, డీఆర్‌వో అశోక్‌కుమార్‌తో కలిసి తహసీల్దార్లు, సిబ్బందితో కలిసి సోమవారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నం పెట్టే రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం పెద్ద పాపమని, రైతులను దేవుళ్లుగా భావించాలని, వారి నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించే ముందు ఆ కుటుంబం గురించి ఆలోచించాలని సూచించారు. .అర్జీదారు వినతి వాస్తవమైతే పట్టాపాస్‌ పుస్తకాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం నుంచి ప్రతి మీసేవా కేంద్రం ధరణి హెల్ప్‌ డెస్క్‌గా మారాలని, హెల్ప్‌ డెస్క్‌ ఎలా పనిచేయాలనేది మీసేవా కేంద్రాల ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్‌ సూచించారు. ధరణి సమస్యలపై ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచిమధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ధరణిఽప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్లు స్వయంగా దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

వారం రోజుల్లో జియో అటెండెన్స్‌ యాప్‌ అమల్లోకి...

ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో జియో అటెండెన్స్‌ యాప్‌ ప్రవేశ పెడుతున్నామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో జియో అటెండెన్స్‌ యాప్‌పై పంచాయతీల్లోని సాంకేతిక సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. జియో అటెండెన్స్‌ యాప్‌ ద్వారా విధులకు సక్రమంగా హాజరు కాని వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు పనిచేయకుంటే ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, డీపీవో తరుణ్‌కుమార్‌, డీఎల్‌పీవోలు అనిత, శంకర్‌నాయక్‌, టెక్నికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజావాణి అర్జీలను వారం రోజుల్లో పరిష్కరించాలి

ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను వారం రోజుల్లో పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం వికారాబాద్‌ కలెక్టరేట్‌లోని సమావేశం హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ముందుగా ఆయన జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి తాను హాజరవుతానని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌గా అధికారులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, అధికారులు కూడా అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కలెక్టరేట్‌లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై 142 అర్జీలను స్వీకరించిన కలెక్టర్‌.. వాటి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆలస్యంగా వచ్చిన అధికారులకు కలెక్టర్‌ క్లాస్‌

ఉదయం 10 గంటలకే కలెక్టర్‌ నారాయణరెడ్డి కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టరేట్‌ ఆవరణ అంతా తిరిగి పరిశీలించారు. హెలీప్యాడ్‌ సమీపంలో వాహనాలు పార్కింగ్‌ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. 10.20 గంటలకే ప్రజావాణి నిర్వహించే హాల్‌కు చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చిన అధికారులను కలెక్టర్‌ క్లాస్‌ తీసుకున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి మరోసారి ఆలస్యంగా వస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. చాలా రోజుల తరువాత ప్రజావాణి హాల్‌ దరఖాస్తుదారులతో కళకళలాడింది. తమ సమస్యలపై కలెక్టర్‌ బాగా స్పందించారంటూ ఫిర్యాదుదారులు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రజావాణిలో 76 దరఖాస్తులు

మేడ్చల్‌ అర్బన్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌, ఫిబ్రవరి 6: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను తొందరగా పరిష్కరించేలా అధికారులు చూడాలని మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 76 దరఖాస్తులు వచ్చాయి. డీఆర్వో లింగ్యానాయక్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా ఘట్‌కేసర్‌ మండలపరిధి అవుషాపూర్‌లోని న్యూ సిటీ వెంచర్‌ గ్రామ అవసరాలకు వదిలిన దాదాపు 2400 గజాల పార్కు స్థలాన్ని రియల్టర్లు కబ్జా చేస్తున్నారని, దానికి కాపాడాలని ఉపసర్పంచ్‌ అయిలయ్య, వార్డుసభ్యులు శ్రీనివాస్‌, రవీందర్‌, వెంకట్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, సాయిలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-02-06T23:46:26+05:30 IST