డెంగీ డేంజర్ బెల్స్!
ABN , First Publish Date - 2023-12-10T23:19:32+05:30 IST
ఎక్కడచూపినా జ్వరం, ఒళ్లు నొప్పులతో జనం అల్లాడిపోతున్నారు. చాలా వరకు గ్రామీణులు మంచాన పడుతున్నారు. పల్లె నుంచి పట్నం వరకు ఇదే పరిస్థితి నెలకొంది.
జిల్లాలో ఇప్పటి వరకు 509 కేసుల నమోదు
నవంబరులో 48, డిసెంబరులో ఇప్పటి వరకు 2 కేసులు
జిల్లాలో పారిశుధ్య లోపంతో విజృంభిస్తున్న దోమలు
వాతావరణ మార్పులతో పెరుగుతున్న జ్వర పీడితులు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం కరువు
ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులు పరుగులు
వివిధ రకాల పరీక్షల పేరిట నిలువు దోపిడీ
పట్టించుకోని వైద్యారోగ్య శాఖ అధికారులు
జిల్లాలో చాలా చోట్ల డెంగీ జ్వరంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో విష జ్వర పీడితుల సంఖ్య ఎక్కువగా ఉంది. డెంగ్యూ లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నారు. దోమ కాటుకుతో డెంగీ, మలేరియా వ్యాపిస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడ పారిశుధ్య లోపంతో దోమల వ్యాప్తి ఎక్కువవుతోంది. రోగ పీడితులు ఒంటి నొప్పులు, చలి జ్వరం లక్షణాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. నిర్వాహకులు ఐదు నుంచి పది రోజులు ఇన్ పేషెంట్లుగా చేర్చుకొని రూ.20వేల నుంచి 50వేల వరకు రోగుల నుంచి పిండేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 10): ఎక్కడచూపినా జ్వరం, ఒళ్లు నొప్పులతో జనం అల్లాడిపోతున్నారు. చాలా వరకు గ్రామీణులు మంచాన పడుతున్నారు. పల్లె నుంచి పట్నం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో బాధితులు వ్యాధి పీడితులు అధికమవుతున్నారు. వారంతా వైద్యం కోసం ఆసుత్రులకు పరుగులు పెడుతున్నారు. పల్లెల్లో పలు చోట్ల పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. దోమల దాడి కారణంగా డెంగ్యూ, మలేరియా వ్యాపిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు డెంగ్యూ ఫీవర్ పేరుతో కార్పొరేట్, పైవ్రేట్ ఆసుపత్రులు రోగులను విలువు దోపిడీ చేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు రావడంతో విష జ్వరాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా డెంగ్యూ లక్షణాలతో వస్తున్న వారు అధికంగా ఉంటున్నారు. జిల్లా వైద్యారోగ్య అధికారులు చెబుతున్న లెక్కలకు.. ఆసుపత్రులకు వస్తున్న బాధితుల సంఖ్యకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి రాని డెంగ్యూ కేసులు జిల్లాలో వందల సంఖ్యలోనే ఉంటాయని సమాచారం. ఎక్కువగా కార్పొరేట్, పైవ్రేట్ ఆస్పత్రిలో డెంగ్యూ చికిత్స పొందడం వల్ల అవి సాధారణ అధికారిక లెక్కల్లోకి రావడం లేదంటున్నారు. ఈ ఏడాదిలో డెంగ్యూ కేసులు ఎక్కువగా ఆగస్టు, సెప్టెంబరు నెలలో అధికంగా నమోదయ్యాయి. తర్వాత నెమ్మదిగా కేసులు తగ్గినప్పటికీ.. అక్టోబరులో 80, నవంబరులో 48 కేసుల చొప్పున నమోదయ్యాయి. డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు రెండు కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. పైవ్రేట్, కార్పొరేట్ గ్రామీణ వైద్యుల వద్ద వందల సంఖ్యలో రోగులు రోజూ వైద్యసేవలు పొందుతుంటారు. ఇటీవల మలేరియా ప్రభావం కొంతమేర తగ్గినా.. ప్రజలు డెంగ్యూ బారిన పడుతున్నారు. ఈ ఏడాదిలో జూలై నెలలో ఒకే ఒక మలేరీయా కేసు నమోదైంది.
ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందకపోవడంతో పైవ్రేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అయితే పైవ్రేట్ రక్త పరీక్ష కేంద్రాల్లో కూడా పరీక్షలు చేసి డెంగీ అని చెప్పి రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఐదు నుంచి పది రోజులపాటు ఇన్‌పేషెంట్లుగా చేర్చుకొని రూ.20వేల నుంచి 50వేల వరకు రోగుల నుంచి పిండేస్తున్నారు. వాస్తవానికి పరీక్షల ధరలు తెలుపుతూ రక్త పరీక్ష కేంద్రాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలి. కానీ చాలా రక్త పరీక్ష కేంద్రాల్లో ఇవి కనిపించడం లేదు. రోగుల బంధువులు బ్లడ్ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం పైవ్రేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.
నివారణ ఇలా..
దోమలు వృద్ధి చెందకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలి. నిల్వ నీరు ఉండకుండా జాగ్రత్త పడాలి. నీటిపై దోమల మందు చల్లించడం, ఫాగింగ్ చేయించడం చేయాలి. నీటి కంటైనర్లకు, ఆహారపదార్థాలకు ఎల్లప్పుడూ మూతలు పెట్టాలి. దోమ తెరలు వాడటం ఉపయోగకరంగా ఉంటుంది. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే బట్టలు ధరించటం, ఓడోమాస్ వంటి క్రీములు రాసుకోవడం వంటివి చేయాలి.
ప్రైవేట్‌లో పరీక్షల కోసం వేలల్లో ఖర్చు
ఆస్పత్రుల నిర్వాహకులు అధిక మొత్తంలో ఫీజులతో పాటు డెంగీ పేరుతో అన్ని రకాల రక్త పరీక్షలు చేసి రోగుల వద్ద వేలల్లో వసూలు చేస్తున్నారు. డెంగీ, టైఫాయిడ్, మలేరియా, ప్లేట్లెట్ కౌంట్ తోపాటు మరిన్ని పరీక్షలు చేయించుకురావాలని వైద్యులు సూచిస్తున్నారు. డెంగీ పరీక్షకు రూ.750 నుంచి రూ.1,500 తీసుకుంటున్నారు. అలాగే మలేరియా, టైఫాయిడ్ నిర్ధారణ పరీక్షకు రూ.400 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. మిగిలిన పరీక్షలకు మరో రూ.1,500 గుంజుతున్నారు. మొత్తంగా జ్వర బాధితులకు పరీక్షలకే సుమారు రూ.4వేల నుంచి 5వేల వరకు ఖర్చవుతోంది. దీనికి డాక్టర్ ఫీజు, మందులు, ఇతర ఖర్చులకు మరో రూ.5వేల భారం పడుతోంది.
ఎక్కడిక్కకడ లోపించిన పారిశుధ్యం
కొద్దిపాటి జల్లులకే గ్రామాల్లోని కాలువల్లోని మురుగునీరు రోడ్లపై పారుతోంది. మరోవైపు దోమల ఉధృతీ పెరిగింది. ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణకు అరకొర చర్యలే చేపడుతోంది. ఇంకోవైపు గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా పాలకవర్గాలు పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు వ్యాధుల బారిన పడి అల్లాడుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పరీక్షలు చేసి డెంగ్యూగా నిర్ధారణ అయిన కేసులనే వైద్యారోగ్య శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు.
డెంగ్యూ లక్షణాలు
డెంగీ వచ్చిన వారికి విపరీతమైన జ్వరం ఉంటుంది. చలిగా అనిపిస్తుంది. తీవ్ర ఒళ్లునొప్పులు, తలనొప్పి ఉంటాయి. శరీరంపై ఎరుపు రంగులో దద్దులు వస్తాయి. విపరీతంగా దాహం అవుతుంది. నోరు తడారిపోతుంది. వాంతులు అవుతుంటాయి. కళ్ల నొప్పి ఉంటుంది. పిల్లల్లో నోరు పొక్కడం, గొంతునొప్పి పొడి దగ్గులాంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం వచ్చిన రెండో రోజున చర్మం ఎరుపెక్కి మంటగా ఉంటుంది. కడుపు నొప్పి, వాంతి, వికారం అనిపిస్తుంది. జ్వరం బాగా వచ్చిన వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. రెండు రోజుల కన్నా ఎక్కువ సమయం పాటు జ్వరం ఉంటే ఆలస్యం చేయకూడదు. పాజిటివ్ వస్తే వైద్యులు రోగిని ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అందజేస్తారు. చికిత్స సమయంలో రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మందులు సమయానికి వేసుకోవాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దోమలు లేకుండా చూసుకోవాలి. ఒక వేళ ఉన్నా అవి కుట్టకుండా మచ్చర్‌దాన్ వాడాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వైద్య పరీక్షల్లో డెంగ్యూ ఉందని నిర్ధారణ అయితే నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే చికిత్స తీసుకోవాలి. రోగి శరీరాన్ని చల్లని గుడ్డతో తుడుస్తుండాలి. జ్వరం వచ్చిన వారిని చల్లని రమూలో పడుకోబెట్టాలి. డెంగీ వస్తే రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోతుంది. అలాంటప్పుడు వైద్యులు ప్లేట్లను పెంచేందుకు మందులు ఇస్తారు. వాటితోపాటు బొప్పాయి ఆకుల రసాన్ని స్వల్ప మోతాదులో సేవిస్తుండాలి. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. డెంగీ వచ్చిన వారు రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు, ఇతర ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే వ్యాధి నుంచి త్వరగా బయట పడేందుకు అవకాశం ఉంటుంది. తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రాక్ష, కివీలు, దానిమ్మ, నారింజ పండ్లను బాగా తీసుకుంటే డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవచ్చు. రెండు, మూడు రకాల కూరగాయలను గ్రైండ్ చేసి వాటి రసం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కొబ్బరి నీరు ఎక్కువగా తాగుతుండాలి. డెంగ్యూ జ్వరం నుంచి కోలుకునేందుకు హెర్బల్ టీ ఉపకరిస్తుంది. వేప ఆకులు డెంగ్యూ వైరస్ వ్యాప్తిని అరకడతాయి. వేప ఆకులతో స్నానం చేయడం చాలా మంచిది. నూనె పదార్థాలు, వేపుడ్లు, కెఫిన్, కార్బొనేటెడ్ పానీయాలు, కారం వస్తువులు తినకుండా చూసుకోవాలి. కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలను డెంగ్యూ జ్వరం తగ్గేంత వరకు తీసుకోకపోవడమే మంచిది.