వికారాబాద్ జిల్లాలో తగ్గిన నేరాలు : ఎస్పీ కోటిరెడ్డి
ABN , Publish Date - Dec 30 , 2023 | 12:00 AM
ఈ ఏడాది జిల్లాలో నేరాలు తగ్గాయని వికారాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఏఎస్పీలు మురళీధర్, రవీందర్‌రెడ్డిలతో కలిసి మాట్లాడారు.
వికారాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఈ ఏడాది జిల్లాలో నేరాలు తగ్గాయని వికారాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఏఎస్పీలు మురళీధర్, రవీందర్‌రెడ్డిలతో కలిసి మాట్లాడారు. జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసు శాఖ అందరి సహకారంతో తీసుకున్న చర్యలు సత్పలితాలు ఇచ్చాయని చెప్పారు. గతేడాది వరకు జిల్లాలో 2596 సీసీటీవీలు ఉంటే, ఈ ఏడాది 1035 సీసీటీవీలు అదనంగా ఏర్పాటు చేసి కమాండ్ అండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకు అనుసంధానం చేసినట్లు తెలిపారు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో శారీరక దాడులనేరాలు, హత్యలు, హత్యాయత్నాలు తగ్గాయని చెప్పారు. జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు టాస్క్‌ఫోర్స్‌ను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారీ ఎత్తున నకిలీ విత్తనాలు, కల్తీ టీ పౌడర్, పీడీఎస్ బియ్యం, కల్తీ కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకుని 135 కేసులు నమోదు చేసి 420మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. ఈ ఏడాది మహిళలు, యువతులను వేధింపులకు గురిచేసిన ఘటనల్లో 5 ఎఫ్‌ఐఆర్‌లు, 47పెట్టీ కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో 343 అవగాహనా సదస్సులు నిర్వహించగా, 14మందికి కౌన్సెలింగ్ చేశారని చెప్పారు. లైంగికదాడి ఘటనల్లో బాధితులకు భరోసా కల్పించడంలో భరోసాకేంద్రం ముఖ్యపాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈఏడాది జిల్లాలో 89 కేసులు నమోదుచేయగా, 32అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారని, 25 ఇళ్ల సందర్శనకు వెళ్లార ని తెలిపారు. ఈ ఏడాది డయల్ 100కు 33287 కాల్స్ రాగా, వీటిలో 235 ఎఫ్‌ఐఆర్, 31539 కాంప్రమైజ్, 1513 ఇతర కేసులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది జిల్లాలో 15 కార్డెన్ సెర్చ్‌లు నిర్వహించి సరైన పత్రాలు లేని 967 వాహనాలు సీజ్ చేశామన్నారు. అక్రమ ఇసుక రవాణా, గుట్కా, గంజాయి, దొంగతనాలు, పేకాట, మట్కా, ఇతర అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేసేందుకు 10సార్లు నాకాబందీ నిర్వహించి 10,234 వాహనాలు తనిఖీ చేయగా, వాటిలో సరైన పత్రాలు లేని 245వాహనాలను సీజ్ చేశామని చెప్పారు. ఈ ఏడాది విధి నిర్వహణలో బాగా పనిచేసిన 2326 మంది అధికారులు, సిబ్బందికి రివార్డులు అందించామని చెప్పారు. 1286 మందికి గుడ్ సర్వీస్ ఎంట్రీ, 963 మందికి క్యాష్ రివార్డ్స్, 28 మందికి కమెండేషన్, 31 మందికి ప్రశంసా పత్రాలు, 15 మందికి సేవా పతకాలు, ఒకరికి అతి ఉత్రిక్ట్ సేవా పతకం, ఇద్దరికి ఉత్రిక్ట్స్ సేవా పతకం ఇచ్చామని తెలిపారు.
న్యూఇయర్ వేడుకలపై నజర్
కొత్త సంవత్సరం పురస్కరించుకుని వేడుకలపై నజర్ పెట్టినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలోని రిసార్ట్స్ యజమానులు ఈవెంట్స్ నిర్వహణకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. సరైన అనుమతులు లేకుండా వేడుకలు నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త సంవత్సరం పురస్కరించుకుని ఈనెల 31వ తేదీన డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. జిల్లాలో 25 ప్రాంతాల్లో 19 బృందాలతో తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.