బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలి
ABN , First Publish Date - 2023-06-14T22:42:56+05:30 IST
మండల పరిధిలోని వెంకటాపూర్ గేట్ నుంచి పడకల్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు కదం తొక్కారు.
కదం తొక్కిన కాంగ్రెస్ నాయకులు
పెద్దూరు నుంచి పడకల్ వరకు పాదయాత్ర
తలకొండపల్లి , జూన్ 14: మండల పరిధిలోని వెంకటాపూర్ గేట్ నుంచి పడకల్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు కదం తొక్కారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరై రెండేళ్లు కావొస్తున్నా పనులు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. వెంకటాపూర్ గేటు నుంచి పడకల్ వరకు పాదయాత్ర నిర్వహించారు. వెంకటాపూర్ గేటు వద్ద కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డోకూరు ప్రభాకర్‌రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. మూడు కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో దేవునిపడకల్, పెద్దూర్ తండా, పడకల్ గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ కాడేమోని శ్రీశైలం మాట్లాడారు. బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితం రూ.54.75 లక్షలు మంజూరు చేసి టెండర్లు నిర్వహించినా నేటికీ పనులు ఎందుకు ప్రారంభించ లేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్‌కు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేదని ఆరోపించారు. బీటీ రోడ్డు నిర్మించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో టీపీసీసీ కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి, ఎంపీటీసీ రమేశ్, నాయకులు అజీం, రవీందర్‌యాదవ్, జనార్ధన్‌రెడ్డి, ఆరీఫ్, డిగ్రీ కృష్ణ, నర్సమ్మ, గౌస్, శ్రీను, నర్సింహ, పరమేశ్, విజయ్, భిక్షపతి, రాజు, రమేశ్ పాల్గొన్నారు.