తహసీల్దార్‌ కార్యాలయానికి కరెంట్‌ కట్‌

ABN , First Publish Date - 2023-06-29T00:04:15+05:30 IST

విద్యుత్‌ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కొడంగల్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి విద్యుత్‌ సిబ్బంది బుధవారం కరెంట్‌ కట్‌ చేశారు.

తహసీల్దార్‌ కార్యాలయానికి కరెంట్‌ కట్‌
తహసీల్దార్‌ కార్యాలయం ప్రజల నిరీక్షణ

  • పెండింగ్‌లో విద్యుత్‌ బిల్లులు

  • నిలిచిపోయిన రెవెన్యూ సేవలు

కొడంగల్‌, జూన్‌ 28: విద్యుత్‌ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కొడంగల్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి విద్యుత్‌ సిబ్బంది బుధవారం కరెంట్‌ కట్‌ చేశారు. బకాయి పడిన రూ.3లక్షల 79 వేల 249 విద్యుత్‌ బిల్లు పెండింగ్‌లో ఉండడమే ఇందుకు కారణమని విద్యుత్‌ సిబ్బంది తెలిపారు. దీంతో కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు, తదితర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2016 నుంచి ఇప్పటి వరకు రూ.3లక్షల 70వేలకు పైగా విద్యుత్‌ బిల్లు బకాయి ఉండటంతో విద్యుత్‌శాఖ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశానుసారం విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. బుధవారం 20వరకు రిజిస్ర్టేషన్‌లు, మ్యూటేషన్‌లు ఇతరాత్ర వాటి కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పడిగాపులు పడాల్సివచ్చింది. దీంతో ప్రజలు తహసీల్దార్‌, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ విషయమై తహసీల్దార్‌ బుచ్చయ్యను వివరణ కోరగా ప్రతీ మూడునెలలకోసారి ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.15వేలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. మరో మూడు బిల్లులు ఎస్టీవోలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఏఈ ప్రవీణ్‌ను వివరణ కోరగా తహసీల్దార్‌ కార్యాలయం పెండింగ్‌ బిల్లు చెల్లించాలని పలుమార్లు కోరినా పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశానుసారం సరఫరాను నిలిపి వేసినట్లు తెలిపారు. పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో రూ.67లక్షల 95వేలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌ బిల్లులు

ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ దీపాలు, కంప్యూటర్‌ల నిర్వహణకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నా బిల్లులు చెల్లించడం లేదు. తహసీల్దార్‌ కార్యాలయం పెండింగ్‌ బిల్లు ఇప్పటి వరకు రూ.3లక్షల 79 వేల 249 ఉండగా ఎంపీడీవో కార్యాలయానికి సంబంధించి రూ.3లక్షల 64వేల 86, ఫారెస్టు కార్యాలయంలో రూ.9లక్షల 81వేల 61, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ.లక్షా 81వేల 843 బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు విద్యుత్‌ శాఖ ఏఈ ప్రవీణ్‌ తెలిపారు.

Updated Date - 2023-06-29T00:04:15+05:30 IST