Share News

సీసీరోడ్డు ధ్వంసం.. గ్రామస్తుల ఆందోళన

ABN , Publish Date - Dec 24 , 2023 | 11:33 PM

మండలంలోని కాచవానిసింగారంలో సీసీరోడ్డు ధ్వంసం చేయడంతో రైతులు, గ్రామస్తులు ఆందోళన చేశారు.

సీసీరోడ్డు ధ్వంసం.. గ్రామస్తుల ఆందోళన
సీసీరోడ్డును పరిశీలిస్తున్న ఎంపీవో నందకిషోర్‌, సర్పంచ్‌ కొంతం వెంకట్‌రెడ్డి

ఘట్‌కేసర్‌ రూరల్‌, డిసెంబరు 24: మండలంలోని కాచవానిసింగారంలో సీసీరోడ్డు ధ్వంసం చేయడంతో రైతులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. తాము పూర్వకాలం నుంచి ఉన్న నడకదారిని ఓ దాత సాయంతో సీసీరోడ్డు వేసుకున్నామని గ్రామస్తులు, రైతులు తెలిపారు. కొంతమంది పట్టాభూమిలో రోడ్డువేశారని రాత్రిరాత్రికే సీసీరోడ్డును జేసీబీలతో పగులగొట్టి ధ్వంసం చేశారని ఆరోపించారు. స్థానికులు పాలకవర్గానికి, పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆదివారం ఉదయం సర్పంచ్‌ కొంతం వెంకట్‌ రెడ్డి, వార్డుసభ్యులతో కలిసి సీసీరోడ్డును పరిశీలించారు. అదే గ్రామానికి చెందిన దాత భద్రారెడ్డి సీసీరోడ్డు నిర్మించినట్లు తెలిపారు. అట్టి సీసీరోడ్డును ధ్వంసం చేయడంపై ఎంపీవోకు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీరోడ్డు ద్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు అధికారులను కోరారు.

పట్టాభూమిలో సీసీరోడ్డు వేయడం హేయం

తాము కొనుగోలు చేసిన భూమిలో సీసీరోడ్డు వేశారని నగరానికి చెందిన శనిగరం రాము, రవీంద్రకుమార్‌ కాచవానిసింగారంలో విలేకర్లకు తెలిపారు. కాచవానిసింగారం రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్‌ 83లో తాము 23గుంటల భూమిని కోనుగోలు చేశామని, దానికి సంబందించిన రిజిస్ట్రేషల్‌ పత్రాలు ఉన్నాయని తెలిపారు. తమ పట్టాభూమిని కబ్జాచేసి వందఫీట్ల భూమిలో సీసీరోడ్డు నిర్మాణం చేశారని ఆరోపించారు. రైతులు అడిగితే తాము స్వచ్ఛందంగా 12 నుంచి 15 ఫీట్ల రోడ్డును ఇచ్చేవారమని, తమకు తెలియకుండానే తమ భూమి పక్కనఉన్న సీసీరోడ్డు నిర్మాణదాత భద్రారెడ్డి వందఫీట్ల రోడ్డు వేయడమేంటని రాము, రవీంద్రకుమార్‌ ప్రశ్నించారు. తమ భూమిలో సీసీరోడ్డు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీసుస్టేషన్‌ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Updated Date - Dec 24 , 2023 | 11:34 PM